టీడీపీ, జనసేనలకు భారీ షాక్‌ | - | Sakshi
Sakshi News home page

టీడీపీ, జనసేనలకు భారీ షాక్‌

Sep 2 2026 12:12 AM | Updated on Sep 2 2026 12:12 AM

పేరవరం సభకు భారీ ర్యాలీగా

తరలివస్తున్న వైఎస్సార్‌ సీపీ శ్రేణులు, ప్రజలు

సభా వేదికపై కొలువుదీరిన నేతలు

వైఎస్సార్‌ సీపీలో చేరిన మాజీ ఎంపీపీ హిమబిందు సతీష్‌ తదితరులు

సభకు భారీగా తరలి వచ్చిన జనం

వైఎస్సార్‌ సీపీకి జైకొట్టిన ఆత్రేయపురం

మాజీ ఎంపీపీ హిమబిందు సతీష్‌

250 మంది కార్యకర్తలతో

కలసి పార్టీలో చేరిక

పేరవరం సభకు తరలివచ్చిన జనం

ఆత్రేయపురం: అధికార కూటమిలోని టీడీపీ, జనసేన పార్టీలకు ఆత్రేయపురం మండలంలో భారీ షాక్‌ తగిలింది. చంద్రబాబు ప్రభుత్వం సాగిస్తున్న అప్రజాస్వామిక, అరాచక పాలనపై విసుగుతో.. ఆ పార్టీలకు చెందిన 250 మంది కార్యకర్తలు వైఎస్సార్‌ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి జైకొట్టారు. పేరవరం గ్రామానికి చెందిన ఆత్రేయపురం మాజీ ఎంపీపీ బెజవాడ హిమబిందు సతీష్‌ ఆధ్వర్యాన మంగళవారం వైఎస్సార్‌ సీపీలో చేరారు. వీరితో పాటు గ్రామానికి చెందిన పలువురు నాయకులు, యువకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వైఎస్సార్‌ సీపీలో చేరడం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సందర్భంగా పేరవరం కల్యాణ మండపం ఆవరణలో జరిగిన సభలో.. వారికి వైఎస్సార్‌ సీపీ ముఖ్య నేత, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) పార్టీ కండువాలు వేసి సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా హిమబిందు సతీష్‌ మాట్లాడుతూ, చంద్రబాబు పాలన నచ్చకే టీడీపీకి గుడ్‌బై చెప్పి, వైఎస్సార్‌ సీపీలో చేరుతున్నామని స్పష్టం చేశారు. ఎటువంటి ప్రయోజనం ఆశించడం లేదని, కష్టపడి కార్యకర్తల్లా పని చేస్తామని చెప్పారు. ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో, జగన్‌, జగ్గిరెడ్డి నాయకత్వంపై విశ్వాసంతో పార్టీలో చేరుతున్నామని అన్నారు.

రాబోయేది జగన్‌ ప్రభుత్వమే

ఈ సందర్భంగా పేర్ని నాని మాట్లాడుతూ, రాబోయేది వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వమేనని, అందులో కార్యకర్తలకు గుర్తింపు, మర్యాద దక్కుతాయని అన్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రజల జీవితాలు దుర్భరంగా మారాయని, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు మోసం చేస్తున్నారని తెలిపారు. ఈ ప్రభుత్వ నిర్వాకం కారణంగా నిండు నీటితో కళకళలాడే గోదావరి డెల్టా ఆయకట్టులో సైతం మొదటి పంటకు సాగునీరు అందని దుస్థితి దాపురించిందని అన్నారు. వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆందోళన చేసిన అనంతరం.. జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కోనసీమలో మోటార్‌ సైకిల్‌పై ప్రయాణిస్తూ డ్రామాలు చేయబోయి, రైతుల వ్యతిరేకతను చవి చూశారని అన్నారు. శివారు భూములకు సాగునీరు అందించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని నాని దుయ్యబట్టారు. అంతేకాకుండా ఓటీపీ ఇచ్చి, రైతులు యూరియా బస్తాలు తీసుకోవాల్సిన పరిస్థితులు సృష్టించిందన్నారు. ఈ దిక్కుమాలిన ప్రభుత్వం ప్రజలకు నరకం చూపిస్తూ, తాగు, సాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడేలా చేసిందని అన్నారు. ఎక్కడ చూసినా సాగునీటికి కరువు వచ్చింది కానీ.. మద్యానికి మాత్రం కరువు లేకుండా చేశారని, మంత్రులు, ఎమ్మెల్యేలు బ్రాందీ షాపుల్లో, డిస్టిలరీల్లో కమీషన్లు దండుకుంటున్నారని విమర్శించారు. రూ.14 కోట్లు ఖర్చు చేసి ‘ఇది మంచి ప్రభుత్వం’ అనే స్టిక్కర్లు వేసుకున్నారని ఆయన తెలిపారు. ఈ ప్రభుత్వంలో ఉద్యోగులకు పీఆర్‌సీ లేదని, పోలీసులకు సైతం టోపీలు పెట్టారని విమర్శించారు. వైఎస్సార్‌ సీపీ తిరిగి అధికారంలోకి రావడానికి మార్పు మొదలైందని అన్నారు. ఇంకా రెండేళ్లకు పైగా అధికారం ఉన్నప్పటికీ, చాలా ఇబ్బందులు పడతామని తెలిసి కూడా వైఎస్సార్‌ సీపీలో చేరి, పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామని అన్న మాజీ ఎంపీపీ హిమబిందు సతీష్‌ తదితరులను నాని అభినందించారు.

వైఎస్సార్‌ సీపీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ, అబద్ధానికి అడ్రస్‌, డ్రెస్‌ చంద్రబాబు అని విమర్శించారు. తిరుమలలో ప్రచారం, ఉచితాలు ఇస్తామనడం అబద్ధమని అన్నారు. బీసీల రాజకీయ చైతన్యానికి ముందడుగు పడింది వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలోనేనని స్పష్టం చేశారు.

సభకు అధ్యక్షత వహించిన వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ, అధికారంలోకి వచ్చాక ప్రజల సమస్యలను చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. రాజకీయ, ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలపై వేధింపులకు పాల్పడుతుందని మండిపడ్డారు. కూటమి పాలనతో విసుగు చెందుతున్న ప్రజలు ప్రత్యామ్నాయంగా వైఎస్సార్‌ సీపీ వైపు చూస్తున్నారని, ఇక్కడి చేరికలే దీనికి నిదర్శనమని అన్నారు. జగన్‌ పాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఇప్పటికీ ప్రజలకు గుర్తున్నాయని అన్నారు. ఈ సభలో మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ విప్పర్తి వేణుగోపాలరావు, ఎమ్మెల్సీలు బొమ్మి ఇజ్రాయిల్‌, కుడుపూడి సూర్యనారాయణరావు, వైఎస్సార్‌ సీపీ అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి, మాజీ ఎంపీలు చింతా అనురాధ, మార్గాని భరత్‌రామ్‌, కొత్తపేట నియోజకవర్గ పరిశీలకులు పాటి శివకుమార్‌, నాయకులు జక్కంపూడి గణేష్‌, వాసు, కర్రి పాపారాయుడు, వంటెద్దు వెంకన్నాయుడు, మాజీ ఎంపీపీ కుండ అన్నపూర్ణ, జెడ్పీటీసీ సభ్యుడు బోణం సాయిబాబు, అధికార ప్రతినిధి కప్పల శ్రీధర్‌, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి చిలువూరి రామకృష్ణంరాజు, పార్టీ మండల అధ్యక్షుడు కనుమూరి శ్రీనురాజు, కొల్లి శామ్సన్‌, పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement