బుధవారం శ్రీ 2 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

బుధవారం శ్రీ 2 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026

Sep 2 2026 12:12 AM | Updated on Sep 2 2026 12:12 AM

–8లో..

రాజా ది గ్రేట్‌

అత్యధిక శాతం ప్రజలకు జీవనాధారమైన వ్యవసాయం దండగన్న చంద్రబాబు ఏలుబడి సాగుతున్న రోజులవి. 2004కు ముందు.. నేల విడిచి, హైటెక్‌ దారుల్లో పరుగులు తీస్తున్న ఆయన ప్రభుత్వాన్ని.. అత్యధిక శాతం ప్రజల మద్దతుతో గద్దె దించి.. పరిపాలనను తిరిగి నేల పైకి తీసుకొచ్చిన మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి. సంక్షేమం, అభివృద్ధిలో ఆయన కొత్త చరిత్రను లిఖించారు. తీవ్ర నిర్లక్ష్యానికి గురైన అన్నదాతల కన్నీరు తుడిచారు. పుడమి తల్లి ఒడిలో పసిడి పంటలు పండేందుకు బాటలు వేశారు. సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా భావించి.. సరికొత్త ప్రజాపాలనను అందించారు. తన హయాంలో కోనసీమ సమగ్రాభివృద్ధికి ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. నేడు వైఎస్సార్‌ వర్ధంతి సందర్భంగా.. ఆ మహనీయుడు జిల్లాకు చేసిన సేవలను స్మరించుకుందాం రండి...

ఆలమూరు: దివంగత మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి పేరు వింటనే కోనసీమలోని ప్రతి పేదవాడి కళ్లల్లో వెలుగు, రైతుల కళ్లల్లో ఆనందం నిండుతాయి. దేశ చరిత్రలోనే కనీవిని ఎరుగని రీతిలో ఆ మహానేత రూపొందించి, అమలు చేసిన సంక్షేమ పథకాలు.. ప్రజల గుండెల్లో ఇప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయాయి. దేశవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందాయి. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయి. సంక్షేమంతో పాటు అభివృద్ధికి సైతం వైఎస్సార్‌ ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు.

ఆరోగ్య సిరులు

కోనసీమ వాసులకు అప్పటికి ఇంకా సూపర్‌ స్పెషాలిటీ వైద్యం అందని ద్రాక్షగా ఉండేది. గుండె జబ్బులు, క్యాన్సర్‌, కిడ్నీ వ్యాధుల బారిన పడిన పేదలు అప్పుల పాలయ్యేవారు. అలాంటి సమయంలో నాటి ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా రూపొందించిన ఆరోగ్యశ్రీ పథకం పేదలకు వరంగా మారింది. ఈ పథకం కింద కోనసీమలోని వేలాది మంది పేదలు కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో అధునాతన వైద్యాన్ని ఉచితంగా అందుకుని, సంపూర్ణ ఆరోగ్యంతో స్వస్థత పొందారు. ఆరోగ్యశ్రీ అంటే ఇప్పటికీ వైఎస్సార్‌ మాత్రమే గుర్తుకొస్తారని అంటే ఎంతమాత్రం అతిశయోక్తి కాదు.

