
ప్రజా సమస్యలపై ఆందోళనలు
● ప్రభుత్వ నియంతృత్వ పోకడలపై పోరాటాలు
● వైఎస్సార్ సీపీ నేతలు తిప్పల గురుమూర్తిరెడ్డి, వేణు
రాజమహేంద్రవరం రూరల్: ఏడాది కాక మునుపే కూటమి సర్కారుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని వైఎస్సార్ సీపీ రాజమండ్రి పార్లమెంటరీ పరిశీలకుడు, మాజీ ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తిరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను పార్టీ శ్రేణులు ఎప్పటికప్పుడు సమరోత్సాహంతో తిప్పి కొట్టాలని, ప్రజల సంక్షేమం కోసం, వారి సమస్యల పరిష్కారం కోసం సమైక్యంగా ఆందోళన బాట పట్టాలని, వారిలో విశ్వసనీయతను పెంచాలని పిలుపునిచ్చారు. తద్వారా వైఎస్సార్ సీపీ మరింత బలపడి, భవిష్యత్తులో అధికారంలోకి రావడం తథ్యమని స్పష్టం చేశారు. వైఎస్సార్ సీపీ బలోపేతం, అనుబంధ విభాగాల పటిష్టత, తదితర అంశాలపై గురుమూర్తిరెడ్డి, మాజీ మంత్రులు వేణు, తానేటి వనిత, యువజన రాష్ట్ర విభాగం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, నియోజకవర్గాల ఇన్‌చార్జిలు, మాజీ ఎమ్మెల్యేలు తలారి వెంకట్రావు, జి.శ్రీనివాస నాయుడు, డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, పార్లమెంటరీ ఇన్‌చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్‌లు సమీక్షించారు. వేణు కార్యాలయంలో గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో గురుమూర్తిరెడ్డి, వేణు మాట్లాడుతూ, వైఎస్సార్ సీపీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పని చేయాలని నియోజకవర్గాల సమన్వయకర్తలతో పాటు పార్టీ శ్రేణులు, అనుబంధ విభాగాల నాయకులకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం అన్యాయం చేసిన వారి తరఫున పోరాడటంలో కార్యకర్తలు ముందుండాలన్నారు. గతంలో ఏ ప్రభుత్వానికీ ఏడాదిలోపే ఇంత వ్యతిరేకత కనిపించ లేదని అన్నారు. సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకపోగా, ఇతర సంక్షేమ పథకాలను సైతం అందించకపోవడంపై ప్రజలు చర్చించుకుంటున్నారన్నారు. కూటమి ప్రభుత్వ నియంతృత్వ పోకడలపై ఎప్పటికప్పుడు పోరుబాట పట్టేలా నేతలు సిద్ధం కావాలన్నారు. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు వివిధ కార్యక్రమాలు చేపడుతూనే ప్రజలకు అండగా నిలవాలని నిర్ణయించారు. పార్లమెంటరీ పరిశీలకుడిగా నియమితులై తొలిసారిగా నగరానికి వచ్చిన గురుమూర్తిరెడ్డిని ఈ సందర్భంగా నేతలు సత్కరించారు.