
సేవ చేద్దామని వస్తే దూషణలు
● తెలంగాణ మహిళా సేవకుల
బృందానికి అవమానం
● రత్నగిరిపై అధికారి దురుసు ప్రవర్తన
● ఏఈఓ తీరుపై కమిషనర్ ఆగ్రహం
● విచారణ జరిపి, నివేదిక ఇవ్వాలని ఈఓకు ఆదేశం
అన్నవరం: సత్యదేవుని సన్నిధిలో సేవ చేయడానికి వచ్చిన మహిళా సేవకుల పట్ల దేవస్థానం ఏఈఓ కె.కొండలరావు దురుసుగా ప్రవర్తించినట్లు ఆరోపణలు రావడం కలకలం రేపింది. వివరాలివీ.. అన్నవరం దేవస్థానంలో సేవలందించేందుకు రెండేళ్లుగా ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి వందలాదిగా మహిళా సేవకులు వస్తున్నారు. వీరు పది రోజుల నుంచి రెండు వారాల వరకూ స్వామివారి ఆలయం, యంత్రాలయం, ఉపాలయాలు, అన్నదానం, ప్రసాదం, క్యూ లైన్లు తదితర చోట్ల సేవలందిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణలోని మంచిర్యాలకు చెందిన 18 మంది మహిళలు గతంలో అన్నవరం దేవస్థానంలో సేవ చేసిన హైదరాబాద్‌కు చెందిన మరో సేవా బృందం మహిళను సంప్రదించారు. ఆమె స్వయంగా రానూపోనూ రైలు టికెట్లు రిజర్వ్ చేయించి, ఒక్కొక్కరి నుంచి రూ.500 అధికంగా వసూలు చేసింది. ఈ నేపథ్యంలో గురువారం అన్నవరం వచ్చిన మంచిర్యాల మహిళా సేవకుల బృందానికి డ్యూటీలు వేసేందుకు ఆలయ ఏఈఓ కె.కొండలరావు నిరాకరించారు. తునికి చెందిన శ్రీవారి సేవా మహిళా బృందం వారే దేవస్థానం వద్దకు సేవకులను పంపిస్తారని, ఆమెతో మాట్లాడాలని చెప్పారు. దీంతో, మంచిర్యాల సేవకుల బృందం తునికి చెందిన శ్రీవారి సేవా మహిళా బృందం ప్రతినిధితో మాట్లాడగా, తన అనుమతి లేకుండా ఎందుకు వచ్చారని ఆమె విరుచుకు పడింది. వెంటనే వెళ్లిపోవాలని, తాను కబురు చేసినప్పుడే రావాలని చెప్పింది. వారు మళ్లీ ఏఈఓ కొండలరావు వద్దకు రాగా.. ఆయన కూడా వెంటనే వెళ్లిపోవాలని గట్టిగా కసిరినట్టు చెప్పారు. దేవుని సేవ చేద్దామని అంత దూరం నుంచి వస్తే తమను ఇలా అవమానించడమేమిటని మంచిర్యాల బృంద సభ్యులు వాపోయారు. ఈ విషయాన్ని వెంటనే దేవదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ దృష్టికి తీసుకుని వెళ్లారు. దీనిపై మండిపడిన ఆయన.. ఈ వ్యవహారంపై విచారణ జరిపి, వెంటనే నివేదిక ఇవ్వాలని ఈఓ వీర్ల సుబ్బారావును ఆదేశించారు.