వ్యాపారులకే ధాన్యం
సాక్షి, రాజమహేంద్రవరం: జిల్లావ్యాప్తంగా రబీ వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం ఈ నెల 2వ తేదీ నాటికి 3,046 హెక్టార్లలో పూర్తయి 5 శాతం పైగా లక్ష్యాన్ని అధిగమించాయి. గురువారం నాటికి సుమారు 5 వేల హెక్టార్లలో కోతలు పూర్తయినట్లు సమాచారం. మరో వారం, పది రోజుల్లో వరి కోతలు మరింతగా పుంజుకునే అవకాశం ఉంది. ఇటువంటి తరుణంలో రైతులకు అండగా ఉండాల్సిన కూటమి ప్రభుత్వం.. ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించలేదు. పైగా ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయో కూడా తెలియని పరిస్థితి తలెత్తింది. మరోవైపు ధాన్యానికి గిట్టుబాటు ధర సైతం ప్రకటించ లేదు.
58,586 హెక్టార్లలో..
జిల్లా వ్యాప్తంగా రబీలో వరి సాధారణ విస్తీర్ణం 60,042 హెక్టార్లు. రైతులు ఈ ఏడాది 58,586 హెక్టార్లలో సాగు చేశారు. గత ఏడాది ఎకరాకు 50 బస్తాల (బస్తాకు 75 కిలోలు) ధాన్యం చొప్పున 4.60 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చింది. ప్రస్తుతం దిగుబడి తగ్గే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు. సాగునీటి ఎద్దడి, తెగుళ్లు తదితర విపత్తుల కారణంగా ఎకరానికి 40 నుంచి 45 బస్తాల వరకూ మాత్రమే దిగుబడి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. సాగు పెట్టుబడులు పెరగడం.. దిగుబడి తగ్గడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు.
వ్యాపారుల పాగా
ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కాకపోవడంతో దళారులు, ప్రైవేటు వ్యాపారులు రంగప్రవేశం చేస్తున్నారు. కోతలు పూర్తి చేసిన రైతుల పొలాల వద్దకు నేరుగా వెళ్లి.. వారి నుంచి వారు తక్కువ ధరకే ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. అక్కడి నుంచే మిల్లులకు తరలించేస్తున్నారు. ఈ క్రమంలో దళారులు, వ్యాపారులు నిర్ణయించిన ధరకే అమ్ముకోవాల్సి రావడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో ధర తక్కువని తెలిసినా గత్యంతరం లేక వాళ్లకే విక్రయిస్తున్నారు.
యంత్రాలతో కోతలు
జిల్లా వ్యాప్తంగా సీతానగరం, రాజమహేంద్రవరం రూరల్, రంగంపేట, కోరుకొండ, రాజానగరం, గోకవరం, గోపాలపురం మండలాల్లో వరి కోతలు వేగవంతంగా సాగుతున్నాయి. మిగిలిన ప్రాంతాల్లో సైతం ఇప్పటికే ప్రారంభమయ్యాయి. కూలీల రేట్లు అధికంగా ఉండటంతో ఎక్కువ మంది రైతులు వరి కోత యంత్రాల పైనే ఆధారపడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 75 నుంచి 80 శాతం రైతులు యంత్రాల ద్వారానే కోతలు చేపడుతున్నారు. ధాన్యం వేగంగా ఇంటికి చేర్చుకునేందుకు యంత్రాలు దోహదపడుతూండటంతో అధిక శాతం రైతులు వీటి వైపు మొగ్గు చూపుతున్నారు.
గత ప్రభుత్వ హయాంలో
కోతల వెంటే కొనుగోళ్లు
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియకు అత్యంత ప్రాధాన్యం కల్పించారు. సార్వత్రిక ఎన్నికల హడావుడి ఉన్నా.. రైతులకు ఎటువంటి ఇబ్బందులూ కలగకుండా ఏప్రిల్ 1వ తేదీ నాటికే రైతు భరోసా కేంద్రాల్లో 231 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు.
వీటిని ప్రారంభించిన వెంటనే కొనుగోళ్లకు నాంది పలికారు. ఈ ప్రక్రియకు ముందుగానే ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించింది. క్వింటాల్‌కు రూ.143 పెంచింది. కొనుగోలు చేసిన వెంటనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేసింది.
జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా వరి కోతలు
ఇప్పటికే 5 వేల హెక్టార్లలో పూర్తి
నేటికీ ప్రారంభం కాని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు
మరో 10 రోజులు పట్టే అవకాశం
గిట్టుబాటు ధర సైతం
ప్రకటించని సర్కారు
ప్రణాళికేదీ..?
రబీ కోతలు విస్తృతంగా సాగుతున్నా.. ధాన్యం కొనుగోలు దిశగా ప్రణాళికలు రూపొందించడంలో ప్రభుత్వం, అధికార యంత్రాంగం ఘోరంగా విఫలమైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుత రబీలో జిల్లావ్యాప్తంగా 4 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అధికార యంత్రాంగం చెబుతోంది. ప్రైవేటు అవసరాలకు పోనూ.. 216 ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించేందుకు సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. అయితే, మద్దతు ధరపై ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పష్టతా రాకపోవడంతో కొనుగోలు కేంద్రాలు ఎప్పుడు ప్రారంభించాలనే విషయం అంతుచిక్కని ప్రశ్నగా మారుతోంది. మద్దతు ధర ప్రకటించడం, కేంద్రాలు సిద్ధం చేయడం, తేమ శాతం కొలిచే యంత్రాలు, గోనెసంచులు ఏర్పాటు చేసుకోవాలంటే మరో 10 నుంచి 15 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. అప్పటికి జిల్లాలో 25 శాతం పైగా కోతలు పూర్తయ్యే అవకాశాలున్నాయి. దీనినిబట్టి ఎక్కువ మొత్తంలో ధాన్యాన్ని దళారులు, వ్యాపారులు కొనుగోలు చేస్తే.. ప్రభుత్వం ఏం కొంటుందనే ప్రశ్న తలెత్తుతోంది.
జిల్లాలో వరి కోతల విస్తీర్ణం (హెక్టార్లలో)
మండలం వరి సాగు కోతలు శాతం
సాధారణ విస్తీర్ణం
సాగు
రాజమహేంద్రవరం రూరల్ 1,170 1,299 720 55.4
రాజానగరం 3,549 3,229 320 9.9
కోరుకొండ 2,167 2,251 325 14.4
గోకవరం 1,840 1,989 30 1.5
సీతానగరం 2,891 4,443 1,600 36.0
రంగంపేట 980 849 38 4.5
గోపాలపురం 2,072 2,221 10 0.5
తాళ్లపూడి 3,546 3,602 2 0.1


