సఖినేటిపల్లి: ఒకే కుటుంబంలో వరుసగా ముందు తండ్రి, తర్వాత రోడ్డు ప్రమాదంలో కుమారుడు, ఇప్పుడు అనారోగ్యంతో తల్లి మృతి చెందడంతో పల్లిపాలెంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. వివరాల్లోకి వెళితే.. గ్రామంలో ఏపాటి ఆధారం లేకుండా జీవిస్తున్న కామాడి ఆదిలక్ష్మి కుమారుడు దుర్గా ప్రసాద్ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. అంతకు ముందే భర్తను కూడా ఆమె పోగొట్టుకుంది. ఆదిలక్ష్మిని దత్తత తీసుకుని నిత్యావసర సరుకులు, బట్టలు సమకూరుస్తూ డీటీవో దేవిశెట్టి శ్రీనివాసరావు ఆమె యోగక్షేమాలు చూస్తూ వచ్చారు. ఆగస్టు నెలలో ఆమె పుట్టిన రోజు కేక్ కూడా డీటీవో కట్ చేయించారు. అప్పటికే ఆదిలక్ష్మి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతోంది. భర్త, కొడుకుని పోగొట్టుకున్న ఆమెకు ఒక్క కుమార్తె మాత్రమే ఉంది. ఈ క్రమంలో ఆదిలక్ష్మి కూడా గురువారం మృతి చెందింది. దీంతో ఆమె అంత్యక్రియలు మాజీ సర్పంచ్ ఒడుగు శ్రీను ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న డీటీవో దేవిశెట్టి పల్లిపాలెం వచ్చి ఆమె కాడి మోసి, దహన సంస్కారాలు చేశారు. అనాథగా మిగిలిన కుమార్తెకు కొండంత అండగాఉంటానని భరోసా ఇచ్చారు.


