పసుపు జెండా.. వెలిసిపోతోందా..! | - | Sakshi
Sakshi News home page

పసుపు జెండా.. వెలిసిపోతోందా..!

May 23 2025 2:05 AM | Updated on May 23 2025 2:05 AM

పసుపు జెండా.. వెలిసిపోతోందా..!

పసుపు జెండా.. వెలిసిపోతోందా..!

‘గ్లాస్‌’మేట్స్‌కే నామినేటెడ్‌ సీట్లా?

ఈ పొత్తుతో చిత్తయిపోతామన్న జ్యోతుల

నెహ్రూ వ్యాఖ్యలపై కూటమిలో దుమారం

ఆధిపత్య ఆరాటమేనని విమర్శ

సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఎన్టీఆర్‌ హయాంలో టీడీపీతో పొత్తు పెట్టుకున్న ఉభయ కమ్యూనిస్టు పార్టీలూ క్రమంగా నిర్వీర్యమైపోయినట్లే.. ఇప్పుడు జనసేన పొత్తుతో ‘పసుపు’ రంగు వెలిసిపోయే పరిస్థితి ఏర్పడుతోందా అంటే.. అవుననే అంటున్నాయి జిల్లాలోని టీడీపీ శ్రేణులు. కాకినాడలో గురువారం జరిగిన ఆ పార్టీ జిల్లా మహానాడులో సీనియర్‌ నాయకుడు, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనంగా కనిపిస్తున్నాయి. అయితే, ఇదంతా ఆధిపత్యం కోసమేనని మిత్రపక్షమైన జనసేన నేతలు విమర్శిస్తున్నారు. మొత్తమ్మీద రెండు రోజులుగా జ్యోతుల అండ్‌ సన్‌ చేస్తున్న వ్యాఖ్యలు కూటమిలో దుమారం రేపుతున్నాయి.

పదవుల్లో ప్రాధాన్యం ఏదీ?

టీడీపీ, జనసేనల మధ్య చాపకింద నీరులా కొనసాగుతున్న విభేదాలు ఎట్టకేలకు జ్యోతుల వ్యాఖ్యలతో రచ్చకెక్కాయి. పదవుల పందేరం మొదలుకొని జిల్లాలో జనసేనకే పెద్ద పీట వేయడాన్ని టీడీపీ నేతలు ఒక పట్టాన జీర్ణించుకోలేకపోతున్నారు. పదవుల్లో తమకు ప్రాధాన్యం దక్కడం లేదనే ఆక్రోశం మినీ మహానాడు వేదికలుగా ఆ పార్టీ నేతల మాటల్లో ప్రస్ఫుటమైంది. జనసేన కంటే బలం, బలగం అధికంగా ఉన్నప్పటికీ పదవుల్లో అన్యాయం జరుగుతోందని టీడీపీ శ్రేణులు కారాలూ మిరియాలూ నూరుతున్నారు. ‘గతంలో ఉభయ కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్నప్పుడు ఆ పార్టీలకు తాత్కాలికంగా ఒకటో రెండో పదవులు వచ్చి ఉండవచ్చు. అప్పుడు మనం తెలివిగా రాజకీయం చేశాం. కేవలం మనతో పొత్తు కారణంగానే తరువాతి కాలంలో రాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీలు నిర్వీర్యమైపోయాయి. ఆ పరిస్థితి మన పార్టీకి రాకుండా రాష్ట్ర నాయకత్వం చూడాలి’ అని జ్యోతుల అన్నారు. పదవుల్లో టీడీపీ అధిష్టానం జనసేనకే పెద్దపీట వేస్తూండటంతో టీడీపీ క్రమంగా నిర్వీర్యమైపోయే పరిస్థితి ఏర్పడుతోందని నేరుగా కాకపోయినా పరోక్షంగా అన్నారు.

జనసేన జిల్లా అధ్యక్షుడైన తుమ్మల బాబుకు కొన్నాళ్ల కిందట కాకినాడ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (కౌడా) చైర్మన్‌ పదవి కట్టబెట్టారు. ఆయనకే తాజాగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌ (డీసీసీబీ) చైర్మన్‌ పదవి కూడా ఇచ్చారు. అయితే, ఎక్కడా జనసేన, ఆ పార్టీ నేతల పేర్లు ప్రస్తావించకుండా.. ఒకే వ్యక్తికి రెండు పదవులు ఇవ్వడం న్యాయమా అని జ్యోతుల నిలదీశారు. ఇలాగైతే మెజార్టీలో ఉన్న టీడీపీ ఏమైపోతుందని నేరుగా అధిష్టానాన్ని ప్రశ్నించారు.

జ్యోతులే కాదు.. ఆయన తనయుడు నవీన్‌ కుమార్‌ కూడా రెండు రోజుల క్రితం పిఠాపురం, కాకినాడ రూరల్‌ నియోజకవర్గాల మినీ మహానాడుల్లో సైతం దాదాపు ఇదే అభిప్రాయం పరోక్షంగా వ్యక్తం చేశారు. పార్టీ పరంగా పిఠాపురంలో ఒకప్పుడు దూకుడుగా ఉండే మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మ ఇప్పుడు దాదాపు స్తబ్దుగా మారిపోవడం చూస్తూంటే జిల్లాలో టీడీపీ ఉనికి కోల్పోయే పరిస్థితి ఏర్పడినట్లు కనిపిస్తోందని నవీన్‌ అన్నారు. కాకినాడ రూరల్‌ నియోజకవర్గానికి పార్టీ ఇన్‌చార్జిని నియమించకపోవడాన్ని ప్రస్తావిస్తూ ఇలాగైతే జిల్లాలో పార్టీ ఎటువైపు పోతుందని ఆయన ప్రశ్నించడం గమనార్హం. తండ్రీకొడుకులు చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి.

అదేం ప్రశ్న!

అయితే, ఈ వ్యవహారంపై జనసేన నేతలు వేరేలా కౌంటర్‌ ఇస్తున్నారు. డీసీసీబీ చైర్మన్‌ పదవి కట్టబెట్టగానే కౌడా చైర్మన్‌ పదవికి రాజీనామా చేసినట్లు తుమ్మల బాబు ప్రకటించారని, అటువంటప్పుడు ఒకరికే రెండు పదవులని నెహ్రూ ఎలా అంటారని ఆ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. డీసీసీబీ చైర్మన్‌గిరీని నవీన్‌ ఆశించి భంగపడ్డారని, అందువల్లనే నెహ్రూ నోట జోడు పదవుల ప్రస్తావన వచ్చిందని అంటున్నారు. పదవుల పందేరంలో టీడీపీ నేతలకు అన్యాయమనేది సాకు మాత్రమేననని చెబుతున్నారు.

పదవులన్నీ వాళ్లకే ఇచ్చేస్తే.. మనకో మరి!

ప్రాధాన్యం దక్కనందుకేనా!

పార్టీ పరంగా, రాజకీయంగా ఒకప్పుడు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో చక్రం తిప్పిన జ్యోతుల నెహ్రూ, యనమల రామకృష్ణుడు వంటి నేతలకు జనసేనకు పెద్దపీట వేయడం నచ్చడం లేదు. ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ పిఠాపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న క్రమంలో దాదాపు జిల్లా ఉన్నతాధికారులు ఏ అంశంలోనైనా ఆయన మాటకే ప్రాధాన్యం ఇస్తున్నారు. సీనియర్లమైనప్పటికీ తమను పరిగణనలోకి తీసుకోకవడమే నెహ్రూ ఆగ్రహానికి కారణమై ఉంటుందనే అభిప్రాయం టీడీపీలో కూడా వ్యక్తమవుతోంది. ఉమ్మడి జిల్లాలో 21 నియోజకవర్గాలున్నప్పుడు ఎమ్మెల్యేలందరూ సమష్టి నిర్ణయాలతో అభివృద్ధికి బాటలు వేశామని నెహ్రూ చెప్పుకొన్నారు. ఇప్పుడు జిల్లాలో ఏడు నియోజకవర్గాలకే పరిమితమైనా సమన్వయం కొరవడి, ఏమీ చేయలేకపోతున్నామన్న నెహ్రూ మాటల్లో ప్రాధాన్యం దక్కడం లేదనే ఆక్రోశమే కనిపిస్తోందని అంటున్నారు. ఈ మొత్తం ఎసిపోడ్‌లో టీడీపీ నిర్వీర్యమైపోతుందన్న నెహ్రూ వ్యాఖ్యలపై అధిష్టానం ఏవిధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement