
పంపా.. ఆహ్లాదకరంగా..
నెల రోజుల కిందటి వరకూ నీరుంటుందా.. ఆవిరైపోయి.. నీటిమట్టం 79 అడుగులకు పడిపోయి.. డెడ్ స్టోరేజ్‌కు చేరుకుని.. రిజర్వాయర్ ఎండిపోతుందా అనే పరిస్థితి. అన్నవరం గ్రామానికి, దేవస్థానానికి నీటి ఎద్దడి తప్పదేమోననే ఆందోళన.. అటువంటి పరిస్థితుల్లో వరుణుడు కరుణ ధారలు కురిపిస్తూండటంతో పావన పంపా రిజర్వాయర్ జలకళతో తొణికిసలాడుతోంది. ఓవైపు ఎండలు మండిపోతున్నా.. పరీవాహక ప్రాంతాలైన శంఖవరం, రౌతులపూడి మండలాల్లోని కొండల్లో నెల రోజుల నుంచి తరచుగా కురుస్తున్న వర్షాలకు జలాశయంలోకి భారీగా నీరు వచ్చి చేరుతోంది. దీంతో, రిజర్వాయర్ నీటిమట్టం సోమవారం నాటికి 84.60 అడుగులకు పెరిగింది. పంపా రిజర్వాయర్ గరిష్ట నీటిమట్టం 103 అడుగులు. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 0.43 టీఎంసీలు. ప్రస్తుతం 0.028 టీఎంసీలకు నీటి నిల్వలు పెరిగాయి. ప్రస్తుతం 105 క్యూసెక్కుల చొప్పున నీరు వస్తుండడంతో జలాశయం నీటిమట్టం 85 అడుగుల వరకూ పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. రత్నగిరిపై సత్యదేవుని ఆలయానికి వస్తున్న భక్తులు జలకళతో తొణికిసలాడుతున్న పంపా రిజర్వాయర్‌ను చూసి ఆనందిస్తున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు తురాయి చెట్లు కూడా ఎర్రని పూలు పూస్తూండటంతో ఆ ప్రాంతం ఆహ్లాదకరంగా మారింది. పలువురు భక్తులు రత్నగిరి నుంచి పంపా రిజర్వాయర్ కవరయ్యేలా సెల్ఫీలు, ఫొటోలు తీసుకుంటున్నారు. పంపా ఘాట్‌ల వద్ద స్నానాలు చేస్తూ సేద తీరుతున్నారు.
– అన్నవరం
పంపా ఘాట్‌ల వద్ద పెరిగిన నీటిమట్టం

పంపా.. ఆహ్లాదకరంగా..