అమలాపురం రూరల్: విద్యుత్ బస్సులను నేరుగా ఆర్టీసీ సంస్థ ద్వారానే నిర్వహించాలని కోరుతూ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని ఆర్టీసీ ఉద్యోగులు సంతకాలతో కూడిన విజ్ఞాపన పత్రాన్ని కలెక్టర్ మహేష్‌కుమార్‌కు జిల్లా జేఏసీ నాయకులు సోమవారం అందించారు. విద్యుత్ బస్సుల పాలసీ పేరుతో ఆర్టీసీని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టాలని చూస్తున్న ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ రాష్ట్ర జేఏసీ పిలుపులో భాగంగా జిల్లాలో అమలాపురం, రాజోలు, రావులపాలెం, రామచంద్రాపురం డిపోలకు చెందిన కార్మికులందరి సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని జిల్లా ఆర్టీసీ జేఏసీ నాయకులు నేషనల్ మజ్దూర్ యూనియన్ జిల్లా కార్యదర్శి పందిరి రాంబాబు, ఎంప్లాయీస్ యూనియన్ జోనల్ కార్యదర్శి కేవీవీఎస్ నారాయణ, యునైటెడ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.రంగప్రసాద్ కలెక్టర్ అందించారు. వారు మాట్లాడుతూ విద్యుత్ బస్సుల పాలసీ పేరుతో ఆర్టీసీ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు లీజుకు ఇవ్వడం మానుకోవాలని, పినాకిల్ సంస్థ కొరకు రాష్ట్రంలో మూసివేసిన విద్యాధరపురం, నెల్లూరు–2, మంగళం డిపోలను వెంటనే తెరవాలని కోరారు. జిల్లాలోని నాలుగు డిపోల అన్ని యూనియన్ల అధ్యక్ష, కార్యదర్శులు పి.మణిరాజు, జంగా నాగేశ్వరరావు, పీవీ రమణ, ఎస్.శ్రీనివాస్, జి.ప్రసాదరావు, డి.మల్లికార్జునరావు, నారాయణ, నాయుడు తదితరులు పాల్గొన్నారు.
రైస్ కౌంటర్ల ఏర్పాటు
అమలాపురం టౌన్: జిల్లాలోని రైతు బజార్లు, అన్ని తహసీల్దార్ కార్యాలయాల వద్ద ప్రత్యేక బియ్యం విక్రయ కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ అన్నారు. స్థానిక రైతు బజార్‌లో ప్రత్యేక బియ్యం విక్రయ కౌంటర్‌ను ఆయన సోమవారం ప్రారంభించి ప్రసంగించారు. ఈ కౌంటర్ల ద్వారా విక్రయించే సన్న బియ్యాన్ని మార్కెట్‌లో ప్రసుత్తం ఉన్న ధరలతో పోల్చితే రూ.10 వరకూ ధర తగ్గింపుతో లభిస్తుందని కలెక్టర్ వివరించారు. జిల్లా పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ వైఖోమ్ నైదియా దేవి, స్థానిక ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, అముడా చైర్మన్ అల్లాడ స్వామినాయుడు, అమలాపురం ఆర్డీవో సరళావతి, జిల్లా పౌర సరఫరాల అధికారి ఎం.బాలసరస్వతి, జిల్లా మార్కెటింగ్ శాఖ ఏడీ కె.విశాలాక్షి, తహసీల్దార్ వీఎస్ దివాకర్, ఏఎస్‌వో ఆర్.శరత్, రైతు బజార్ సిబ్బంది, వినియోగదారులు పాల్గొన్నారు.
పీజీఆర్‌ఎస్‌లో
351 అర్జీల స్వీకరణ
అమలాపురం రూరల్: దూర ప్రాంతాల నుంచి వ్యయ ప్రయాసలతో కూడి వచ్చిన అర్జీదారుల అర్జీలను పూర్తి పారదర్శకంగా నాణ్యత ప్రమాణాలతో పరిష్కార మార్గాలు చూపాలని జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ తెలిపారు. సోమ వారం గోదావరి కలెక్టరేట్ భవనంలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌కు 351 ప్రజా వినతులు రాగా వాటిని స్వీకరించారు. అమలాపురం పట్టణంలో సూర్య నగర్ దుర్గా స్ట్రీట్ ఎంఎన్ మూర్తి నీటి సమస్యపై, అయినవిల్లి మండలం జగన్నాథపు రం పిచ్చుక జ్యోతిక తమ తల్లి మానసిక దివ్యాంగురాలని పింఛన్ ఇప్పించమని, ఐ.పోలవరం మండలం టి.కొత్తపల్లి అర్జీదారుడు వి.సత్యనారాయణ తన ఇంటి ముందు కమ్యూనిటీ భవనం నిర్మిస్తారని, ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి రహదారి రాకపోకలకు లేకుండా కమ్యూనిటీ భవ నం నిర్మించడం సరికాదని జాయింట్ కలెక్టర్ వై ఖోం నైదియాదేవికి తమ సమస్యను విన్నవించా రు. ఈ సమస్యలపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్‌వో వి.సుబ్బారావు, డిప్యూటీ కలెక్టర్ డి.అచ్యుత కు మారి, డీఆర్‌డీఏ పీడీ రాంబాబు సమగ్రశిక్ష పీడీ జి.మమ్మీ, డ్వామా పీడీ రామగోపాల్, జీఎస్‌డబ్ల్యూఎస్ అధికారి విజయలకి్‌ష్మ్, డీఎల్‌డీవో పి. విజయ భాస్కర్, కలెక్టరేట్ అధికారులు పాల్గొన్నారు.
పోలీస్ గ్రీవెన్స్‌కు 31 అర్జీలు
అమలాపురం టౌన్: స్థానిక జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 31 అర్జీలు వచ్చాయి. జిల్లా ఏఎస్పీ మహేంద్ర మత్తే నిర్వహించిన ఈ పోలీస్ గ్రీవెన్స్‌కు జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి అర్జీదారులు తమ సమస్యలతో ఎస్పీ కార్యాలయానికి వచ్చి ఏఎస్పీకి ఫిర్యాదు పత్రాలు అందించారు. తీసుకున్న ఫిర్యాదులను తక్షణమే ఆయా పోలీస్ స్టేషన్లకు పంపించారు. గ్రీవెన్స్‌కు వచ్చిన ఫిర్యాదులపై క్షేత్ర స్థాయిలో నిష్పక్షపాతంగా విచారించి బాధితులకు న్యాయం చేయాలని ఏఎస్పీ మహేంద్ర జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలను ఆదేశించారు. వచ్చిన అర్జీల్లో ఎక్కువగా ఆస్తి తగాదాలు, కుటుంబ వివాదాలకు సంబంధించినవే ఉండడంతో ఆ అర్జీదారులకు ఏఎస్పీ కౌన్సెలింగ్ చేసి వారి సమస్యల పరిష్కారానికి ప్రయత్నించారు.


