శాంతిస్తున్నది | - | Sakshi
Sakshi News home page

శాంతిస్తున్నది

Aug 4 2026 12:11 AM | Updated on Aug 4 2026 12:11 AM

సాక్షి, అమలాపురం: వరద గోదావరి నెమ్మదిగా శాంతిస్తోంది. జిల్లాలో ఆదివారం రాత్రి వరకు పెరిగిన వరద ముంపు... ఆ తరువాత నుంచి వేగంగా తగ్గుముఖం పడుతోంది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గడంతో ధవళేశ్వరం బ్యారేజీకి వరద ఇన్‌ఫ్లో తగ్గింది. బ్యారేజీ వద్ద నుంచి సోమవారం సాయంత్రం ఐదు గంటల సమయానికి 9,96,402 క్యూసెక్కుల వరదను దిగువకు విడుదల చేశారు. ఈ ప్రభావం కోనసీమపై కూడా కనిపిస్తోంది. వరద ముంపునకు గురైన లంక గ్రామాలు తేరుకుంటున్నాయి.

ఇళ్లను శుభ్రం చేసుకుంటున్న ప్రజలు

గత రెండు రోజులుగా మునిగిన దిగువ కోనసీమ మత్స్యకార కాలనీల్లో నుంచి నెమ్మదిగా నీరు వీడుతోంది. ఇళ్లలోకి చేరిన నీరు తగ్గడంతో ప్రజలు ఇళ్లను శుభ్రం చేసుకుంటున్నారు. వరద తగ్గడంతో ముంపునకు గురైన గ్రామీణ రోడ్లు, లంక రహదారులు నెమ్మదిగా బయటకు వస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితులను బట్టి మంగళవారానికి గోదావరి నది పూర్తిగా సాధారణ స్థాయికి చేరుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. పి.గన్నవరం మండలం కె.ఏనుగుపల్లి వెళ్లే రోడ్డు మీద వరద వీడింది.

కాజ్‌వేలను వీడని వరద

కనకాయలంక కాజ్‌వే మీద మంగళవారం సాయంత్రం నుంచి రాకపోకలు సాగే అవకాశం ఉంది. మానేపల్లి శివారు శివాయిలంకకు స్థానికులు ఇంకా ట్రాక్టర్‌ మీదే రాకపోకలు సాగిస్తున్నారు. ఊడిమూడిలంక ఏటిగట్టు మీదే సంచార జాతుల వారు కాలం వెళ్లదీస్తున్నారు. మామిడికుదురు మండలం అప్పనపల్లి కాజ్‌వే వరద నీటిలోనే ఉంది. కొర్లగుంట నుంచి మొల్లేటివారిపాలెం వెళ్లే సీసీ రోడ్డు మీద రెండు చోట్ల వరద నీటిలో రాకపోకలు సాగిస్తున్నారు. అప్పనపల్లి, పెదపట్నంలంక, బి.దొడ్డవరం గ్రామాలకు ఆటోలు, మోటారు సైకిళ్లు మాత్రమే వెళుతున్నాయి. ముమ్మిడివరం మండలం లంకాఫ్‌ ఠాణేల్లంక మత్స్యకార కాలనీతో పాటు గురజాపులంక, కమిని, కె.గంగవరం మండలం కోటిపల్లి, కాట్రేనికోన మండలం పల్లంకుర్రు రేవు, సఖినేటిపల్లి మండలం రామరాజులంక వద్ద వరద ముంపు నెమ్మదిగా తగ్గుతోంది. అయితే ఆయా లంక గ్రామాలకు చెందిన పశువులు, గొర్రెలు ఇంకా ఏటిగట్ల మీదే ఉన్నాయి.

అప్పనపల్లి కాజ్‌వే రోడ్డును వీడని వరద ముంపు

జిల్లాలో వరద తగ్గుముఖం

మత్స్యకార కాలనీల నుంచి వీడుతున్న వరద

ముంపు నుంచి బయటపడుతున్న రోడ్లు

నేటి నుంచి సాధారణ పరిస్థితులు

కూరగాయ పంటలకు నష్టం

ఉద్యాన పంటలకు నష్టం

కోనసీమలోని అనేక గ్రామాల్లో వేసిన కూరగాయ పంటలు నీట మునిగాయి. టమాటా, బెండ, కాకర, సొరకాయ వంటి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రధానంగా పి.గన్నవరం, ముమ్మిడివరం, అయినవిల్లి, ఐ.పోలవరం, మామిడికుదురు, మలికిపురం, కె.గంగవరం మండలాల్లో వరదలకు లోతట్టు ప్రాంతాల్లోని లంక గ్రామాల్లో కూరగాయ పంటలు మునిగిపోయాయి. ఉద్యాన శాఖ అధికారులు ముంపులో ఉన్న పంట మీద ప్రాథమిక అంచనాలు రూపొందిస్తున్నారు. వరద నీరు మొత్తం వీడిన వారం రోజుల్లోపు పూర్తి నష్టం అంచనాలు రూపొందిస్తామని అధికారులు చెబుతున్నారు. ఐ.పోలవరం మండలంలో సుమారు 300 ఎకరాల వరి చేలు నీట మునిగాయి. జిల్లా వ్యాప్తంగా ఐ.పోలవరం, కాట్రేనికోన, అల్లవరం, మామిడికుదురు తదితర మండలాల్లో ఏటిగట్టు దిగువన ఉన్న ఆక్వా చెరువులు నీట మునిగాయి. వరద వీడితే కాని నష్టం అంచనా వేయలేమని మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement