● మెరుగుపడని వర్జీనియా పొగాకు ధర
● రూ.300 దిగువనే నాణ్యమైన రకం
● గిట్టుబాటు కాక కౌలురైతుల ఆందోళన
● పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం
ఈ ఏడాది పొగాకు రైతులు నీరసించారు.. ధర పెరిగేది లేక దిగాలు చెందుతున్నారు.. కొనుగోళ్లు అంతంత మాత్రంగానే ఉండడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.. విక్రయాలు ప్రారంభించి 150 రోజులు దాటినా, మార్కెట్‌లో ధరలు పుంజుకోక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నారు.. ఆదుకోవాల్సిన ప్రభుత్వం తమకేమీ పట్టనట్టు వ్యవహరించడం, రైతులను మరింత కుంగదీస్తోంది.
దేవరపల్లి: పొగాకు మార్కెట్ మందగమనంలో ఉంది. వర్జీనియా పొగాకు కొనుగోళ్లు ప్రారంభమై దాదాపు 150 రోజులు దాటినా, ఆశించిన మేర ధర రాకుంది. కొనుగోళ్ల తీరును చూసి రైతుల ఆశలు సన్నగిల్లుతున్నాయి. వచ్చినకాడకు అమ్ముకుని చేసిన అప్పులు తీర్చుకుందామన్నా కొనుగోలు చేసే నాథుడు లేక నిరాశ చెందుతున్నారు. 2017–28 పంట సీజన్ ప్రారంభమై నారుమడులు పడుతుండగా, గత ఏడాది పండించిన పంటను ఇప్పటి వరకు కొనుగోలు చేయకపోవడంతో రైతులు అయోమయంలో పడ్డారు. వచ్చే ఏడాదికి పొగాకు పంట వేయాలా? వద్దా? అనే సందిగ్ధంతో ఉన్నారు. టొబాకో బోర్డు రాజమహేంద్రవరం రీజియన్ పరిధిలోని దేవరపల్లి, జంగారెడ్డిగూడెం–1, 2, కొయ్యలగూడెం, గోపాలపురం వేలం కేంద్రాల పరిధిలో 2025–26లో 85 మిలియన్ల కిలోల పొగాకు ఉత్పత్తి జరిగింది. ఇప్పటి వరకు కేవలం 20.56 మిలియన్ల కిలోల పొగాకు విక్రయాలు జరిగాయి. ఇంకా రైతుల వద్ద సుమారు 65 మిలియన్ల కిలోల కొనుగోలు చేయాల్సి ఉంది. రీజియన్ పరిధిలో 12,938 మంది రైతులు, 30,145 హెక్టార్లలో పొగాకు పంట సాగు చేశారు. టోబాకో బోర్డు 23,299 హెక్టార్లలో పంట సాగుకు అనుమతి ఇవ్వగా, అదనంగా సుమారు 7 వేల హెక్టార్లలో పంట సాగు చేశారు. 50.87 మిలియన్ల కిలోల ఉత్పత్తి చేయాల్సి ఉండగా, 85 మిలియన్ల కిలోల ఉత్పత్తి జరిగింది. ప్రంపంచ వ్యాప్తంగా ఈ ఏడాది పొగాకు ఉత్పత్తి గణనీయంగా పెరగడం, ఎగుమతి ఆర్డర్లు పూర్తి స్థాయిలో ఖరారు కాకపోవడంతో మార్కెట్ సంక్షోభంలో పడింది.
ఆశలు ఆవిరి
ఈ ఏడాది ఎన్నో ఆశలు పెట్టుకుని, అధిక ధరకు భూముల కౌలు, బ్యారన్ల అద్దెకు తీసుకుని చిన్న, సన్నకారు రైతులు పొగాకు సాగు చేశారు. కనీసం సెంటు కూడా సొంత భూమి లేనివారు 10 నుంచి 30 ఎకరాలు కౌలుకు తీసుకుని పంట వేశారు. ఎకరాకు సుమారు రూ.3 లక్షల పెట్టుబడి పెట్టారు. బ్యారన్ లైసెన్స్‌పై బ్యాంకులు బ్యారన్‌కు రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల వరకూ రుణాలు ఇచ్చాయి. ప్రస్తుతం మార్కెట్లో కిలోకు సగటున రూ.240 పలకడంతో బ్యాంకు అప్పులు కూడా తీరే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు. కిలోకు పెట్టుబడి రూ.300 కాగా, వచ్చే రాబడి రూ.240 ఉందని అంటున్నారు. కిలోకు రూ. 60 నుంచి రూ.70 నష్టం వస్తోందని ఆందోళన చెందుతున్నారు. దీంతో రైతుల ఇళ్లలోనే బేళ్లు ఉన్నాయి. ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉండడం వల్ల పొగాకు రంగు, నాణ్యత దెబ్బతింటున్నట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అనుమతి మేరకే సాగు చేయాలి
బోర్డు అనుమతించిన మేరకే పొగాకు సాగు చేయాలి. బ్యారన్‌కు రెండు ఎకరాల విస్తీర్ణంలో పంట వేసి, 20 క్వింటాళ్ల ఉత్పత్తి చేయాలి. సాగు విస్తీర్ణం తగ్గించి పొగాకు నాణ్యతపై రైతులు దృష్టిపెట్టాలి. 2026–27 పంట ప్రణాళిక ప్రకారం ఉత్పత్తి తగ్గించారు. పొగాకు నారుమడులు వేసే రైతులు, వ్యాపారులు తప్పనిసరిగా బోర్డులో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి.
–పి.హేమస్మిత, టొబాకో బోర్డు వేలం నిర్వహణాధికారి, దేవరపల్లి
అదనపు అమ్మకాలకు అనుమతి ఇవ్వాలి
బోర్డు ఇచ్చిన కోటా ప్రకారం బ్యారన్‌కు 35 క్వింటాళ్లు పొగాకు అమ్మకాలు పూర్తయిన రైతులకు అదనపు పంట అమ్ముకోవడానికి అనుమతి ఇవ్వాలి. వాతావరణం కలిసి రావడం వల్ల బ్యారన్‌కు అదనంగా 10 నుంచి 20 క్వింటాళ్ల ఉత్పత్తి జరిగింది. గ్రేడింగ్‌లు పూర్తయి 6 నెలలు గడవడంతో రంగు, నాణ్యత దెబ్బతింటుంది. అదనపు పంట అమ్ముకోవాడానికి అనుమతి ఇవ్వాలి.
–సుంకవల్లి శ్రీనివాస్, రైతు, సంగాయగూడెం, దేవరపల్లి మండలం
కుదించి.. కోత విధించి
2026–27 పంట కాలానికి పొగాకు ఉత్పత్తిలో పొగాకు బోర్డు కోత విధించింది. ఈ మేరకు సాగు ప్రణాళికను ఖరారు చేసింది. 2025–26 పంట కాలంలో రీజియన్ పరిధిలో 50.87 మిలియన్ల కిలోల ఉత్పత్తికి అనుమతి ఇవ్వగా, 85 మిలియన్ల కిలోలు ఉత్పత్తి జరిగింది. దీంతో వచ్చే ఏడాది 28.02 మిలియన్ల ఉత్పత్తికి బోర్డు అనుమతి ఇచ్చింది. దీని ప్రకారం బ్యారన్‌కు రెండు ఎకరాల్లో పంట వేసి, 20 క్వింటాళ్లు ఉత్పత్తి చేయాల్సి ఉంది. రాష్ట్రంలో 2025–26 పంట కాలంలో 143 మిలియన్ల కిలోల ఉత్పత్తికి అనుమతి ఇవ్వగా, 243 మిలియన్ల కిలోల ఉత్పత్తి జరిగింది. వచ్చే ఏడాది పంట పరిమాణాన్ని 81.02 మిలియన్ల కిలోలకు కుదించారు. దీనికి లోబడి పంట పండించాలని బోర్డు అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.


