
కమ్యూనిటీ హెల్త్ సిబ్బందిని రెగ్యులరైజ్ చేయాలి
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): నిబంధనల ప్రకారం ఆరేళ్లు పూర్తి చేసుకున్న కమ్యూనిటీ హెల్త్ సిబ్బందిని రెగ్యులర్ చేయాలని మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్‌రామ్ డిమాండ్ చేశారు. తమ డిమాండ్ల సాధన కోసం 24 రోజులుగా రాజమహేంద్రవరం కలెక్టర్ వద్ద ఆందోళన చేస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లకు బుధవారం ఆయన సంఘీభావం ప్రకటించారు. ప్రభుత్వం తమను పట్టించుకోకపోవడంతో దశలవారీగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు స్పష్టం చేయడంతో పార్టీ తరఫున అండగా ఉంటామని భరత్ హామీ ఇచ్చారు. ఆందోళన కారులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ గైడ్ లైనన్స్ ప్రకారం ఆరేళ్లు వర్క్ చేస్తే, పర్మినెంట్ చేయాలని, అందుకే మీ డిమాండ్‌కి మద్దతు తెలియజేస్తున్నామని అన్నారు. తెలుగుదేశం ఎంపీల మద్దతుపై కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉన్నప్పటికీ కేంద్రాన్ని డిమాండ్ చేయాల్సిన తెలుగుదేశం ఎందుకు లొంగిపోయిందో అర్థం కావడం లేదన్నారు. కరోనా నేపథ్యంలో ఎదుర్కొన్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేయాలని గతంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని భరత్ చెప్పారు. ఇందులో భాగంగా రాజమహేంద్రవరం మెడికల్ కాలేజీ మొదటి ఫేజ్‌లోనే తీసుకొచ్చామని, రెండవ ఏడాదిలోకి కాలేజీ అడుగుపెట్టిందని అన్నారు. తమ ప్రభుత్వం విలేజ్ హెల్త్ క్లినిక్‌లను కూడా తీసుకొచ్చిందన్నారు. అప్పట్లో కేంద్రానికి మన ఎంపీల మద్దతుతో పనిలేకున్నా సరే, పోరాడి సాధించామని చెప్పారు. ఎన్నికల ముందు సంపద సృష్టిస్తామని చెప్పారని, మరి ఆ హామీ ఏమైందని ప్రశ్నించారు. అప్పులు చేసుకుంటూ పోతూ కూడా సంక్షేమ పథకాలు అమలుచేయడం లేదని భరత్ విమర్శించారు.
మాజీ ఎంపీ భరత్