రూ.లక్ష విరాళం
నిడదవోలు రూరల్: తిమ్మరాజుపాలెం గ్రామంలోని కోట సత్తెమ్మ ఆలయంలో నిత్యాన్నదాన ట్రస్ట్‌కు నిడదవోలుకు చెందిన డాక్టర్ తోపరాల కల్యాణ చక్రవర్తి బుధవారం రూ.లక్ష విరాళం అందించారు. ఈ సందర్భంగా దాతకు అమ్మవారి చిత్రపటం అందజేసి సన్మానించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ, అసిస్టెంట్ కమిషనర్ వి.హరిసూర్యప్రకాష్, ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ దేవులపల్లి రవిశంకర్, ప్రధాన అర్చకుడు అప్పారావు శర్మ పాల్గొన్నారు.
20 లోపు ధ్రువపత్రాలు
సిద్ధం చేసుకోవాలి
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): గత ఏడాది డిసెంబర్ 7వ తేదీన నిర్వహించిన నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్‌షిప్ పరీక్షకు హాజరైన విద్యార్థులు తమ కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, 7వ తరగతి మార్కుల సర్టిఫికెట్లను ఈనెల 20వ తేదీ లోపు సిద్ధం చేసుకోవాలి. జిల్లా పాఠశాల విద్యాశాఖాధికారి కె.వాసుదేవరావు బుధవారం ప్రకటనలో ఈ విషయం తెలిపారు. సర్టిఫికెట్ల ధ్రువీకరణకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో తెలియజేస్తామన్నారు.
సముద్రమంత సైన్యం
గోష్పాదమంతైంది
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): కురు పాండవ సంగ్రామం 18వ రోజు 11 అక్షౌ హిణుల సముద్రమంత కురుసైన్యం గోష్పాదమంత అయ్యిందని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. బుధవారం హిందూ సమాజంలో ఆయన చివరి రోజు యుద్ధ విశేషాలను వివరించారు. సర్వసైన్యాధిపతి శల్యుని, అతడి సోదరుని ధర్మరాజు వధిస్తాడు. సహదేవుడు శకునిని వధిస్తాడు. వికల మనస్కుడైన దుర్యోధనుడు ఒంటరిగా, కాలి నడకన వెళ్లి జల స్తంభన విద్య ద్వారా నీటి మడుగులోకి ప్రవేశిస్తాడు. ఈ వార్త తెలిసిన పాండవులు మడుగు వద్దకు వెళ్లి దుర్యోధనుని యుద్ధానికి ఆహ్వానిస్తారు. తన వారందరూ మరణించారు కనుక, రాజ్యం మీద తనకు ఆసక్తి లేదని, పాండవులకే ఇచ్చి వేస్తానని దుర్యోధనుడు అంటాడు. దానంగా ఇచ్చిన రాజ్యాన్ని మేము స్వీకరించబోమని ధర్మరాజు చెబుతాడు. భీముడు గదతో తొడలు బద్దలు కొట్టగా దుర్యోధనుడు రణభూమిలో పడిపోతాడని సామవేదం అన్నారు.
రూ.లక్ష విరాళం


