సీమకు సుప్రభాతం.. | - | Sakshi
Sakshi News home page

సీమకు సుప్రభాతం..

Jan 17 2026 8:29 AM | Updated on Jan 17 2026 8:29 AM

సీమకు

సీమకు సుప్రభాతం..

ఏకాదశ రుద్రులతో శోభిల్లిన కోనసీమ

అంబరాన్నంటిన ‘ప్రభ’ల సంబరాలు

జగ్గన్నతోటలో ఆధ్యాత్మిక పారవశ్యం

కొత్తపేటలో తీర్థానికి పోటెత్తిన భక్తులు

పలుచోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం

సాక్షి, అమలాపురం/అంబాజీపేట/కొత్తపేట:

ప్రకృతి రమణీయత ఉట్టిపడే కోనసీమ సంక్రాంతి పండగ వేళ మరింత శోభాయమానమై అలరారుతుంది. వీధుల్లో రంగవల్లులు.. కూడళ్లలో భోగిమంటలు.. సంప్రదాయ దుస్తులలో ముస్తాబయ్యే పల్లెవాసులు.. ఒకటేమిటి.. ఆ సందడే వేరుగా ఉంటుంది. రైతుల వద్ద.. జనం వద్ద సొమ్ములు లేక పండగ ఈసారి కళ తప్పినా ప్రభల తీర్థాలతో కాస్తా సందడి వచ్చింది. చారిత్రక.. ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉన్న జగ్గన్నతోట ప్రభల తీర్థం శుక్రవారం వైభవంగా జరిగింది. ఆకు పచ్చని వరిచేల మీదుగా.. నిలువెత్తు కొబ్బరి తోటల మధ్య నుంచి.. పంటకాలువల గలగలల మధ్య అందమైన రంగురంగుల ప్రభలు తీర్థాలకు తరలివచ్చాయి. కొత్తపేట తీర్థంతో గురువారం ఆరంభమైన ప్రభల ఉత్సవాలు శనివారం ముక్కనుమ వరకు సాగనున్నాయి.

కొలువుదీరిన ఏకాదశ రుద్రులు

చారిత్రక ప్రసిద్ధి పొందిన అంబాజీపేట మండలం మొసలపల్లి శివారు జగ్గన్నతోట ప్రభల తీర్థానికి భక్తులు పోటెత్తారు. ఏకాదశ రుద్రుల ప్రభలు పంట పొలాలు, కాలువలు దాటుకు వచ్చి భక్తులను పరవశింపచేశాయి. ప్రభలపై వచ్చిన ఈశ్వరుని ప్రతిరూపాలను చూసి భక్తులు తన్మయత్వానికి గురయ్యారు. మొక్కులు తీర్చుకున్నారు. జిల్లా నలుమూలల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాలలోను, ఇతర దేశాల్లోను ఉపాధి కోసం వెళ్లినవారు తీర్థానికి కుటుంబ సమేతంగా వచ్చారు. వృద్ధులు, యువకులు, మహిళలు అనే తేడా లేకుండా తీర్థానికి వచ్చారు. భక్తుల ఓంకార నాదాలు.. ప్రభలకు వేలాడదీసిన జేగంటల శబ్దాలు.. ప్రభలు మోసేవారి అశ్శరభ.. శరభ నినాదాలతో ఆ ప్రాంతం ఆధ్యాత్మికతను సంతరించుకుంది.

వ్యాఘ్రేశ్వరునికి గౌరవ వందనం

జగన్నతోట ప్రభల ఊరేగింపు సంప్రదాయ పద్ధతిలో సాగింది. వ్యాఘ్రేశ్వరం నుంచి వ్యాఘ్రేశ్వర స్వామి ప్రభ వచ్చినప్పుడు మిగిలిన ప్రభలను గౌరవ సూచకంగా ఒకసారి పైకెత్తి లేపారు. గంగలకుర్రు అగ్రహారం ఉమా పార్వతీ సమేత వీరేశ్వరస్వామి, గంగలకుర్రు చెన్నకేశవ మల్లేశ్వరస్వామి ప్రభలు అప్పర్‌ కౌశిక దాటుకుని రావడాన్ని భక్తులు భక్తి పారవశ్యంతో వీక్షించారు. కొన్ని కుటుంబాల వారు గూడు ఎడ్లబండ్లపై తీర్థానికి రావడం పలువురిని ఆకట్టుకుంది. జగన్నతోట తీర్థానికి రాష్ట్ర కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌, పర్యాటక శాఖమంత్రి కందుల దుర్గేష్‌తో జిల్లా కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌ కుమార్‌ దంపతులతో పాటు ఎస్పీ రాహుల్‌ మీనా, ఎంపీ హరీష్‌ మాధుర్‌, ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణతో పాటు, ఏపీ సాంస్కృతిక, కళలు కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ పొడపాటి తేజస్విని తదితరులు హాజరై ప్రభలను వీక్షించారు. కాగా

అంబరాన్నంటిన కొత్తపేట ఉత్సవం

కొత్తపేట ప్రభల ఉత్సవం అంబరాన్ని తాకింది. మకర సంక్రాంతి సందర్భంగా గురువారం జరిగిన ఈ ఉత్సవానికి ఉభయ గోదావరి జిల్లాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచీ లక్షలాదిగా భక్తులు తరలిరావడంతో ఆ గ్రామం జనసంద్రమైంది. రోడ్లు, పురవీధులు జనంతో కిక్కిరిసిపోయాయి. పాత రామాలయం, కొత్త రామాలయం, బోడిపాలెం వీధుల నుంచి ప్రారంభమైన ప్రధాన ప్రభల ఊరేగింపు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మూడు వీధుల వారు పాల్గొన్నారు. తిరుగు ఊరేగింపులో భాగంగా పాత, కొత్త రామాలయం వీధుల వారు అర్ధరాత్రి 2 గంటల నుంచి శుక్రవారం ఉదయం 5.30 గంటల వరకు పాల్గొన్నారు. పోటాపోటీగా నిర్వహించిన బాణసంచా కాల్పులు, ఆకాశం రంగురంగుల వెలుగులతో మెరిసిపోయింది.

మామిడికుదురు మండలం కొర్లగుంటలో జరిగిన తీర్థంలో 12 ప్రభలు కొలువుదీరాయి. కాట్రేనికోన మండలం చెయ్యేరు, రావులపాలెం మండలం దేవరపల్లి, పి.గన్నవరం మండలం మానేపల్లి, నాగుల్లంక, పప్పులవారిపాలెం, ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లి, ఎన్‌.కొత్తపల్లి, వాడపర్రు, సన్నవిల్లి, అమలాపురం మండలం సాకుర్రు గరువు, బండారులంక, అమలాపురం పట్టణంలో గనికమ్మగుడి, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, మలికిపురం మండలం కేశనపల్లి, తూర్పుపాలెం, రాజోలు పొదలాడ, ముమ్మిడివరం మండలం పల్లిపాలెం, క్రాప చింతలపూడి, చెయ్యేరు, ఐ.పోలవరం శివారు పెదమడి, ఐ.పోలవరం మండలం గుత్తెనదీవి, కపిలేశ్వరపురం మండలాల్లో ప్రభల తీర్థాలు అంగరంగ వైభవంగా సాగాయి.

55 అడుగుల ఎత్తయిన ప్రభ

అంబాజీపేట మండలం వాకలగరువు సరిహద్దులో జరిగిన ప్రభల తీర్థంలో వాకలగరువుకు చెందిన ఉమా సర్వేశ్వరస్వామి వారి ప్రభ, తొండవరం ఉమా తొండేశ్వరస్వామి వార్ల ప్రభలు 55 అడుగుల ఎత్తున నిర్మించారు. కోనసీమలో జరిగే ప్రభల తీర్థాల్లో అతి ఎత్తయిన ప్రభలుగా ఇవి గుర్తింపు పొందాయి.

సీమకు సుప్రభాతం..1
1/1

సీమకు సుప్రభాతం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement