రామచంద్రపురం రూరల్: ’మెగా డీఎస్సీలో జరిగిన అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యా శాఖ మంత్రి లోకేశ్ రాజీనామా చేసే వరకు వైఎస్సార్ సీపీ విశ్రమించదని, అప్పటి వరకు ఉద్యమం చేస్తూనే ఉంటోంది’ అని వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు, రామచంద్రపురం కో ఆర్డినేటర్ పిల్లి సూర్యప్రకాశ్ ప్రకటించారు. పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ఈనెల ఈ నెల 6 నుంచి 10వ తేదీ వరకు రిలే నిరాహార దీక్షలు, 10న భారీ ర్యాలీలో యువత, విద్యార్ధులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. పార్టీ యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు మాదిరెడ్డి పృథ్వీరాజ్ ఆధ్వర్యంలో హసన్‌బాద్‌లో సోమవారం టౌన్‌హాల్ సమావేశాన్ని నిర్వహించారు. ప్రకాశ్ మాట్లాడుతూ మెగా డీఎస్సీ పేరుతో ఉపాధ్యాయ నియామకాల్లో జరిగిన అక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో యువకులు, విద్యార్థులు, పార్టీ యువజన విభాగం ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
సీబీఐ విచారణ చేపట్టాలి:
కోఆర్డినేటర్ గన్నవరపు
డీఎస్సీ అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని, అభ్యర్థులకు న్యాయం చేయాలని పి.గన్నవరం నియోజకవర్గ వైఎస్సార్ సీపీ కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. అయినవిల్లి మండలంలోని తొత్తరమూడిలో వీవర్స్ కమ్యూనిటీ హాల్లో సమావేశం పార్టీ మండల శాఖ అధ్యక్షుడు మేడిశెట్టి శ్రీనివాస్‌బాబు అధ్యక్షతన నిర్వహించారు. శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించి, అభ్యర్థులకు న్యాయం చేయాలని, అక్రమాలకు కారకుడైన విద్యా శాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని, నిరుద్యోగ భృతి వెంటనే ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పార్టీ నియోజకవర్గ పరిశీలకుడు చింతలపాటి శ్రీనివాసరాజు, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు శిరీష్ నారాయణస్వామి, అంబాజీపేట ఎంపీపీ, జెడ్పీటీసీ సభ్యులు డి.వెంకటేశ్వరరావు, బి.వరలక్ష్మి, పార్టీ నాయకులు ఎం.కిరణ్‌కుమార్, కె.విద్యాసాగర్, ఎం.శ్రీనివాస్, జె.వాసు, టి.గోపాలకృష్ణ పాల్గొన్నారు.


