ద్వారకాతిరుమల: చేతికి వాచ్.. సెల్‌ఫోన్‌లో డిజిటల్ టైమ్.. గోడకు క్లాక్.. ఇలా క్షణాల్లో సమయాన్ని తెలుసుకునే ఆధునిక రోజుల్లో సూర్యుడి నీడను చూసి కాలాన్ని లెక్కించిన పద్ధతి ఊహకే ఆశ్చర్యం కలిగిస్తుంది. గడియారాలు అందుబాటులోకి రాక ముందు మనిషికి సూర్యుడే సమయ సూచిక. ఆ సూర్యుడి గమనాన్ని ఆధారంగా చేసుకుని రూపొందించిన పరికరమే సన్ డయల్ (సూర్య ఘడియారం). కాలాన్ని కొలవడమే కాకుండా అప్పటి మనిషి ఖగోళ, గణిత పరిజ్ఞానానికి ఇవి అద్దం పడుతున్నాయి.
చారిత్రక సాక్ష్యం
సన్ డయల్ ప్రస్తావన వచ్చినప్పుడు అన్నవరం వీరవెంకట సత్యనారాయణస్వామి దేవస్థానం ప్రత్యేకంగా నిలుస్తుంది. ఆలయ తూర్పు రాజగోపురం సమీపంలో సూర్య ఘడియారం ఉంది. ఈ సన్ డయల్‌ను 1943 జూలైలో పునర్నిర్మించారు. ద్వారకా తిరుమలలోని శ్రీవారి క్షేత్రంలో ఆధునిక సన్ డయల్ ఉంది. 2011 సెప్టెంబర్ 10న ఏర్పాటు చేసిన ఈ ఆధునిక సూర్యయంత్ర పథక నిర్వహణలో శ్రీవేద భారతి సంస్థాపకులు డాక్టర్ రేమెళ్ల అవధానులు కీలక పాత్ర పోషించారు.


