
పొగాకు రైతుల పక్షాన పోరాటం
దేవరపల్లి: పొగాకును గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసే వరకు రైతుల పక్షాన వైఎస్సార్ సీపీ పోరాటం చేస్తుందని పార్టీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. బుధవారం గోపాలపురంలో సొసైటీ మాజీ అధ్యక్షుడు కూసం రామ్మోహన్‌రెడ్డి ఇంటి వద్ద ఆయన విలేకర్లతో మాట్లాడారు. పొగాకు రైతుల కష్టాలు, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా వైఎస్సార్ సీపీ రైతుల పక్షాన పోరాడుతుందన్నారు. ప్రభుత్వానికి మరికొన్ని రోజులు గడువు ఇద్దామనే ఉద్దేశంతో గురువారం పొగాకు వేలం కేంద్రం వద్ద జరగవలసిన ఆందోళనను వాయిదా వేసినట్టు ఆయన తెలిపారు. రాష్ట్రంలో పొగాకు రైతుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. 2021 పంట సీజన్‌లో కరోనా సమయంలో పొగాకు మార్కెట్ సంక్షోభంలో ఉండగా, అప్పటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రూ.200 కోట్లు విడుదల చేసి మార్క్‌ఫెడ్ ద్వారా పొగాకును గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసి రైతులను ఆదుకున్న సంగతిని ఆయన గుర్తు చేశారు. పంటల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి రైతు పండించిన పంటలకు మద్ధతు ధర ఇచ్చిన ఘనత జగన్‌మోహన్‌రెడ్డికి దక్కుతుందన్నారు. 2024–25 పంట కాలంలో రైతులు సుమారు 75 మిలియన్ల కిలోల పొగాకు పండించగా, ఇప్పటి వరకు కేవలం 12 మిలియన్ల కిలోలు కొనుగోలు జరిగిందన్నారు. గత ఏడాది కిలోకు రూ. 410 లభించగా, ఈ ఏడాది రూ. 250 పలుకుతోందని, దీని వల్ల పంటకు గిట్టుబాటు ధర లేక నష్టపోతున్నారని ఆయన తెలిపారు. ఆరుగాలం కష్టపడే రైతులు ఆత్మాభిమానం చంపుకోలేక ఆత్యహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు. అయినా కూటమి ప్రభుత్వానికి రైతుల గోడు పట్టడంలేదన్నారు. రైతులు పండించిన పొగాకును రాష్ట్ర ప్రభుత్వం తక్షణం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అప్పులు రోజురోజుకు పెరిగిపోతున్నాయని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటికి రాష్ట్రంలో అప్పులు రూ.1.40 లక్షల కోట్లు కాగా, కూటమి ప్రభుత్వం 11 నెలల పాలనలో 1.59 కోట్లు అప్పు చేసిందన్నారు. ఇంటింటికీ రేషన్ వాహనాల రద్దు దారుణమని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లక్షల మంది వలంటీర్లను, 16 వేల మంది మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న నిరుద్యోగులను, మరొక 16 వేల మంది రేషన్ వాహనదారులను తొలగించిందని మండిపడ్డారు. మాజీ హోంమంత్రి తానేటి వనిత, మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు జక్కంపూడి విజయలక్ష్మి,రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, ఎంపీపీ ఉండవల్లి సత్యనారాయణ, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు సాలి వేణు, రైతు విభాగం అధ్యక్షుడు వి.సత్యనారాయణ పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ జిల్లా
అధ్యక్షుడు వేణుగోపాలకృష్ణ