సాక్షి, అమలాపురం: జిల్లాలో మొత్తం 146 మద్యం దుకాణాలు ఉండగా, 134 దుకాణాలు రెన్యువల్ అయ్యాయి. మరో 12 దుకాణాలకు టెండర్ విధానం అమలు చేస్తున్నారు. రెన్యువల్ అయిన దుకాణాలకు చంద్రబాబు ప్రభుత్వం లైసెన్స్ ఫీజులు గణనీయంగా పెంచింది. గతంలో దుకాణాలకు తొలి ఏడాది రూ.61.50 లక్షలు, రెండో ఏడాది రూ.71.50 లక్షలు లైసెన్స్ ఫీజుగా నిర్ణయించారు. రెండో ఏడాది లైసెన్స్ ఫీజుకు రూ.27.25 లక్షల కలిపి ఈ ఏడాదికి రూ.98.75 లక్షలుగా నిర్ణయించారు. పర్మిట్ రూమ్ కోసం మరో రూ.7.50 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం అన్నీ కలిపి రూ.1.06 కోట్లు. ఇక కొత్తగా దుకాణాలకు నిర్వహించే టెండర్ల ధరావతు రూ.2 లక్షలుగా ఉన్న నాన్ రిఫండబుల్ డీడీని రూ.3 లక్షలకు పెంచారు. లైసెన్స్ ఫీజులతో పాటు అన్నీ పెరిగినా, ఇస్తానన్న కమీషన్‌లో ఆరు శాతం తగ్గించి ఇస్తున్నా దుకాణదారులు మాత్రం వెనకడుగు వేయడం లేదు.
పెరిగిన భారం మందుబాబులపైనే..
లైసెన్స్ ఫీజులు, డీడీలు, పర్మిట్ రూమ్ రుసుములతో పాటు దుకాణాల అద్దెలు, సిబ్బంది వేతనాలు, విద్యుత్, రవాణా, నిర్వహణ ఖర్చులు వ్యాపారులకు అదనంగా ఉంటాయి. ఎకై ్సజ్, పోలీసులకు ఇచ్చే మామూళ్లు వీటికి అదనం. పెట్టుబడి పెరిగిన నేపథ్యంలో ఆ మొత్తాన్ని తిరిగి రాబట్టుకునేందుకు మద్యం విక్రయాల్లో బహిరంగ దోపిడీ చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా క్వార్టర్ బాటిల్‌పై ఎమ్మార్పీ ధర కంటే రూ.10 నుంచి రూ.20 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు.
రెన్యువల్స్ పేరుతో సర్కారు దోపిడీ
లైసెన్స్, పర్మిట్ రూమ్ పేరిట
భారీగా ఫీజులు
అయినా వెనక్కి తగ్గని దుకాణదారులు
ఇప్పటికే ఎమ్మార్పీ కన్నా
అధిక ధరకు మద్యం విక్రయాలు
అదనపు ఫీజులతో మరింత వసూలుకు రెడీ
కోనసీమ జిల్లాలో 146 మద్యం దుకాణాలు
134 మద్యం దుకాణాలు రెన్యువల్
మందుబాబుల జేబుకు చిల్లు
బెల్టుషాపుల్లో ఇంకో మోత
మద్యం దుకాణాల వద్దే పరిస్థితి ఇలా ఉంటే.. బెల్టుషాపుల్లో ధర మరింత మండుతోంది. ఒక్కో మద్యం దుకాణం పరిధిలో సుమారు 15 నుంచి 20 వరకు బెల్టుషాపులు ఉన్నట్టు సమాచారం. గ్రామాలు, శివారు ప్రాంతాల్లో అనధికారికంగా సాగుతున్న ఈ విక్రయ కేంద్రాల్లో క్వార్టర్‌పై రూ.20 నుంచి రూ.30 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. మద్యం దుకాణాలకు సెలవు ఉన్న రోజుల్లో రూ.50 అదనంగా చేసి అమ్మకాలు చేస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
ఇంత జరుగుతున్నా ఎకై ్సజ్ అధికారులు నోరుమెదపడం లేదు. ఎమ్మార్పీ కన్నా అదనంగా అమ్మడం జిల్లాలో బహిరంగంగానే సాగుతోంది. అయినా ప్రభుత్వ పెద్దల నుంచి వస్తున్న ఆదేశాలతో ఎకై ్సజ్ అధికారులు చూసీచూడనట్టుగా వదిలేస్తున్నారు. దీనికితోడు జిల్లాలో ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలో ఏకంగా 45 షాపుల సిండికేట్‌లో ఒక కీలక నేత సోదరుడికి వాటాలున్నాయి. అమలాపురం నేతకు దుకాణాల్లో వాటాలు ఉండగా, కొత్తపేటలో ఒక కీలక దేవస్థానం పాలకవర్గ నేతకు ఏకంగా 62 షాపుల్లో వాటాలుండటం గమనార్హం. కూటమి పార్టీ నేతల హవా కూడా ఎకై ్సజ్ అధికారుల చేతులకు బంధనాలు వేస్తోంది.


