యోగాపై అవగాహన కార్యక్రమాలు
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలో నెల రోజులపాటు యోగా సాధన, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు. యోగాంధ్ర కార్యక్రమంపై సమన్వయ శాఖల అధికారులతో తన క్యాంపు కార్యాలయంలో గురువారం ఆమె సమావేశం నిర్వహించారు. రోజుకో ప్రభుత్వ శాఖ చొప్పున నెల రోజుల పాటు అన్ని శాఖలూ యోగా కార్యక్రమాలు నిర్వహించాలని, ప్రజల్లో యోగా పట్ల అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఈ నెల 27న యోగా సంఘాలతో, 28న అంగన్‌వాడీ, ఆరోగ్య కార్యకర్తలతో, 29న సెంట్రల్ జైలులో రాష్ట్ర స్థాయి కార్యక్రమం, 30న వైద్యాధికారులు, వైద్యులతో, 31న మాజీ సైనికోద్యోగులతో, జూన్ 1న ఫ్యామిలీ యోగా, 2న ఆటో, లారీ సంఘాలు, 3న మత్స్యకారులు, 4న గిరిజనులు, 5న ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు, 6న ఉపాధ్యాయులు, 7న రెసిడెన్షియల్ అసోసియేషన్లు, 8న సీనియర్ సిటిజన్లు, 9న ఇంజినీరింగ్ విద్యార్థులతో యోగా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఈవిధంగా వచ్చే నెల 21 వరకూ వివిధ కార్యక్రమాలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో పాల్గొనే ప్రతి ఒక్కరితో యోగా వెబ్‌సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయించాలని, వారంతా సాధన చేసేలా చూడాలని సూచించారు. అనంతరం, కలెక్టర్‌మీడియా సమావేశంలో మాట్లాడుతూ, జూన్ 21న రాష్ట్రవ్యాప్తంగా 2 కోట్ల మందితో రికార్డు స్థాయిలో యోగా చేయించాలనే లక్ష్యంలో భాగంగా నగరంలోని వై.జంక్షన్ నుంచి లాలాచెరువు వరకూ ప్రతి రోజూ ఉదయం 7 నుంచి 8 గంటల మధ్య యోగా సాధన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. పర్యాటక రంగాన్ని కూడా అభివృద్ధి చేసే క్రమంలో కడియం, కొవ్వూరు గోష్పాద క్షేత్రం, వివిధ ఘాట్లలో యోగా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ చిన్నరాముడు తదితరులు పాల్గొన్నారు.


