జగన్ పాలనలోనే అందరి సంక్షేమం
● ప్రజలను మోసం చేసిన
చంద్రబాబు సర్కార్
● స్పష్టం చేసిన ఎన్‌ఆర్‌ఐలు,
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు
రాజమహేంద్రవరం సిటీ: అమలు కాని హామీలిచ్చి అధికారం చేపట్టిన చంద్రబాబు ప్రభుత్వం.. సామాన్య ప్రజలకు మొండిచేయి చూపిందని పలువురు ఎన్‌ఆర్‌ఐలు, ఇతర రాష్ట్రాల్లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చేస్తున్న వారు అభిప్రాయపడ్డారు. సంక్రాంతి పండగకు సొంతూరు రాజమహేంద్రవరానికి వచ్చిన వారందరూ తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రభుత్వం కన్నా గత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనే అద్భుతంగా ఉందని కితాబు ఇచ్చారు. నగరానికి చెందిన వై.ప్రసాదరెడ్డి, సమీర్‌రెడ్డి, సాయి శ్రావ్య, తరుణ్ రెడ్డి తదితరులు అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా పని చేస్తున్నారు. వీరందరూ సంక్రాంతికి రాజమహేంద్రవరం వచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి, ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వ పనితీరుపై చర్చించుకున్నారు.
జగన్ పాలన భేష్
సమీర్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా ప్రజల వద్దకు ప్రభుత్వ పాలన అందించే దిశగా చర్యలు చేపట్టారన్నారు. నాడు – నేడు కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా తయారు చేసిన ఘనత ఆయనదేనన్నారు. గ్రామ సచివాలయాలు, విలేజ్ హెల్త్ క్లినిక్‌లు, రైతు భరోసా కేంద్రాలు నిర్మించారన్నారు. ఇంటి వద్దకే రేషన్ పంపిణీ చేపట్టారని గుర్తు చేసుకున్నారు.
విద్య, వైద్యానికి ప్రాధాన్యం
సాయి శ్రావ్య మాట్లాడుతూ, రాష్ట్రంలో విద్య, వైద్యానికి జగన్ విశేష కృషి చేశారని కొనియాడారు. పేదలకు వైద్య విద్య అందించేందుకు 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టారన్నారు. పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వాస్పత్రులను ఆధునీకరించి, నాణ్యమైన వైద్యసేవలు అందించారన్నారు. ప్రతి జిల్లాకూ ఒక వైద్య కళాశాలల ఉండాలనే లక్ష్యంతో కొత్తగా ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణం చేపట్టారన్నారు. ఈ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం పీపీపీ పేరుతో ప్రస్తుతం కుట్రలు చేస్తోందని అభిప్రాయపడ్డారు. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు పేరుతో మిగిలిన ప్రయాణికులందరినీ ఇబ్బందులకు గురి చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తం చేశారు.
చంద్రబాబు
పాలనలో కష్టాలు
తరుణ్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు ఎంతో మేలు చేసే వలంటీర్ వ్యవస్థను చంద్రబాబు ప్రభుత్వం తొలగించి, సచివాలయ వ్యవస్థను నీరుగార్చిందన్నారు. ఇంటింటికీ రేషన్ పథకాన్ని పూర్తిగా రద్దు చేయడంతో ప్రజలు కష్టాలు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల నిర్మాణానికి నిధులు లేవంటున్న చంద్రబాబు ప్రభుత్వం.. రూ.1,700 కోట్లతో ఎన్టీ రామారావు విగ్రహం ఏర్పాటుకు చర్యలు చేపట్టడం విడ్డూరంగా ఉందని అభిప్రాయపడ్డారు.
జగన్ పాలనలోనే అందరి సంక్షేమం
జగన్ పాలనలోనే అందరి సంక్షేమం


