దుమ్మెత్తిపోస్తున్నారు..! | - | Sakshi
Sakshi News home page

దుమ్మెత్తిపోస్తున్నారు..!

Aug 31 2026 12:14 AM | Updated on Aug 31 2026 12:14 AM

అమలాపురం టౌన్‌: అమలాపురంలో టీడీపీ జిల్లా కార్యాలయ భవనం నిర్మాణానికి మున్సిపాలిటీ వాటర్‌ వర్క్స్‌ (తాగునీటి విభాగం)కు చెందిన రెండెకరాల భూమిని కేటాయించే ప్రతిపాదనపై అన్ని వైపుల నుంచి నిరసనలు వ్యక్తమౌతున్నాయి. చివరకు టీడీపీ మిత్రపక్షమైన అమలాపురం నియోజకవర్గ జనసేన పార్టీ కూడా ఈ కేటాయింపుపై వ్యతిరేకత వ్యక్తం చేసింది. మున్సిపల్‌ మాజీ చైర్మన్‌, జనసేన పార్టీ నియోజకవర్గ నాయకుడు యాళ్ల సతీష్‌ ఈ కేటాయింపుపై బాహాటంగా అభ్యంతరం చెబుతున్నారు. కేటాయింపు విషయం తెలిసిన మరుక్షణమే సతీష్‌తో పాటు కొంతమంది జనసేన నాయకులు మున్సిపల్‌ కమిషనర్‌ వి.నిర్మల్‌కుమార్‌ను స్వయంగా కలిసి కేటాయింపుపై తమ అసంతృప్తిని, వ్యతిరేకతను తెలిపారు. మరో మిత్రపక్షమైన బీజేపీ నాయకులు కూడా అంతర్గతంగా భూమి కేటాయింపును వ్యతిరేకిస్తున్నారు. ఇక అధికార టీడీపీ నాయకులు మాత్రం ఈ విషయంలో మౌనం పాటిస్తూ స్థానిక ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు భూమి కేటాయింపుపై చేస్తున్న ప్రయత్నాలను సమర్థిస్తున్నారు. ఇక నియోజకవర్గ విపక్షాలు, ప్రజా సంఘాలు, నియోజకవర్గ ప్రజానీకం ఈ భూమి కేటాయింపు అంశంపై దుమ్మెత్తి పోస్తున్నాయి. భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా ఉన్న తాగునీటి రిజర్వాయరు భూములను ఇలా టీడీపీ లాక్కునే ప్రయత్నం చేయడంపై ధ్వజమెత్తుతున్నాయి.

ప్రభుత్వ శాఖల నుంచే అభ్యంతరాలు

స్టేట్‌ మున్సిపల్‌ కమిషనర్‌, డైరెక్టర్‌ ఆఫ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ (డీఎంఏ) శాఖ నుంచి గత జూలై 14న అమలాపురం మున్సిపాలిటీకి వచ్చిన అధికారిక ఉత్తర్వుల్లో రెండు ఎకరాల భూమిని కేటాయించాలని ఆదేశాలు వచ్చాయి. మున్సిపల్‌ అధికారులు దీనిపై అంతర్గతంగా చర్చించుకున్నారు. అధికార పార్టీ నుంచి వచ్చిన మౌఖిక ఆదేశాలు కాబట్టి భూమి కేటాయింపుపై మౌనం దాల్చారు. మున్సిపాలిటీ ప్రత్యేక అధికారి పాలనలో ఉండడంతో ప్రభుత్వం వారిదే కాబట్టి రెండు ఎకరాల భూమి కేటాయింపు ప్రక్రియకు సంబంధించి కౌన్సిల్‌ తీర్మానం (సీఆర్‌) అయిపోయింది. అయితే.. మున్సిపల్‌ కమిషనర్‌ ఈ భూయి కేటాయింపుపై నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ (ఎన్‌వోసీ) ఇవ్వలేదు. ఇక్కడి నుంచే స్థానిక రెవెన్యూ అధికారుల నుంచి అభ్యంతరాలు మొదలయ్యాయి. సాధారణంగా ఎలాంటి భూసేకరణ అయినా రెవెన్యూ అధికారుల నుంచి జరగాలి. స్థానిక సంస్థలకు చెందిన భూమి.. అందులోకీ భవిష్యత్‌ తాగునీటి అవసరాల కోసం సేకరించి ఉంచుకున్న భూమిని ఎలా కేటాయిస్తారని, ఇది పూర్తిగా నిబంధనలకు విరుద్ధమని రెవెన్యూ అధికారులు అంటున్నారు. గతంలో ఈ తాగునీటికి చెందిన భూమిలోని రెండు ఎకరాలను సస్పెన్షన్‌లో ఉన్న ఓ రెవెన్యూ అధికారి చేత అధికార దర్పంతో సర్వే చేయించడం గమనార్హం. అటు రెవెన్యూ అధికారులు, ఇటు మున్సిపల్‌ అధికారుల నుంచి ఈ కేటాయింపు నిబంధనలకు విరుద్ధమన్న చర్చ అయితే సాగుతోంది. ఓ పక్క అధికారుల నుంచి మరోపక్క విపక్షాలు, ప్రజా సంఘాలు, ప్రజానీకం నుంచి మున్సిపాలిటీ తాగునీటి అవసరాల కోసం ఉన్న రెండు ఎకరాల భూమి కేటాయింపుపై అభ్యంతరాలు వ్యక్తమవుతుంటే టీడీపీ అదే భూమి కావాలని పట్టుబట్టడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

టీడీపీ కార్యాలయం కోసం కేటాయించిన భూమి

ఇప్పటికే తాగునీటి కొరతతో ప్రజల అవస్థలు

అమలాపురం పట్టణంలో రోజుకు మున్సిపాలిటీ 55 లక్షల లీటర్ల తాగునీటిని అందిస్తున్నా ఇంకా 40 లక్షల లీటర్ల నీరు అందించాల్సిన లోటు స్పష్టంగా ఉంది. దీంతో పట్టణ ప్రజలు రోజూ తాగునీటి కొరతను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని శివారు ప్రాంతాలకు ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పట్టణంలో తాగునీటి రిజర్వాయర్లు, ట్యాంకులు, పైపులైన్లను విస్తరించాల్సి ఉంది. ఈ క్రమంలో వాటర్‌ వర్క్స్‌కు చెందిన రెండు ఎకరాల భూమిని టీడీపీ లాగేసుకునే ప్రయత్నం చేస్తుంటే దీనిపై ప్రజల నుంచే కాకుండా విపక్షాలు, ప్రజా సంఘాల నుంచి ఉద్యమాలు పుట్టక మానవు.

టీడీపీ కార్యాలయానికి వాటర్‌ వర్క్స్‌ భూమి కేటాయింపుపై తీవ్ర ఆగ్రహం

భూపందేరంపై అభ్యంతరాల వెల్లువ

ధ్వజమెత్తుతున్న విపక్షాలు, ప్రజా సంఘాలు

మిత్రపక్షం జనసేన నుంచీ

బాహాటంగా వ్యతిరేకత

నిబంధనలకు విరుద్ధమంటూ

రెవెన్యూ ఉద్యోగుల్లోనూ చర్చ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement