
యూటీఎఫ్ హెల్ప్ డెస్క్
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): బదిలీలు, పదోన్నతులకు సంబంధించి ఉపాధ్యాయుల సందేహాలు నివృత్తి చేయడానికి నగరంలోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. దీనిని రాష్ట్ర కార్యదర్శి ఎన్.అరుణకుమారి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆ శాఖ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.జయకర్, ఎ.షరీఫ్ మాట్లాడుతూ బదిలీల విషయంలో ఉపాధ్యాయులకు అవసరమైన సహకారం అందించడానికి, మార్గనిర్దేశం, దరఖాస్తు ప్రక్రియలో సాయం చేయడానికి రాజమహేంద్రవరంతో పాటు కోరుకొండ, ఉండ్రాజవరం, గోకవరం, నిడదవోలుల్లో హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. వివరాలకు 99899 82503, 99899 82503 నంబర్లలో సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో యూటీఎఫ్ సీనియర్ నాయకులు ప్రభాకరవర్మ, ప్రసాదరావు, జిల్లా కార్యదర్శులు కె.రమేష్‌బాబు, ఎన్.రవిబాబు, దయానిధి, మనోహర్, ప్రకాశరావు, సత్యనారాయణ పాల్గొన్నారు.
రత్నగిరిపై భక్తుల సందడి
అన్నవరం: రత్నగిరికి గురువారం వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. బుధవారం రాత్రి, గురువారం తెల్లవారుజామున రత్నగిరితో పాటు వివిధ ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. ఆ నవ దంపతులు, వారి బంధుమిత్రులతో పాటు ఇతర భక్తులు అధిక సంఖ్యలో సత్యదేవుని దర్శనానికి వచ్చారు. ఆలయ ప్రాంగణం, క్యూ లైన్లు, వ్రత, విశ్రాంత మండపాలు నవదంపతులు, భక్తులతో కిక్కిరిసిపోయాయి. సాయంత్రం వరకూ భక్తుల రద్దీ కొనసాగింది. సుమారు 30 వేల మంది స్వామివారిని దర్శించుకున్నారని అధికారులు తెలిపారు. వ్రతాలు 2 వేలు జరిగాయి. ఉచిత దర్శనానికి గంట, ప్రదక్షిణ దర్శనానికి అరగంట పట్టింది. సత్యదేవుని దర్శించిన భక్తులు సప్తగోకులంలో ప్రదక్షిణ చేసి, రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించి, పూజలు చేశారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. నిత్యాన్నదాన పథకంలో 5 వేల మంది సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు. సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారు, శంకరుడు నిజరూపంలో దర్శనమిచ్చారు. రత్నగిరి వనదేవత వనదుర్గ అమ్మవారికి శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి చండీహోమం నిర్వహిస్తారు. ఆసక్తి ఉన్న భక్తులు రూ.750 టికెట్టుతో హోమంలో పాల్గొనవచ్చని అధికారులు తెలిపారు.
పదవులన్నీ జనసేనకేనా!
కాకినాడ సిటీ: జిల్లాలో పలు పదవులు తమకు కాకుండా జనసేనకే కట్టబెట్టడమేమిటని పలువురు టీడీపీ నాయకులు ప్రశ్నించారు. కాకినాడలో గురువారం జరిగిన టీడీపీ జిల్లా మహానాడులో నాయకులు ఈ అంశాన్ని ప్రస్తావించారు. టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు విలువ లేకుండా పోతోందని, అన్నిచోట్లా జనసేన నాయకులకే పనులు జరుగుతున్నాయని, దీంతో ప్రతి నియోజకవర్గంలోనూ కార్యకర్తలు తీవ్ర నిరుత్సాహంతో ఉన్నారని నేతలు తమ ప్రసంగాల్లో చెప్పారు. జిల్లాలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పడుతున్న ఇబ్బందులను, అవమానాలను అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్లాలని నిర్ణయించారు. కార్యకర్తలను ఆర్థికంగా ఆదుకునేలా రాష్ట్ర నాయకత్వం చర్యలు తీసుకోవాలని తీర్మానించారు. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ, కార్యకర్తలు ప్రజల నుంచి దోచుకోకుండా ఆర్థిక స్థితి కల్పించి, ఆదుకోవాలని అన్నారు. మిత్రధర్మం పాటిస్తూనే టీడీపీ కార్యకర్తలకు పొత్తు నిష్పత్తిలో న్యాయం చేయాలని సూచించారు. కాకినాడ సెజ్ 30 ఏళ్ల క్రితం ఏర్పాటు చేశారని, ఎటువంటి పరిశ్రమలూ రాకపోవడంతో యువత, నిరుద్యోగులు నిరాశతో ఉన్నారన్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు, నాయకులు ఆయా నియోజకవర్గా ల్లోని సమస్యలు లేవనెత్తారు. కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి, మున్సిపల్ మంత్రి పి.నారాయణ, ఎంపీలు, ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు.
ఈఏపీ సెట్‌కు
96.32 శాతం హాజరు
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఏపీ ఈఏసీ సెట్ ఆన్‌లైన్ పరీక్ష జిల్లాలో గురువారం ప్రశాంతంగా జరిగింది. ఇంజినీరింగ్ విభాగానికి సంబంధించి నిర్వహించిన పరీక్షకు 1,736 మంది హాజరు కా గా, 63 మంది గైర్హాజరయ్యారు. ఉదయ పరీక్షకు 871 మంది హాజరవ్వగా 30 మంది గైర్హాజరయ్యారని, మధ్యాహ్నం నిర్వహించిన పరీక్షకు 865 మంది హాజరు కాగా, 33 మంది గైర్హాజరయ్యారని కన్వీనర్ వీవీ సుబ్బారావు తెలిపారు.

యూటీఎఫ్ హెల్ప్ డెస్క్