మాజీ ఎంపీ చింతా అనురాధ ఆగ్రహం
అల్లవరం : ప్రజలకు, ప్రభుత్వాన్ని చేరువ చేయాలన్న లక్ష్యంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి లబ్ధిదారుడి చెంతకే సంక్షేమ పథకాలను అందిస్తే, కూటమి ప్రభుత్వం మాత్రం సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు చెల్లింపులకు పాల్పడుతోందని మాజీ ఎంపీ చింతా అనురాధ మండిపడ్డారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. సంక్షేమ ఫలాలను ఇంటికి చేర్చే వలంటీర్లను తొలగించి వారి నోట్లో మట్టికొట్టారని ధ్వజమెత్తారు. నిరుద్యోగులకు నెలకు రూ.3 వేలు ఇస్తామని ప్రకటించి రెండేళ్లయినా ఒక్క నిరుద్యోగికి భృతి ఇచ్చావా అని ప్రశ్నించారు. వలంటీర్లకు రూ.5 వేల గౌరవ వేతనాన్ని రూ.10 వేలకు పెంచుతామని హామీ ఇచ్చి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వ్యవస్థనే కనమరుగు చేశారని మండిపడ్డారు. బాబూ.. నీ పాలనలో నిరుద్యోగులకు భృతి లేదు, వలంటీర్లకు రూ.10 వేలు వేతనం లేదు.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు మాత్రం నెలనెలా చెల్లింపులకు నిధులు ఎక్కడ నుంచి తెస్తావంటూ ప్రశ్నించారు. ఇది ప్రజా పాలనా.. ప్రచార పాలనా అని నిలదీశారు. ప్రజలకు ఉపయోగపడే వ్యవస్థని నిర్వీర్యం చేసి ప్రభుత్వ ప్రచారానికి కొత్త వ్యవస్థను తేవడమేమిటని ప్రశ్నించారు. ప్రజలకు కావాల్సింది సోషల్ మీడియా ప్రచారం కాదని, అభివృద్ధి, సంక్షేమం అని తెలిపారు.
ఉత్సాహభరితంగా
5కే రెడ్ రన్
అమలాపురం రూరల్: హెచ్‌ఐవీ (ఎయిడ్స్)పై యువతలో అవగాహన కల్పించిందుకు అమలాపురంలో శనివారం నిర్వహించిన 5కే రెడ్ రన్ ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ, డిస్ట్రిక్ట్ ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజీ ఫర్ హెచ్‌ఐవీ, ఎయిడ్స్ (దిశ), జిల్లా స్పోర్ట్స్ అథారిటీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. భట్నవిల్లి హైవే వద్ద నిర్వహించిన ఈ పోటీలను ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో, జిల్లా లెప్రసీ, ఎయిడ్స్ అండ్ టీబీ అధికారి శ్రీనివాస్ ప్రారంభించారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలకు చెందిన 140 మంది యువతీయువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మహిళలు, పురుషులకు వేర్వేరుగా పోటీలు నిర్వహించి విజేతలకు నగదు బహుమతులు అందజేశారు. విజేతలను విజయవాడలో నిర్వహించే రాష్ట్రస్థాయి 5కే రెడ్ రన్ పోటీలకు పంపించనున్నట్టు శ్రీనివాస్ తెలిపారు. నాకో సాంకేతిక నిపుణురాలు నాజియా హుస్సేన్, దిశ క్లినికల్ సర్వీస్ ఆఫీసర్ ఎ.బుజ్జిబాబు తదితరులు పాల్గొన్నారు.


