వారికే మళ్లీ.. కిక్కు! | - | Sakshi
Sakshi News home page

వారికే మళ్లీ.. కిక్కు!

Sep 1 2026 12:19 AM | Updated on Sep 1 2026 12:19 AM

సాక్షి, అమలాపురం: ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ఆదాయాన్ని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టి.. ప్రజల సొమ్మును లూటీ చేసే రీతిలో రాష్ట్రంలో మద్యం వ్యాపారం సాగుతోంది. మద్యం దుకాణాల లీజు గడువు వచ్చే నెలతో ముగుస్తోంది. కానీ, ప్రభుత్వం కొత్త విధానం తీసుకు రాకుండా పాత సిండికేటుకే మరో ఏడాది కట్టబెట్టేందుకు సిద్ధమవుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దుకాణదారులు నష్టపోయారంటూ తప్పుడు ప్రచారాన్ని తెర మీదకు తెచ్చి, మళ్లీ వారికే ఏడాది పాటు లైసెన్సులు రెన్యువల్‌ చేసేందుకు సిద్ధమవుతున్న తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.

జిల్లాలో 133 మద్యం దుకాణాలున్నాయి. ఇవన్నీ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోనే ఉన్నాయి. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత రెండేళ్లకు గాను ఈ దుకాణాలను లాటరీ విధానంలో లీజుకు ఇచ్చిన విషయం తెలిసిందే. వీటిలో గీత కార్మికులకు కూడా కొన్ని అప్పగించారు. ఈ దుకాణాల గడువు పూర్తవుతున్న తరుణంలో ప్రభుత్వం మరో రెండేళ్లకు లాటరీ తీస్తోందనే ప్రచారం జరిగింది. అయితే, కోనసీమతో పాటు పలు జిల్లాల్లో అధికార పార్టీ కీలక నేతల చేతుల్లోనే మద్యం దుకాణాలున్నాయి. వారందరూ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి, ఏడాది పాటు రెన్యువల్‌ చేయాలని పట్టుబడుతున్నారు.

డీడీల నుంచే సిండికేటు

జిల్లాలో మద్యం దుకాణాలకు 2024లో లాటరీ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఒక్కో దుకాణాన్ని పొందేందుకు రూ.2 లక్షల చొప్పున డీడీలు చెల్లించారు. ఈ విధానాన్ని అడ్డం పెట్టుకుని మద్యం వ్యాపారులు అప్పట్లోనే సిండికేటుగా మారారు. ఒక్కో సిండికేటు తరఫున 40 నుంచి 60 డీడీలు వేశారు. అమలాపురం నియోజకవర్గం ఉప్పలగుప్తానికి చెందిన ఒక అధికార పార్టీ అనుకూల వ్యక్తి కోనసీమలో అమ్మకాలు అధికంగా ఉండే దుకాణాలకు ఏకంగా 160 డీడీలు వేశాడంటే సిండికేటు ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలా షాపులు దక్కించుకున్న తర్వాత, మద్యపాన ప్రియులను లూటీ చేసేందుకు ఆ వ్యాపారులు పక్కా ప్రణాళికతో మరోసారి సిండికేటుగా మారారు.

తప్పుడు ప్రచారంతో..

u మద్యం అమ్మకాల మీద ప్రభుత్వం దుకాణదారులకు 20 శాతం కమీషన్‌ ఇస్తానని చెప్పింది. తొలుత 9 శాతం చొప్పున కమీషన్‌ ఇచ్చిన ప్రభుత్వం తరువాత దానికి ఒక శాతం పెంచి 10 శాతం చేసింది. తరువాత మరో 4 శాతం పెంచి 14 శాతం చేసింది. మొత్తానికి తొలుత ఇస్తామన్న 20 శాతం కమీషన్‌ ఇవ్వలేదు. దీనివల్ల తాము నష్టపోయామంటూ సిండికేట్లు కట్టుకథ అల్లుతున్నారు. ప్రభుత్వం కూడా ఇదే తప్పుడు ప్రచారాన్ని ప్రచారంలో పెట్టింది. వాస్తవానికి ప్రభుత్వం ఇచ్చే కమీషన్‌కు పదింతలు ఎక్కువగా మందుబాబుల నుంచి మద్యం సిండికేట్లు లూటీ చేస్తున్నాయి.

u గరిష్ట చిల్లర ధర (ఎంఆర్‌పీ) కన్నా విస్కీ, బ్రాందీ, బీరు, క్వార్టర్‌ బాటిళ్లపై రూ.10 నుంచి రూ.20 వరకూ అదనంగా ఎప్పట్నుంచో వసూలు చేస్తున్నారు. బెల్టు షాపులకు అమ్మే మద్యం మీద అయితే రూ.20 నుంచి రూ.30 వరకూ అదనంగా బాదేస్తున్నారు. ఈవిధంగా ప్రభుత్వం ఇస్తామన్న 20 శాతం కన్నా ఎక్కువ లాభాలనే వారు అక్రమంగా దండుకుంటున్నారు.

u ప్రతి మద్యం దుకాణానికి అనుబంధంగా 15 నుంచి 20 బెల్టు షాపులు నడుపుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా అనధికార పర్మిట్‌ రూములు, బార్ల తరహాలో ఏర్పాట్లు చేసి విచ్చలవిడిగా మద్యం అమ్ముతున్నారు. అంబాజీపేట మండలం గంగలకుర్రు గ్రామంలోనే 15కు పైగా బెల్టు షాపులున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయినప్పటికీ మద్యం దుకాణాల నిర్వాహకులకు నష్టాలొస్తున్నాయంటూ తప్పుడు ప్రచారం అధికంగా చేస్తున్నారు. తద్వారా వారికి ఆరు నెలలు లేదా ఏడాది పాటు లీజు గడువు పెంచేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సమాచారం.

ఫ వచ్చే నెలతో ముగియనున్న మద్యం దుకాణాల లీజు

ఫ పాతవారికే ఇచ్చేలా సిండికేట్‌ మంత్రాంగం

ఫ అందుకే నష్టాలంటూ వ్యూహాత్మకంగా ప్రచారం

ఫ అధికార పార్టీ ఎమ్మెల్యేలకు వాటాలే అసలు కారణం

ఫ వారి ద్వారా మరో ఏడాది గడువు

పెంచేలా ప్రభుత్వంపై ఒత్తిడి

‘స్థానిక’ ఎన్నికల నిధికి సిండికేట్‌ సిద్ధం

అయితే, ఇక్కడే అసలు కథ ఉంది. ఈ ఏడాది చివరి నాటికి మున్సిపల్‌, పంచాయతీ, జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ ఎన్నికలు నిర్వహించే అవకాశముంది. ఈ నేపథ్యంలో మద్యం సిండికేటు ద్వారా భారీగా నిధులు సమకూర్చుకునేందుకు అధికార పార్టీ పావులు కదుపుతోందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. దీనికి తోడు మద్యం దుకాణాల్లో అధికార పార్టీ నేతలకు సైతం వాటాలున్నాయి. ముమ్మిడివరం నియోజకవర్గంలోని ఓ కీలక నేత సోదరుడి ఆధ్వర్యాన సిండికేటులో భాగంగా ఏకంగా 46 షాపుల్లో వాటా ఉందని చెబుతారు. అమలాపురం, కొత్తపేట, రామచంద్రపురం, మండపేట నియోజకవర్గాల్లో కీలక ప్రజాప్రతినిధులు సైతం బినామీల పేరుతో మద్యం దుకాణాల్లో వాటాలు పెట్టారని తెలుస్తోంది. ఈ నేతలే ఇప్పుడు మరో ఏడాది పాటు లీజు పొడిగించాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సైతం లీజు గడువు పెంచేందుకు ‘పచ్చ’జెండా ఊపుతుందని మద్యం దుకాణదారులు ఒక అంచనాకు వచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement