అమలాపురం రూరల్: ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు చేస్తున్న ఉద్యమాలను అపహాస్యం చేస్తూ వీఆర్‌ఓల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భూపతిరాజు రవీంద్రరాజు విమర్శించడం దారుణమని ఏపీ రెవెన్యూ ఎంప్లాయీస్ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్, వీఆర్‌ఓల సంఘం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా గౌరవాధ్యక్షుడు మద్దాల బాపూజీ అన్నారు. అమలాపురంలోని జేఏసీ కార్యాలయంలో సోమవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎవరి ప్రయోజనాలు కోసం ఆ స్క్రిప్ట్ చదువుతున్నారో స్పష్టం చేయాలని భూపతిరాజును ప్రశ్నించారు. రెండున్నరేళ్ల కూటమి ప్రభుత్వ పాలనలో అనేక పోరాటాలు చేసి, గత్యంతరం లేని పరిస్థితుల్లో జూలై నెల నుంచి ఉద్యమం ఉధృతం చేయడానికి ఉపక్రమించారని చెప్పారు. ఈ నేపథ్యంలో మంత్రుల బృందం, 15 మంది ప్రధాన ఐఏఎస్ అధికారులతో ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించడం, త్వరలోనే ముఖ్యమంత్రితో చర్చిస్తామన్న విషయం తెలియనిదా అని నిలదీశారు. ఇచ్చిన హామీ మరచి రాష్ట్ర ఆదాయంలో 98 శాతం ఉద్యోగుల జీతాలకే సరిపోతోందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయడం.. ప్రజలకు, ఉద్యోగులకు మధ్య అగాధం సృష్టించేందుకేననే విషయం అర్థం కావడం లేదా అని బాపూజీ ప్రశ్నించారు. ఏ ప్రయోజనం కోసం బొప్పరాజును విమర్శిస్తున్నారో స్పష్టం చేయాలని కోరారు. ఎనిమిది లక్షల మంది ఉద్యోగులకు పీఆర్‌సీ అమలైతే వీఆర్‌ఓలకే కాదు.. మీకు కూడా నష్టం అనే విషయం మరిచారా అని ప్రశ్నించారు. గత జగన్ ప్రభుత్వంలోనే సచివాలయ ఉద్యోగుల చైర్మన్ వెంకటరామిరెడ్డితో అనేక జీఓలు సాధించుకున్నామని, ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఏ ఒక్క సమస్కా పరిష్కరించడం లేదని చెప్పారు. చంద్రబాబు అంటేనే ఉద్యోగులకు నష్టం చేసే వ్యక్తి అని, ఈ ప్రభుత్వం వేస్ట్ అని అనే సందర్భాలలో చేసిన విమర్శలను మరచిపోయారా అని భూపతిరాజును బాపూజీ నిలదీశారు.


