కుల వివక్ష చూపిన వ్యాపారిపై అట్రాసిటీ కేసు | - | Sakshi
Sakshi News home page

కుల వివక్ష చూపిన వ్యాపారిపై అట్రాసిటీ కేసు

Sep 1 2026 12:19 AM | Updated on Sep 1 2026 12:19 AM

అమలాపురం రూరల్‌: అయినవిల్లి మండల కొబ్బరి ఒలుపు కార్మికుల పట్ల కుల వివక్ష ప్రదర్శించిన వ్యాపారి మద్దాల తమ్మారావుపై వెంటనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కొబ్బరి ఒలుపు కార్మిక సంఘం (సీఐటీయూ) నేతలు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు కలెక్టరేట్‌ వద్ద సోమవారం భారీ ధర్నా నిర్వహించి, కలెక్టర్‌ మహేష్‌ కుమార్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుబ్బారావు మాట్లాడుతూ, శ్రమనే నమ్ముకుని జీవిస్తున్న కార్మికులను వ్యాపారి తమ్మారావు తీవ్రంగా అవమానించడం అత్యంత హేయమమని మండిపడ్డారు. ‘కూర్చోడానికి కుర్చీలు కూడా వేయం. ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకోండి’ అంటూ అహంకారంతో మాట్లాడిన ఆయనపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు జి.దుర్గాప్రసాద్‌ మాట్లాడుతూ, నానాటికీ పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా కొబ్బరి ఒలుపు కూలి రేట్లను వెంటనే పెంచాలని డిమాండ్‌ చేశారు. కొబ్బరి పొట్టు వల్ల ఊపిరితిత్తుల వ్యాధుల బారిన పడుతున్న కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేకంగా కొబ్బరి కార్మిక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. పని ప్రదేశాల్లో పాములు, తేళ్లు కుట్టి మరణిస్తున్న కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం, వ్యాపారుల భాగస్వామ్యంతో గ్రూప్‌ ఇన్సూరెన్సు అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లపై లేబర్‌ అధికారులు స్పందించకపోవడం దారుణమని, కలెక్టర్‌ వెంటనే జోక్యం చేసుకుని సమస్యలు పరిష్కరించాలని, లేకుంటే జిల్లావ్యాప్తంగా ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఒలుపు కార్మికుల పోరాటానికి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కారెం వెంకటేశ్వరరావు, ఇసుకపట్ల మంగాదేవి మద్దతు తెలిపారు. కార్యక్రమంలో ఒలుపు కార్మిక సంఘం మండల అధ్యక్షుడు కడలి సూర్యనారాయణ, కార్యదర్శి నేదునూరి లవరాజు, 11 కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.

హామీలు అమలు చేయాలి

అమలాపురం రూరల్‌: ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ కలెక్టరేట్‌ వద్ద ఉద్యోగులు సోమవారం నిరసన తెలిపారు. ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్త ఆందోళనలో భాగంగా జిల్లా జేఏసీ అధ్యక్షుడు వాసా దివాకర్‌ ఆధ్వర్యాన ఈ ఆందోళన నిర్వహించారు. బొప్పరాజుపై భూపతిరాజు రవీంద్రరాజు చేసిన విమర్శలను ఈ సందర్భంగా నాయకులు ఖండించారు. 14 లక్షల మంది ఉద్యోగుల హక్కులు, పీఆర్‌సీ, ఐఆర్‌, డీఏల సాధన కోసం పోరాడుతున్న బొప్పరాజును వ్యక్తిగతంగా విమర్శించడం సరికాదని అన్నారు. ఆయనపై చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల సమయంలో ఉద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ విధానం (సీపీఎస్‌) రద్దు చేసి పాత పెన్షన్‌ విధానం (ఓపీఎస్‌) అమలు చేయాలని వీఆర్‌ఓ సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు. తహసీల్దార్‌, కోనసీమ జేఏసీ అధ్యక్షుడు వాసా శామ్యూల్‌ దివాకర్‌ మాట్లాడుతూ, గత అసెంబ్లీ సమావేశాల్లో ఉద్యోగులకు సుమారు రూ.40 వేల కోట్ల బకాయిలున్నట్లు ప్రభుత్వం పేర్కొందని, ఆ బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారో స్పష్టం చేయాలని కోరారు. ప్రధాన కార్యదర్శి మద్దాల బాబూజీ మాట్లాడుతూ, పెండింగ్‌ డీఏలు, ఎరియర్స్‌ చెల్లించకపోవడంతో ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఉద్యోగులకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. పీఆర్‌సీ, ఐఆర్‌, డీఏ బకాయిలతో పాటు ఉద్యోగుల హక్కులకు సంబంధించిన అన్ని అంశాలపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో తహసీల్దార్లు పలివెల అశోక్‌ ప్రసాద్‌, చెవ్వూరి రవి, సత్తిబాబు, కల్యాణ్‌ చక్రవర్తి, భారతి, అడపా సుబ్రహ్మణ్యం, డిప్యూటీ తహసీల్దార్‌ శ్రీనివాస్‌, వీఆర్‌ఓల సంఘం అధ్యక్షుడు సాధనాల ఏల్లేశ్వరరావు, ఆర్‌ఐ చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

కూలి రేట్లు పెంచాలి

కొబ్బరి ఒలుపు కార్మికుల డిమాండ్‌

కలెక్టరేట్‌ వద్ద ధర్నా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement