అన్ని పని దినాల్లో పీజీఆర్‌ఎస్‌ సేవలు : కలెక్టర్‌ | - | Sakshi
Sakshi News home page

అన్ని పని దినాల్లో పీజీఆర్‌ఎస్‌ సేవలు : కలెక్టర్‌

Aug 31 2026 12:14 AM | Updated on Aug 31 2026 12:14 AM

అమలాపురం రూరల్‌: స్వర్ణ గ్రామం–స్వర్ణ వార్డు కార్యాలయాల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్‌ఎస్‌) సేవలను అన్ని పని దినాల్లో తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. పీజీఆర్‌ఎస్‌ వేళలు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉండాలని చెప్పారు. ప్రజలు తమ సమస్యలు, ఫిర్యాదులతో సచివాలయాలకు వచ్చినప్పుడు సంబంధిత అధికారులు అందుబాటులో ఉండి, వారి ఫిర్యాదులను స్వీకరించి సకాలంలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా వ్యవసాయ సహాయకులు, సర్వే, రెవెన్యూ, పశు సంవర్థక శాఖ, ఇంజినీరింగ్‌ సహాయకులు తదితర సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. ఇతర అధికారిక విధులకు డెప్యుటేషన్‌పై వెళ్లిన సిబ్బందికి ఈ ఆదేశాలు వర్తించవని తెలిపారు. అన్ని శాఖల అధికారులు ఈ ఆదేశాలను కచ్చితంగా అమలు చేసి, పీజీఆర్‌ఎస్‌ సేవలు ఎటువంటి అంతరాయం లేకుండా అందుబాటులో ఉండేలా పర్యవేక్షించాలని ఆదేశించారు.

నేడు యఽథావిధిగా పీజీఅర్‌ఎస్‌

అమలాపురం రూరల్‌ : జిల్లా స్థాయి పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమాన్ని సోమవారం యఽథావిధిగా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌ కుమార్‌ ఆదివారం తెలిపారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి అమలాపురం కలెక్టరేట్‌ గోదావరి భవన్‌లో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. ప్రజలు తమ అర్జీలను వెబ్‌సైట్‌ ద్వారా అన్‌లైన్‌లోనూ నమోదు చేసుకోవచ్చని చెప్పారు. తహసీల్దార్‌, ఎంపీడీఓ కార్యాలయాల్లోనూ పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమం జరుగుతుందన్నారు.

కాపు విద్యార్థులకు

స్కాలర్‌షిప్‌ల పంపిణీ

అమలాపురం టౌన్‌: కోనసీమ కాపు ఉద్యోగ సేవా సమితి ఆధ్వర్యంలో నిరుపేద విద్యార్థులకు అందిస్తున్న ఆర్ధిక సాయం ప్రశంసనీయమని కాకినాడ జిల్లా ఎకై ్సజ్‌ డిప్యూటీ కమిషనర్‌ ఏనుగుల చైతన్య మురళి, జిల్లా వ్యవసాయ అధికారి మాధవవరపు వెంకట రామారావు అన్నారు. కోనసీమ కాపు ఉద్యోగ సేవ సమితి ఆధ్వర్యంలో ఆర్థికంగా వెనుకబడిన కాపు విద్యార్థులకు ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమం అమలాపురం చెన్నమల్లేశ్వర కళాపరిషత్‌ వేదిక వద్ద అదివారం నిర్వహించారు. కోనసీమ కాపు ఉద్యోగ సేవా సమితి అధ్యక్షుడు నల్లా రామకష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో 10వ తరగతి, ఇంటర్‌, డిగ్రీ స్థాయిల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 120 మంది కాపు విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.5,000 చొప్పున రూ.6 లక్షలు ఆర్థిక ప్రోత్సాహకాన్ని అముడా చైర్మన్‌ అల్లాడ స్వామి నాయుడు, కోనసీమ షటిల్‌ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు మెట్ల రమణబాబు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి వంటెద్దు వెంకన్నాయుడు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్‌కుమార్‌, రాష్ట్ర మత్స్యశాఖ డైరెక్టర్‌ దేశంశెట్టి లక్ష్మీనారాయణ, ఇరిగేషన్‌ డైరెక్టర్‌ శిరిగినేడి వెంకటేశ్వరరావు, సాంస్కృతిక, హస్తకళల డైరెక్టర్‌ ఆర్‌డీఎస్‌ ప్రసాద్‌, ఏపీడబ్ల్యూజే, వెంకటేశ్వర దేవస్ధానం చైర్మన్‌ కంచిపల్లి అబ్బులు, కోనసీమ జిల్లా అధ్యక్షుడు ఎంఎన్‌వీ ప్రసాద్‌ చేతుల మీదుగా అందజేశారు.

రత్నగిరిపై జోరుగా వివాహాలు

అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి ఆలయ ప్రాంగణంలో ఆదివారం కూడా పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. రత్నగిరిపై సాధారణంగా రాత్రి, తెల్లవారుజామున ముహూర్తాల్లోనే వివాహాలు జరుగుతాయి. ఆదివారం మాత్రం ఉదయం 11 గంటల ముహూర్తంలో వివాహాలు జరగడంతో అందరూ ఆసక్తితో తిలకించారు. రత్నగిరి రామాలయం వద్ద గల విశ్రాంతి షెడ్డులో పెద్ద సంఖ్యలో వివాహాలు జరగడం విశేషం. శ్రావణ మాసం సెప్టెంబర్‌ 11వ తేదీ వరకు ఉండగా, వివాహ ముహూర్తాలు మాత్రం ఆరో తేదీ వరకు మాత్రమే ఉన్నాయి. సెప్టెంబర్‌ 12 నుంచి భాద్రపద మాసం ప్రారంభమవుతోంది. ఆ మాసంలో వివాహాది శుభకార్యాలు జరగవు. అక్టోబర్‌ 11వ తేదీ నుంచి ఆశ్వయుజ మాసం ప్రారంబం కానుండటంతో మరలా వివాహాలు జరుగుతాయి.

పోటెత్తిన భక్తులు

సత్యదేవుని ఆలయానికి ఆదివారం కూడా భక్తులు పోటెత్తారు. రత్నగిరి సత్యదేవుని సన్నిధిన, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వివాహాలు చేసుకున్న నవ దంపతులు, వారి బంధుమిత్రులతో పాటు సత్యదేవుని ఆలయానికి విచ్చేసిన భక్తులు స్వామివారి వ్రతాలాచరించి సత్యదేవుని దర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement