కొత్తపల్లి: సముద్రంలో వేటకు వెళ్లిన బోటు ప్రమాదవశాత్తూ బోల్తా పడింది. ఒక మత్స్యకారుడు గల్లంతు కాగా మరో ఇద్దరు మత్స్యకారులు సురక్షితంగా తీరానికి చేరుకున్నారు. వారి కుటుంబ సభ్యులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం ఉప్పాడ నాయకర్ కాలనీకి చెందిన మేరుగు శ్యామ్ అదే గ్రామానికి చెందిన రామిశెట్టి వీరబాబు, వంకా ఇస్సాక్ బోటుపై మంగళవారం తెల్లవారుజామున 3గంటలకు చేపల వేటకు వెళ్లారు. తుపాను ప్రభావంతో సముద్రం ఉధృతంగా ఉండడంతో హోప్ హైలాండ్ సమీపంలో బోటు బోల్తా పడింది. బోటులో ఉన్న మేరుగు శ్యామ్ గల్లంతుకాగా వీరబాబు, ఇస్సాక్ హోప్ హైలాండ్ తీరానికి చేరుకున్నారు. మత్స్యకారులు, అధికారులు గల్లంతైన శ్యామ్ కోసం బోట్లపై గాలింపు చర్యలు చేపట్టారు. శ్యామ్ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
కొత్తపేట: ఇద్దరు మోటారు సైక్లిస్టులు ఎదురెదురుగా ఢీకొనగా ఒక మోటార్ సైక్లిస్టు అక్కడికక్కడే మృతి చెందాడు. కొత్తపేట ఎస్సై జీ సురేంద్ర తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. కొత్తపేట కమ్మిరెడ్డిపాలెం ప్రాంతానికి చెందిన వాడ చైతన్యజనార్దన (36) సోమవారం రాత్రి ఒక పని నిమిత్తం మోటార్ సైకిల్‌పై రావులపాలెం వెళ్లి తిరిగి అర్ధరాత్రి 1.45 గంటల సమయంలో ఇంటికి వస్తుండగా మందపల్లి వంతెన సమపంలో కొత్తపేట వైపు నుంచి మోటార్ సైక్లిస్టు అతి వేగంగా వచ్చి ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. 108 అంబులెన్స్ సిబ్బంది వచ్చి పరీక్షించి అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. చైతన్యజనార్దనను ఢీకొన్న మోటార్ సైక్లిస్టుకు కూడా గాయాలైనట్టు ఎస్సై సురేంద్ర తెలిపారు. మృతుని భార్య వాడ చిన్నారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై సురేంద్ర తెలిపారు.

బోటు బోల్తా పడి మత్స్యకారుడి గల్లంతు