భూసారానికి నవధాన్య సాగు | - | Sakshi
Sakshi News home page

భూసారానికి నవధాన్య సాగు

Apr 14 2025 12:08 AM | Updated on Apr 14 2025 12:08 AM

భూసార

భూసారానికి నవధాన్య సాగు

పీఎండీఎస్‌తో వేరు వ్యవస్థకు భద్రత

ఈ పద్ధతిపై విస్తృతంగా అవగాహన

సేద్యానికి విత్తన కిట్లు సిద్ధం

కొత్తపేట: ప్రధాన పంటకు ముందు ప్రీ మాన్సూన్‌ డ్రై సోయింగ్‌ (రుతుపవనాలకు ముందు వేసే పంట – నవధాన్యాల సాగు) సాగు చేపట్టడం ద్వారా సేంద్రియ కర్బనాన్ని పెంచుతుందని, ఈ సాగు పట్ల రైతులు అవగాహన కలిగి ఉండాలని వ్యవసా యశాఖ అధికారులు విస్తృత ప్రచారం చేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయ విధానంలో ప్రయోగాత్మకంగా నవధాన్యాల రకాల విత్తనాలను కలిపి వెదజల్లే పద్ధతి గురించి రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ సాగుపై వ్యవసాయ శాఖ కొత్తపేట సబ్‌ డివిజన్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఎం.వెంకట రామారవు సాక్షికి వివరించారు.

ప్రీ మాన్సూన్‌ డ్రై సోయింగ్‌ (పీఎండీఎస్‌) సాగు అనేది పంట కాలానికి సంబంధం లేకుండా ప్రధాన పంటకు ముందు 20 నుంచి 30 రకాల వివిధ పంట విత్తనాలను కలిపి వెదజల్లి, సాగుభూమిని సజీవ వేరు వ్యవస్థతో ఎల్లప్పుడూ కప్పబడి ఉండే ప్రక్రియ. ఈ ప్రక్రియ 365 రోజులు భూమి పంటలతో కప్పబడి ఉండాలనే వ్యూహంతో ముఖ్య భూమిక పోషిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో ఈ విధానాన్ని నవధాన్యాల సాగు పద్ధతిగా పిలుస్తారు. మామూలు పద్ధతిలో చేసే వ్యవసాయ క్రమంలో దుక్కి దున్ని, ఎరువులు వాడి, పంటల మధ్య బీడు పెట్టే ప్రక్రియలో భూమిలో సేంద్రియ కర్బన శాతం తగ్గుముఖం పడుతుంది. ప్రకృతి వ్యవసాయ పంటల సాగు సేంద్రియ కర్బనాన్ని పెంచుతుంది. పంటలు కిరణ జన్య సంయోగ క్రియ నుంచి ఆహారాన్ని తయారు చేస్తాయి. అలా తయారైన ఆహారంలో 30 శాతం వరకు వేర్ల ద్వారా స్రవించబడి, నేల పైపొరల మీద ఆధార పడ్డ అసంఖ్యాక జీవరాశుల సంఖ్యను పెంపొందిస్తూ మొక్కలు, వాటి పోషకాల సరఫరా చేయడానికి సహాయపడుతుంది. పంట కోసిన అనంతరం తదుపరి పంట విత్తు వరకు నేలలోకి కార్బన్‌ విడుదల చేయడం ఆగిపోతుంది. కాబట్టి ఏడాది పొడవునా నిరంతరాయంగా పంటలను పండించడం వల్ల సేంద్రియ కర్బన శాతం నేలలోకి చేరుతుంది. ప్రతి సీజన్లో పంటల వైవిధ్యాన్ని మెరుగు పరచడానికి, బీడుగా ఉండే భూములను పంటలతో సాధారణంగా వేసవి నెలలలో పొలాలు బీడుగా ఉంటాయి కాబట్టి పీఎండీఎస్‌ లోని పలు పంటల ద్వారా ఆదాయం, భూమిలో పోషకాల పెంపుదలతో పాటు పశువులకు నాణ్యమైన పచ్చిమేతగా పొందేందుకు కూడా అవకాశం కల్పిస్తుంది. ప్రస్తుతం రబీ అనంతరం ఖరీఫ్‌కు ముందు అంటే రుతుపవనాలకు ముందు బీడుగా ఉండే నెలలలో పంటలు సాగు చేయడానికి డ్రై సోయింగ్‌ పద్ధతి అనువైనది.

ఈ విధానంలో పంటల విత్తనాలు

● నవధాన్యాల సాగులో 20 నుంచి 30 రకాల పంటలు సాగు చేయవచ్చు. కనీసం 20 రకాలు తీసుకున్నారు. అవి ఇలా..

● పచ్చిరొట్ట పైర్లు – జనుము, జీలుగ, పిల్లి పెసర

● పప్పు ధాన్యం పైర్లు – మినుము, పెసర, ఉలవ, బొబ్బర్లు

● నూనె గింజల పైర్లు – వేరుశెనగ, నువ్వులు, ఆముదం

● చిరు ధాన్యం పైర్లు – జొన్న, కొర్ర, రాగి,

● ఆకు కూరలు – గోంగూర, పాలకూర, తోటకూర, చుక్కకూర,

● తీగ జాతి పంటలు – బీర, ఆనప, దోస తదితర పంటలు

● ఈ విత్తనాల కిట్లను వ్యవసాయశాఖ ద్వారా రైతులకు అందజేస్తున్నారు.

● సుగంధ ద్రవ్యాలు – ధనియాలు, ఆవాలు,

సబ్‌ డివిజన్‌ వారీగా

అవగాహన

జిల్లా వ్యవసాయ అధికారి పర్యవేక్షణలో వ్యవసాయ సబ్‌ డివిజన్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ (ఏడీఏ) ఆధ్వర్యంలో మండలాలు, గ్రామాల వారీగా ఈ నవధాన్యాల సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయ విధానంలో అమలు చేస్తున్న ఈ పథకానికి సంబందించి ప్రత్యేకంగా ప్రతి సబ్‌ డివిజన్‌కు ఒక మాస్టర్‌ ట్రైనర్‌ను నియమించారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 25 వేల మంది రైతులు 22 వేల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయ విధానం అవలంబిస్తుండగా సుమారు 22 వేలు కిట్లు పంపిణీ లక్ష్యంగా నిర్ణయించారు. ప్రస్తుతం 98 గ్రామాల్లో ఈ కార్యక్రమం ప్రారంభించారు. 9,352 కిట్లు పంపిణీ చేస్తున్నారు. దశల వారీగా గ్రామాలను, విస్తీర్ణాన్ని, కిట్ల పంపిణీని విస్తరిస్తారు. ప్రతి సబ్‌ డివిజన్‌ పరిధిలో ఒక ప్రణాళికను రూపొందించారు. ఉదాహరణకు కొత్తపేట వ్యవసాయ సబ్‌ డివిజన్‌లో 2227.97 ఎకరాలు విస్తీర్ణం కాగా 2489 మంది రైతులు ఉన్నారు. ప్రస్తుతం 1,336 కిట్ల పంపిణీ చేపట్టారు.

సాగుతో భూసారం వృద్ధి

రైతులు నవధాన్యాల సాగు చేపట్టాలి. తద్వారా భూసారాన్ని పెంచుకోవాలి. ఆరోగ్యకర వ్యవసాయ ఉత్పత్తులను పండించాలి. 20 రకాల విత్తనాల 12 కేజీల కిట్‌ ఒక ఎకరానికి సరిపోతుంది. ఈ కిట్‌ ధర రూ 800. రబీ (దాళ్వా) పంట కోతల ముందు చల్లుకోవాలి. బోర్లు సౌకర్యం ఉన్నచోట వేసుకోవచ్చు. ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలి.

– ఎం వెంకట రామారావు, ఏడీఏ, కొత్తపేట

ఈ సాగు వల్ల కలిగే ప్రయోజనాలు

పీఎండీఎస్‌ పద్ధతిలో 365 రోజులు భూమి కప్పబడి ఉంచే నిరంతర సాగు ప్రక్రియకు శ్రీకారం చుడుతుంది. వివిధ పంటల వేర్లు భూమిలో వైవిధ్య రకాల సూక్ష్మజీవులకు ఆశ్రయం కల్పించి పంటలకు ఉపయోగపడే వీటి సంతతిని అభివృద్ధి చేస్తాయి. తద్వారా ప్రధాన పంటకు కావల్సిన స్థూల, సూక్ష్మ పోషకాలను అందుబాటులోకి తీసు కువచ్చి మొక్కల వేరు వ్యవస్థ గ్రహించేటట్టు చేస్తాయి. నవధాన్య పంటలు పశువులకు పోషక విలువలతో కూడిన పచ్చిమేతగా ఉపయోగపడుతుంది. నేల గుల్లబారి వానపాములు వృద్ధి చెందుతాయి. నేలలో నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. పలు పంటల సాగు వల్ల అదనపు ఆదాయం కలుగుతుంది. నేల కోతకు గురికాదు. జీవ వైవిధ్యం, నేలలో సేంద్రియ కర్బన శాతం పెరుగుతుంది. ప్రధాన పంటలో రసాయనిక ఎరువులు వినియోగం తగ్గుతుంది. ప్రధాన పంటలో కలుపు తగ్గుతుంది. పంటలో చీడపీడలు, తెగుళ్లను తట్టుకునే సామర్థ్యం పెరుగుతుంది. ప్రధాన పంట వాతావరణ వైపరీత్యాలను తట్టుకునే సామర్థ్యం పెరుగుతుంది.

భూసారానికి నవధాన్య సాగు1
1/4

భూసారానికి నవధాన్య సాగు

భూసారానికి నవధాన్య సాగు2
2/4

భూసారానికి నవధాన్య సాగు

భూసారానికి నవధాన్య సాగు3
3/4

భూసారానికి నవధాన్య సాగు

భూసారానికి నవధాన్య సాగు4
4/4

భూసారానికి నవధాన్య సాగు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement