
జిల్లా నైపుణ్యాభివృద్ధి కేంద్రంలో టి–హబ్
రాజమహేంద్రవరం రూరల్: బొమ్మూరులోనిన పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో కొత్తగా నిర్మిస్తున్న జిల్లా నైపుణ్యాభివృద్ధి కేంద్రం ప్రాంగణంలో నూతన ఆవిష్కరణలకు దోహదం చేసేలా కేంద్ర ప్రభుత్వ గ్రాంటుతో టి–హబ్ ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు. నైపుణ్యాభివృద్ధి కేంద్ర ప్రాంగణాన్ని మంగళవారం ఆమె పరిశీలించి, భవనం పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జిల్లా యువతకు మరింత ఉపాధి, ఆవిష్కరణలకు అవకాశాలు కల్పించేందుకు ఈ ప్రాంగణంలో ప్రాథమిక శిక్షణ తరగతులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కేంద్ర నిధులతో చేపట్టనున్న ఈ భవన నిర్మాణం వేగంగా పూర్తి చేయాలని ఏపీఈడబ్ల్యూఐడీసీ ఏఈ శంకర్‌ను ఆదేశించారు. ప్రస్తుత భవనంలో నైపుణ్య శిక్షణలు త్వరితగతిన ప్రారంభించాలని జిల్లా నైపుణ్యాధికారి వీడీజీ మురళిని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో ల్యాండ్ సర్వేయర్ ఏడీ బి.లక్ష్మీనారాయణ, డిప్యూటీ తహసీల్దార్ చైతన్య తదితరులు పాల్గొన్నారు.
వెబ్‌సైట్‌లో అర్హుల జాబితా
రాజమహేంద్రవరం రూరల్: మిషన్ వాత్సల్య, వన్‌స్టాప్ సెంటర్, చిల్డ్రన్ హోమ్‌లలో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో అర్హులు, అనర్హుల జాబితాను తూర్పు గోదావరి జిల్లా అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచారు. జిల్లా మహిళా, శిశు సంక్షేమ సాధికారిత అధికారి విజయకుమారి మంగళవారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. తమ కార్యాలయం ఆధ్వర్యాన గత ఏడాది అక్టోబర్ 14న, ఈ ఏడాది జనవరి 31న, ఏప్రిల్ 7న మిషన్ వాత్సల్య, వన్‌స్టాప్ సెంటర్, చిల్డ్రన్ హోమ్‌లలో ఖాళీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశామని వివరించారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులు, అనర్హుల వివరాలను eastgodavari.ap.gov.in వెబ్‌సైట్‌లో చూడవచ్చని పేర్కొన్నారు. అలాగే, కలెక్టరేట్‌లోను, బొమ్మూరులోని తమ కార్యాలయంలోని నోటీసు బోర్డులోను ఈ జాబితాను ఉంచామన్నారు. అభ్యర్థుల విద్యార్హతలు, అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని ఇంటర్వ్యూకు పిలుస్తామని తెలిపారు. ఈ జాబితాపై అభ్యంతరాలుంటే సంబంధిత ఆధారాలు, ఒరిజినల్ సర్టిఫికెట్లతో బుధవారం సాయంత్రం 5 గంటల లోపు తమ కార్యాలయాన్ని సంప్రదించాలని విజయకుమారి సూచించారు.
తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ డ్రైవర్ల సమ్మె
రాజమహేంద్రవరం రూరల్: సమస్యలు పరిష్కరించాలని, జీతాలు పెంచాలనే డిమాండ్లతో తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ 102 సర్వీస్ డ్రైవర్లు కలెక్టరేట్ వద్ద మంగళవారం ఒక రోజు సమ్మె నిర్వహించారు. వారి సమ్మెకు సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.పవన్, కార్యదర్శి బీవీఎన్ పూర్ణిమరాజు సంఘీభావం తెలిపారు. 102 సేవలను 2015లో ప్రారంభించినప్పటి నుంచి నేటి వరకూ వీరికి రూ.8,800 మాత్రమే జీతం ఇస్తున్నారని వారు తెలిపారు. పదేళ్లలో ఒక్క రూపాయి కూడా వేతనం పెంచకపోవడం దుర్మార్గమని అన్నారు. ప్రభుత్వాలు మారాయి, కంపెనీలు మారాయి కానీ, తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ డ్రైవర్ల జీవితాల్లో వెలుగులు మాత్రం రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు మాదిరిగా వీరికి కూడా రూ.18,500 వేతనం ఇప్పించాలని కోరారు. హైకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, జీతభత్యాలు పెంచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
విఘ్నేశ్వరస్వామివారి హుండీ
ఆదాయం రూ.27,68,281
అయినవిల్లి: విఘ్నేశ్వరస్వామివారి హుండీ ఆదాయాన్ని అమలాపురం ఆలయ తనిఖీదారు జంపా రామలింగేశ్వరరావు ఆధ్వర్యంలో మంగళవారం లెక్కించారు. 61 రోజులకు గాను స్వామివారికి హుండీల ద్వారా రూ.27,68,281 లభించిందని ఆలయ ఈఓ, అసిస్టెంట్ కమిషనర్ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. 4.4 గ్రాముల బంగారం, 436 గ్రాముల వెండి లభించాయన్నారు. 30 విదేశీ కరెన్సీ నోట్లు వచ్చినట్లు చెప్పారు.

జిల్లా నైపుణ్యాభివృద్ధి కేంద్రంలో టి–హబ్