అందుబాటులోకి అపర సంజీవనులు

అంబులెన్స్‌ అంటే ఏమిటో తెలియని గ్రామీణ ప్రజల ప్రాణ రక్షణ కోసం వైఎస్సార్‌ 108 వాహన సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు. జిల్లాలోని ఏ మారుమూల గ్రామంలో ఆరోగ్యపరంగా ఎవరికి ఏ సమస్య వచ్చినా.. 108 నంబర్‌కు ఫోన్‌ చేస్తే చాలు.. అర్ధరాత్రి, అపరాత్రి అనే తేడా లేకుండా.. కుయ్‌..కుయ్‌.. కుయ్‌మంటూ నిమిషాల వ్యవధిలోనే అంబులెన్స్‌ వచ్చేది. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారికి ప్రథమ చికిత్స అందించి, ఆసుపత్రికి తరలించి, ప్రాణాలు కాపాడేది. ప్రభుత్వాలు మారినా ఇప్పటికీ ఈ సేవలు యథాతథంగా కొనసాగుతూనే ఉన్నాయి. అలాగే, 104 నంబరుతో సంచార వైద్యశాలలు ఏర్పాటు చేసి, ప్రతి గ్రామానికీ వెళ్లి, అక్కడి ప్రజలకు వైద్య పరీక్షలు చేసి, ఉచితంగా మందులు ఇచ్చే ఏర్పాటును వైఎస్సార్‌ చేశారు. తన వినూత్న పథకాలతో లక్షలాది మంది ప్రాణాలను ఆయన నిలిపారు. అందుకే ఆయనను ప్రజలు ఇప్పటికీ దేవుడిగానే భావిస్తూంటారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో చదువుల విప్లవం

కోనసీమలోని రైతు కుటుంబాల పిల్లలకు ఇంజినీరింగ్‌, మెడిసిన్‌ వంటి ఉన్నత విద్య అభ్యసించడం కలగానే ఉండేది. భారీ ఫీజులు చెల్లించలేక చాలా మంది ప్రతిభావంతులు ఉన్నత చదువులకు దూరమయ్యేవారు. అటువంటి వారి కలను వైఎస్సార్‌ అమలు చేసిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం నిజం చేసింది. ఈ పథకం ఆసరాతో జిల్లాలోని వేలాది మంది పేద విద్యార్థులు ఇంజినీర్లు, డాక్టర్లుగా ఎదిగారు.

అభివృద్ధి ప్రదాత

నాడు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో భాగమైన కోనసీమను అప్పటి ముఖ్యమంత్రి వైఎస్సార్‌ సుమారు రూ.3 వేల కోట్లతో అభివృద్ది చేశారు.

రూ.1,160 కోట్లతో డెల్టా ఆధునికీకరణకు శ్రీకారం చుట్టారు.

రూ.550 కోట్లతో మురుగు కాలువల అభివృద్ధి చేపట్టారు.

గోదావరి ఏటిగట్ల పటిష్టతకు, విస్తరణకు రూ.1,070 కోట్లు మంజూరు చేశారు.

అన్నంపల్లి అక్విడెక్టును రూ.48 కోట్లతో ఆధునికీకరించి, దాదాపు 18 వేల ఎకరాలకు సాగునీరు అందించారు.

కోనసీమలో 20,452 మంది రైతులకు ఉచిత వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు అందజేశారు.

2007లో కొబ్బరి సంక్షోభం ఏర్పడినప్పుడు కోనసీమలో కొత్త కొబ్బరిపై 2 శాతం వ్యాట్‌ తగ్గించి, రైతులకు అండగా నిలిచారు.

లంకల వెంబడి అనేక ప్రాంతాల్లో నదీకోత నివారణకు గ్రోయిన్లు నిర్మించారు.

రాజమహేంద్రవరం నుంచి నేరుగా యానాం వెళ్లేందుకు ఏటిగట్టు రోడ్డు అభివృద్ధికి అధిక నిధులు కేటాయించారు.

వరద ముప్పు నుంచి కాపాడేందుకు ఏటిగట్ల ఎత్తు పెంచి, పటిష్టపరిచారు. ఇరువైపులా ఆహ్లాదకర వాతావరణం కల్పించేందుకు మొక్కలు నాటారు.

మరెన్నో పథకాలతో..

ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద జిల్లాలోని వేలాది మంది పేదలకు నాటి వైఎస్సార్‌ ప్రభుత్వం సొంత గూడు కల్పించింది. రావులపాలెం, మడికి శివారు నాగులపేటలో గ్రామాల మాదిరిగా కొత్త ఊళ్లనే నిర్మించారు.

మహిళా సంఘాలు ఆర్థికంగా బలపడేందుకు పావలా వడ్డీ పథకంతో అండగా నిలిచారు.

రైతులకు ఉచితంగా వ్యవసాయ విద్యుత్‌ అందజేశారు. రూ.2 లక్షల వరకూ రుణమాఫీ చేశారు. గిట్టుబాటు ధరల కోసం ప్రత్యేక నిధులు కేటాయించి రైతులకు భరోసా కల్పించారు. ఏకంగా 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా డెల్టా ఆధునికీకరణకు భారీగా నిధులు ఇచ్చారు.

నా బిడ్డకు ప్రాణబిక్ష పెట్టారు

వైఎస్‌ రాజశేఖరరెడ్డి మా కుటుంబానికి దేవుడు. రెండేళ్ల ప్రాయంలో నా కుమారుడికి గుండె సంబధిత వ్యాఽ ది వచ్చింది. ఆ సమయంలో శస్త్ర చికిత్స చేయించుకునే స్తోమత నాకు లేకపోయింది. ఆ సమయంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని వైఎస్సార్‌ ప్రవేశపెట్టారు, రూ.లక్షల విలువైన శస్త్రచికిత్సను 2007 ఏప్రిల్‌ 14న హైదరాబాద్‌ నిమ్స్‌ ఆసుపత్రిలో ఉచితంగా చేశారు. ప్రస్తుతం నా కుమారుడు ఆరోగ్యంగా ఉంటూ ఇంటర్‌ సెకండియర్‌ చదువుతున్నాడు.

– జల్లి సూరిబాబు, నర్సరీ వ్యాపారి,

పినపళ్ల, ఆలమూరు మండలం

రైతుబాంధవుడు వైఎస్సార్‌

సాగునీరు సక్రమంగా అందక ఇబ్బందులు పడుతున్న కోనసీమను అన్ని విధాలుగా ఆదుకున్న రైతుబాంధవుడు వైఎస్సార్‌. 2004లో ఆయన అధికారం చేపట్టిన వెంటనే గోదావరి డెల్టా కాలువల ఆధునికీకరణకు రికార్డు స్థాయిలో నిధులు మంజూరు చేశారు. అన్నంపల్లి అక్విడెక్టు కట్టి సుమారు 18 వేల ఎకరాలకు సాగునీరు అందించారు. ప్రతి రైతుకు రూ.2 లక్షల వరకూ రుణమాఫీ చేశారు. వైఎస్సార్‌ను తెలుగుజాతి ఎన్నటికీ మరువదు.

– జిన్నూరి రామారావు (బాబీ), వైఎస్సార్‌ సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, అమలాపురం

రైతులకు ఉచిత విద్యుత్‌ వరం

వైఎస్సార్‌ అత్యంత సాహసోపేతంగా ప్రవేశపెట్టిన ఉచిత వ్యవసాయ విద్యుత్‌ పథకం రైతులకు వరం లాంటిది. దీనివల్ల డెల్టా ప్రాంతాల్లో వ్యవసాయంపై రైతులకు మక్కువ ఏర్పడింది. కోనసీమ ప్రాంతమంతా సస్యశ్యామలంగా మారింది. అదే బాటలో మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ పరిపాలించి రైతులను అన్ని విధాలుగా ఆదుకున్నారు.

– గుణ్ణం రాంబాబు,

మాజీ సర్పంచ్‌, గుమ్మిలేరు

కోనసీమ సమగ్రాభివృద్ధికి

వైఎస్సార్‌ అధిక ప్రాధాన్యం

జిల్లాకు సుమారు రూ.3 వేల

కోట్ల కేటాయింపు

ఆయన హయాం.. పేదలకు,

రైతులకు స్వర్ణయుగం

నేడు ఆ మహానేత వర్ధంతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement