బెంగాల్ వైపు కొట్టుకుపోయాం
‘బోటుకు పాత లారీ ఇంజిన్ వినియోగించడంతో సముద్రంలో వేట కొనసాగిస్తున్న సమయంలో గేర్ బాక్స్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. బోటు ముందుకు కదలక నడి సంద్రంలోనే నిలిచిపోయింది. పలుమార్లు ప్రయత్నించినా ఇంజిన్ పని చేయలేదు. దీంతో, బోటు సముద్ర ప్రవాహానికి, గాలివాటుకు కొట్టుకుపోతూ పశ్చిమ బెంగాల్ తీరం వైపు వెళ్లింది. 23 రోజుల పాటు సముద్రంలో చిక్కుకుపోయిన సమయంలో మా వద్ద ఉన్న ఆహార నిల్వలు పూర్తిగా అయిపోయాయి. తాగునీరు కూడా అయిపోయి, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఆ సమయంలో కురిసిన వాన నీటిని సేకరించడంతో పాటు బోటులో ఉన్న ఐస్ కరగడం ద్వారా వచ్చిన నీటిని తాగుతూ ప్రాణాలు నిలబెట్టుకున్నాం. రోజులు గడిచేకొద్దీ ఆహారం, తాగునీరు అందుబాటులో లేక, ఎప్పుడేం జరుగుతుందో తెలియక తీవ్ర ఆందోళనకు గురయ్యాం. సముద్రంలో మొబైల్ ఫోన్ సిగ్నల్స్ అందుబాటులో లేకపోవడంతో కుటుంబ సభ్యులను, అధికారులను సంప్రదించలేకపోయాం. మా వద్ద ఉన్న వీహెచ్‌ఎఫ్ సెట్ల ద్వారా సమాచారం పంపేందుకు పలుమార్లు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది’ అని కలెక్టర్‌కు మత్స్యకారులు వివరించారు.
ఫ 23 రోజులు అలలతోనే సావాసం
ఫ బోటు ఇంజిన్ చెడిపోయింది
ఫ నీళ్లు తాగి ప్రాణాలు నిలబెట్టుకున్నాం
ఫ చివరకు బెంగాల్ ఒడ్డుకు సురక్షితంగా చేరాం
ఫ సముద్రంలో తప్పిపోయి, తిరిగి వచ్చిన మత్స్యకారులతో కలెక్టర్ ముఖాముఖి
అమలాపురం రూరల్: ‘నడి సంద్రంలో బోటు ఇంజిన్ చెడిపోయింది.. సాగర ప్రవాహానికి దిశ, గమ్యం లేకుండా బోటు కొట్టుకుపోయింది.. తీసుకెళ్లిన ఆహారం అయిపోయింది.. గత్యంతరం లేక కేవలం నీళ్లు తాగి ప్రాణాలు నిలబెట్టుకున్నాం.. చివరకు సురక్షితంగా ఒడ్డుకు చేరాం’ అంటూ ఇటీవల సముద్రంలో జాడ తెలియకుండా పోయి, మూడు వారాల తరువాత క్షేమంగా తిరిగి వచ్చిన మత్స్యకారులు చెప్పారు. అల్లవరం మండలం ఓడలరేవు నుంచి ఆగస్టు 3న సముద్రంలో చేపల వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు జాడ తెలియకుండా పోయిన విషయం అదే నెల 17న వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆగస్టు 13వ తేదీనే వారు తీరానికి తిరిగి చేరాల్సి ఉండగా ఆచూకీ తెలియరాలేదు. ఎట్టకేలకు వారు పశ్చిమ బెంగాల్‌లోని దిఘా తీరానికి చేరుకున్నట్లు ఆగస్టు 26న సమాచారం అందింది. అనంతరం, వారు ఆగస్టు 28న ఓడలరేవుకు సురక్షితంగా చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఆ మత్స్యకారులతో కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ సోమవారం కలెక్టరేట్‌లో ముఖాముఖి నిర్వహించి, సముద్రంలో వారు పడిన కష్టాలు, ఆపదను అధిగమించేందుకు చేసిన యత్నాలను అడిగి తెలుసుకున్నారు.
మత్స్యకారుల భద్రతపై ప్రత్యేక దృష్టి
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు జాగ్రత్తలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. సముద్రంలో వేటకు వెళ్లే ప్రతి మత్స్యకారుడికీ అత్యవసర పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలి, రక్షణ పరికరాలు ఎలా వినియోగించాలి, అధికారులకు అత్యవసర సమాచారం ఏవిధంగా చేరవేయాలనే అంశాలపై అవగాహన కల్పించాలని మత్స్యశాఖ జేడీని ఆదేశించారు. ఆపద సమయంలో ఇతర బోట్లు, కోస్ట్‌గార్డ్, మైరెన్ పోలీస్, మత్స్యశాఖ అధికారులకు అత్యవసర సమాచారాన్ని వేగంగా చేరవేసేందుకు సిగ్నల్స్ పంపే విధానంపై ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో మత్స్య శాఖ అడిషనల్ డైరెక్టర్, కాకినాడలోని స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ (ఎస్‌ఐఎఫ్‌టీ) ప్రిన్సిపాల్ అంజలి, జిల్లా మత్స్యశాఖ అధికారి కె.కరుణాకరరావు, కాకినాడలోని భారత్ మైరెన్ యాక్సెసరీస్ ప్రతినిధి కిర్లోస్కర్ రాజు, కాకినాడ ఇండియన్ కోస్టుగార్డు ప్రతినిధి కె.శ్రీను, మైరెన్ పోలీస్ సీఐ ఎంవీవీఎస్‌ఎన్ మూర్తి, ఓడలరేవు ఎస్సై ఒ.పుల్లారావు, ఏడీఎఫ్ వి.రవికమార్, ఎఫ్‌డీఓ కె.చలపతి పాల్గొన్నారు.
మరమ్మతు చేశాను
మూడో తరగతి వరకూ చదువుకున్నాను, పెద్దయిన తర్వాత ఐదేళ్ల పాటు వెల్డింగ్, ఇంజిన్ మరమ్మతు పనులు చేసేవాడిని. ఆ పని మానేసి, పదేళ్లుగా సముద్రంపై వేటకు వెళ్తున్నాను. గేర్ బాక్స్ ఇంజిన్ల మరమ్మతులపై నాకు గతంలో అనుభవం ఉండటంతో మా బోటు గేర్ బాక్స్ తెరచి, కొత్త క్లచ్ ప్లేట్లు అమర్చాను. అయినప్పటికీ అలైన్‌మెంట్ సరిగ్గా లేక గేర్ బాక్స్ వేడెక్కి, ఇంజిన్ పూర్తిగా ఆగిపోయింది. సముద్రంలో చుట్టుపక్కల ఎవరూ కనిపించకపోవడంతో ఎంతో భయపడ్డాం. బోటు ఓనరు ధైర్యం చెప్పారు. ఉన్న ఆహార పదార్థాలను రెండు రోజులకోసారి తింటూ క్షేమంగా బయటపడ్డాం. – కొల్లాటి శ్రీనుబాబు, ఓడలరేవు
ధైర్యం కోల్పోలేదు
గత 25 సంవత్సరాలుగా సముద్రంపై వేటాడుకుంటూ జీవనం సాగిస్తున్నాను. ఆగస్టు 3న బయలుదేరిన తరువాత చేపలు దొరకక సముద్రంలో మరింత లోపలకు వెళ్లాం. 30 నాటికల్ మైళ్లు దాటిన తర్వాత గేర్ బాక్స్‌లో నీరు చేయడంతో క్లచ్ ప్లేట్లు పాడైపోయాయి. రెండు రోజుల పాటు మరమ్మతులు చేసుకుని తిరుగు ప్రయాణం ప్రారంభించాం. కొద్దిసేపటికే మళ్లీ బోటు నిలిచిపోయింది. దీంతో, గాలి వేగానికి సుమారు 25 నాటికల్ మైళ్ల దూరం వెళ్లిపోయాం. చుట్టూ ఎటువంటి బోట్లు, షిప్పులు కనిపించలేదు. ఓవైపు తుపాను వాతావరణం, మరోవైపు తినడానికి తిండి లేకపోవడంతో తోటి మత్స్యకారులు ఎంతో ఆందోళన చెందారు. వెనుకకు వెళ్తే ప్రాణాలకే ముప్పు వస్తుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ ధైర్యం కోల్పోవద్దని, ఎలాగైనా తీరానికి చేరుకుంటామని ధైర్యం చెప్పాను. తెరచాప సాయంతో కొద్ది రోజులకు పరదీప్, అస్తరకు 50 నాటికల్ మైళ్ల సమీపానికి చేరుకున్నాం. అక్కడ బోట్లు కనిపించడంతో మాకు ధైర్యం వచ్చింది. అలా 26వ తేదీ నాటికి పశ్చిమ బెంగాల్‌లోని దిఘా ప్రాంతానికి చేరుకున్నాం.
– కొప్పనాతి రామకృష్ణవర్మ, బోటు యజమాని,
ఓడలరేవు


