13న గురుకుల ప్రవేశ పరీక్ష
రాజమహేంద్రవరం రూరల్: ధవళేశ్వరంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ బాలికల గురుకుల విద్యాలయంలో ఐదో తరగతి, ఇంటర్ ప్రథమ సంవత్సరంలో చేరగోరే విద్యార్థులకు ఈ నెల 13న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నారు. ప్రిన్సిపాల్ ఎ.వాణీకుమారి గురువారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. ఆ రోజు ఉదయం 10 నుంచి 12 గంటల వరకు ఐదో తరగతికి, మధ్యాహ్నం 2 నుంచి 4.30 గంటల వరకూ ఇంటర్ ఫస్టియర్‌కు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని వివరించారు. విద్యార్థులు ఒక గంట ముందు హాజరు కావాలని సూచించారు.
పన్ను వసూలులో
రాష్ట్రంలో రెండో స్థానం
రాజమహేంద్రవరం సిటీ: పన్నుల వసూలులో నగరపాలక సంస్థ రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచింది. ఈ మేరకు కమిషనర్ కేతన్ గార్గ్ నగదు బహుమతితో పాటు షీల్డ్ అందుకున్నారు. విజయవాడలో గురువారం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్‌కు రాష్ట్ర మున్సిల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ బహుమతి ప్రదానం చేశారు.
వైఎస్సార్ సీపీ మహిళా విభాగం
జిల్లా అధ్యక్షురాలిగా లక్ష్మి
సాక్షి, రాజమహేంద్రవరం: వైఎస్సార్ సీపీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలిగా మార్తి లక్ష్మి నియమితులయ్యారు. అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపింది. తనపై నమ్మకం ఉంచి జిల్లా మహిళా అధ్యక్ష పదవికి ఎంపిక చేసిన మాజీ సీఎం వైఎస్ జగన్‌కు, సహకరించిన మాజీ ఎంపీ, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్‌రామ్‌కు లక్ష్మి కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తానన్నారు. క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని చెప్పారు.
వాడపల్లి క్షేత్రంలో
ఘనంగా సదస్యం
కొత్తపేట: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవేంకటేశ్వర స్వామివారి కల్యాణ మహోత్సవాల్లో భాగంగా గురువారం పండిత సదస్యం ఘనంగా నిర్వహించారు. దేవదాయ, ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు పర్యవేక్షణలో ఆలయ ప్రధానార్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంతశ్రీనివాస్, వేద పండితులు ఖండవల్లి రాజేశ్వరవరప్రసాద్ ఆచార్యులు ఆధ్వర్యంలో పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారికి చతుర్వేద పండితులతో ద్రవిడ వేద పారాయణం(మహాదాశీర్వచనం) అందజేశారు. స్వామివారికి డీసీ, ఈఓ చక్రధరరావు పట్టు వస్త్రాలను అందించారు. ఈ సందర్భంగా స్వామివారిని ఆభరణాలతో అలంకరించి, గ్రామోత్సవం నిర్వహించారు. శుక్రవారం గౌతమి గోదావరి నదిలో తెప్పోత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు డీసీ, ఈఓ చక్రధరరావు తెలిపారు.
శత్రువుకు దడ పుట్టేలా..
కాకినాడ రూరల్: శత్రువుకు దడ పుట్టేలా ఇండో – అమెరికన్ టైగర్ ట్రయంఫ్–25 విన్యాసాలు కాకినాడ తీరంలో జరుగుతున్నాయి. ఇరు దేశాలకు చెందిన వైమానిక దళాలు గురువారం సంయుక్త విన్యాసాలతో అదరగొట్టాయి. సాధారణ ప్రజలకు అనుమతి లేనప్పటికీ ఈ విన్యాసాలు చూసేందుకు పలువురు ఆసక్తి చూపుతున్నారు. గురువారం ఉదయం యుద్ధ విమానాలు, హెలికాప్టర్‌లు కాకినాడ తీర ప్రాంతంతో పాటు సూర్యారావుపేట, వలసపాకల, వాకలపూడి గ్రామాల్లో చక్కర్లు కొట్టాయి. ఆకాశం నుంచి పెద్ద శబ్దం రావడంతో ఇళ్లలోని వారు బయటకు వచ్చి, వాటిని ఆసక్తిగా తిలకించారు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ 157హెచ్‌యూకు చెందిన ఎంఐ–17వీ5 ద్వారా 16 మంది యూఎస్ స్పెషల్ ఫోర్సెస్, గరుడ, పారా కమాండోలను యాంఫిబియస్ విన్యాసాలు జరిగే కాకినాడ బీచ్‌లోని నావెల్ ఎన్‌క్లేవ్ వద్ద బీచ్ ల్యాండింగ్ జోన్(ఎల్‌జెడ్)కు చేర్చారు. బీచ్‌లోకి సందర్శకులు రాకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.
13న గురుకుల ప్రవేశ పరీక్ష
13న గురుకుల ప్రవేశ పరీక్ష


