అమలాపురం రూరల్: కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు 185 అర్జీలు సమర్పించారు. వారి నుంచి కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్, డీఆర్‌ఓ వి.సుబ్బారావు, డీఆర్‌డీఏ పీడీ దుడ్డి రాంబాబు, సమగ్ర శిక్ష ఏపీఓ మమ్మీ, డీఎల్‌డీఓ విజయలక్ష్మి తదితరులు అర్జీలు స్వీకరించారు. ఆన్‌లైన్‌లో భూ రికార్డుల నమోదు, రీ సర్వే, భూ ఆక్రమణలు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, పారిశుధ్యం, మురుగు కాలువల్లో పూడికతీత, ఇంటి స్థలం, గృహ నిర్మాణం, పింఛన్లు, సదరం సర్టిఫికెట్లు, రోడ్ల మంజూరు తదితర సమస్యలపై ప్రజలు అర్జీలు అందజేశారు. వీటిని క్షుణ్ణంగా పరిశీలించి, నాణ్యతతో సకాలంలో పరిష్కరించాలని ఈ సందర్భంగా అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
సదరంలో అవినీతి లీలలు
ఉప్పలగుప్తం: మండలంలోని ఎన్.కొత్తపల్లి గ్రామానికి చెందిన పట్టా సత్య వెంకట్ మూడో తరగతి చదువుతున్నాడు. పుట్టుకతో దివ్యాంగుడు. నడవలేడు, మాట్లాడలేడు. అతడిని సదరం పరీక్షకు మూడుసార్లు తీసుకెళ్లినా, అధికారుల చుట్టూ తిరిగినా.. వైకల్యం పర్సంటేజీ వేయకుండా కాలయాపన చేశారని బహుజన్ సమాజ్ పార్టీ అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి పొలమూరి మోహన్‌బాబు చెప్పారు. ఈ మేరకు సత్య వెంకట్ తల్లిదండ్రులు పట్టా శ్రీదుర్గ, నరసింహమూర్తితో కలసి కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్ మహేష్ కుమార్‌కు ఆయన ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో అవినీతి రాజ్యమేలుతోందని, కొందరు అధికారులు అర్హులైన దివ్యాంగులను పక్కన పెట్టి, కాసులు చెల్లించిన వారికే సదరం సర్టిఫికెట్లలో అధిక పర్సంటేజీ నమోదు చేస్తున్నారని ఆరోపించారు. ఈ అవినీతిని అరికట్టాలని, నిజాయితీగా వైద్య పరీక్షలు చేసి, అర్హులైన దివ్యాంగులను అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు.


