
కూటమి ప్రభుత్వం క్రైస్తవులకు వ్యతిరేకం
● ఆర్‌ఎస్‌ఎస్ ప్రతినిధులుగా వ్యవహరిస్తున్న ఐజీ, ఎస్పీ
● ఈ నెల 24న పాస్టర్ ప్రవీణ్ పగడాల
సంస్మరణ సభ
● అనుమతి ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు
● మాజీ ఎంపీ హర్షకుమార్
రాజమహేంద్రవరం సిటీ: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం క్రైస్తవులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని, ఈ నెల 24న జరిగే పాస్టర్ ప్రవీణ్ పగడాల సంస్మరణ సభకు అనుమతి ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ హెచ్చరించారు. మంగళవారం రాజమహేంద్రవరం రాజీవ్‌గాంధీ డిగ్రీ కాలేజీ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఐజీ, ఎస్పీలు ఆర్‌ఎస్‌ఎస్ ప్రతినిధులుగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. వారికి గతంలో ఆర్‌ఎస్‌ఎస్‌తో సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రతీ చర్చిలో మీటింగులు పెట్టి ఈ నెల 24వ తేదీన జరిగే ప్రవీణ్ పగడాల సంస్మరణ సభకు వెళ్లవద్దని, వెళ్లిన వారిపై అరెస్టులు చేసి, కేసులు పెడతామంటూ బెదిరింపులకు గురి చేస్తున్నారని అన్నారు. ఈ ఘటనపై మాట్లాడినా, పోస్టర్లు ముద్రించినా, సోషల్ మీడియాలో ప్రచారం చేసినా కేసులు పెడతామని ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. ప్రవీణ్ పగడాల సంస్మరణ సభకు సంబంధించిన పోస్టర్ వేశామన్నారు. ఆ పోస్టర్‌లో కొంతమంది పెద్దల పేర్లు వేశామని తెలిపారు. వారిని ఎమ్మార్వో ఆఫీస్‌కు పిలిపించి రూ.50 వేల సొంత పూచీకత్తు కట్టించుకుని, బైండోవర్ కేసులు పెట్టారని తెలిపారు. క్రైస్తవులకు మీటింగులు పెట్టుకునే హక్కు లేదని ప్రకటిస్తే మేము మీటింగులు పెట్టబోమన్నారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి హత్యగానే నమ్ముతున్నామన్నారు. ప్రవీణ్ పగడాల హత్యపై రీ పోస్టుమార్టం చేయిస్తామన్నారు. ప్రవీణ్ ప్రగడాల సంస్కరణ సభ జరగనివ్వకపోతే రాష్ట్ర వ్యాప్తంగా జరిగే పరిణామాలకు పోలీసులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ప్రవీణ్ ప్రగడాల హత్య వెనుక చాలా పెద్ద హస్తమే ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ప్రవీణ్ ప్రగడాల సంస్కరణ సభకు ఒకరోజు ముందుగానే 50 మంది బిషప్‌లు వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తున్నారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని క్రైస్తవ సంఘాలు, యువజన సంఘాలు ఈ సభకు తరలి వస్తున్నాయని ఎక్కడైనా ఆపితే అక్కడకక్కడే ధర్నా చేసి సభ నిర్వహిస్తారని, రాష్ట్రం అల్లకల్లోలం అవుతుందని దానికి బాధ్యులు పోలీసులే అవుతారని పేర్కొన్నారు. శాంతియుతంగా సభ నిర్వహిస్తామని, దానిని పరిక్షించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని పేర్కొన్నారు.