● పెరుగుతున్న వరద గోదావరి
● జిల్లాలో పొంగి పొర్లుతున్న డ్రెయిన్లు
ఐ.పోలవరం/ అయినవిల్లి/ పి.గన్నవరం: గోదావరి వరద క్రమేపీ అధికమవుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద ఇన్ ఫ్లో భారీగా పెరిగింది. ఈ ప్రభావం జిల్లాలోని గోదావరి నదీపాయల్లో కనిపిస్తోంది. గడిచిన మూడు రోజుల నుంచి వరద ఉధృతి పెరుగుతోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద ఈ నెల 24న ఉదయం ఆరు గంటలకు 1,37,099 క్యూసెక్కులు ఉండగా, అది కాస్తా 25న 3,50,387 క్యూసెక్కులకు చేరింది. శనివారం 26వ తేదీ ఉదయం 6 గంటలకు ఇన్ ఫ్లో ఏకంగా 5,02,021 క్యూసెక్కులకు పెరిగింది.
ఉధృతంగా ప్రవహిస్తూ..
వైనతేయ, వశిష్ట, వృద్ధ గౌతమి గోదావరి పాయల్లో వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆదివారం ఉదయం నుంచి వరద మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అన్నంపల్లి, పి.గన్నవరం ఆక్విడెక్టుల వద్ద వరద నీరు ఉరకలేస్తూ ప్రవహిస్తోంది. ఐ.పోలవరం, అయినవిల్లి, ముమ్మిడివరం, మామిడికుదురు, కె.గంగవరం తదితర మండలాల్లో గోదావరి పాయల మధ్య ఉన్న లంక గ్రామాలను ఆనుకుని వరద ప్రవహిస్తోంది. ప్రస్తుతానికి లంక గ్రామాలకు ఎటువంటి ముంపు ప్రమాదం లేదని అధికారులు చెబుతున్నా, రేవులపై ఆంక్షలు మొదలయ్యాయి. ఇప్పటికే కోటిపల్లి – ముక్తేశ్వరం రేవును మూసివేశారు. వరద తీవ్రతను బట్టి మిగిలిన రేవులను కూడా మూసివేసి పడవ ప్రయాణాలను నిలిపివేయడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. బండారులంక ఎగువ కౌశిక, గోరింకల డ్రైన్ల ముంపు నీరు పి.గన్నవరం మండలం ముంజవరం పొట్టు వద్ద వైనతేయలోకి దిగాల్సి ఉంది. అలాగే శంకరగుప్తం డ్రైనేజీ, కేశనపల్లి, గొంది అవుట్‌ఫాల్ స్లూయిస్‌ల ద్వారా ఐ.పోలవరం మండలంలోని నార్త్ అడ్డాల, సౌత్ అడ్డాల డ్రైన్ల నీరు వృద్ద గౌతమీలోకి దిగాల్సి ఉంది. వరద ఉండటంతో ఆశించిన స్థాయిలో ముంపు నీరు దిగడం లేదు.


