నేను ఉపాధి నిమిత్తం ఇజ్రాయిల్‌లో ఉంటున్నాను. ఇరాన్ మీద దాడి.. ఇరాన్ ప్రతి దాడి వల్ల ఇక్కడ పరిస్థితి భయంకరంగా ఉంది. ఎప్పుడు ఎటువైపు నుంచి ఏ మిస్సైల్ వచ్చి పడుతోందని నాతో పాటు తెలుగువారు భయపడుతున్నారు. యుద్ధం ముగింపు ప్రకటన వచ్చే వరకూ మాకు నిద్ర పట్టదు.
– ఉండ్రు కృష్ణ, విశ్వేశ్వరాయపురం,
మలికిపురం మండలం
క్షిపణిలు దూసుకొస్తున్నాయి
ఖతార్‌లోకి గడిచిన రెండు రోజులుగా క్షిపణులు దూసుకొస్తున్నాయి. పలుచోట్ల పేలుళ్లు సంభవిస్తున్నాయి. అమెరికా బేస్ మీదనే కాకుండా నివాస ప్రాంతాలపై కూడా దాడులు జరుగుతున్నాయి. గ్లోబల్ ఎన్‌ఆర్‌ఐ కన్వీనర్ సాంబ శివారెడ్డి తెలుగువారి యోగక్షేమాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు.
– దొండపాటి శశికిరణ్,
వైఎస్సార్ సీపీ గల్ఫ్ విభాగం కో కన్వీనర్
బిక్కుబిక్కుమంటూ ఉంటున్నాం
మేము ఉండే కువైట్‌లో నిత్యం సైర న్ మోతలు వినిపిస్తున్నాయి. అప్పు డప్పుడూ బాంబు పేలుళ్లతో ఇక్కడ భయం.. భయంగా ఉన్నాం. ఆరుబయట నిద్రించవద్దని, ఇళ్లపై భాగానికి వెళ్లవద్దని ఇక్కడ అధికారులు, మా యజమానులు హెచ్చరిస్తున్నారు. సైరన్ మోత మోగుతుంటే అందరూ బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నాం.
– మంద గౌరీ, పాశర్లపూడిలంక,
మామిడికుదురు మండలం
దాడుల ఉధృతి పెరిగింది
మేము ఉండే ఇజ్రాయిల్‌పై సోమవారం తెల్లవారు జాము నుంచి దాడుల ఉధృతి పెరిగింది. పెద్ద ఎత్తున క్షిపణులు వచ్చిపడుతున్నాయి. జనం నివాసముంటే ఇళ్లపై కూడా దాడులు జరుగుతున్నాయి. భయానకంగా ఉంది. చుట్టూ ఒకరకమైన ఆందోళన వాతావరణం ఉంటోంది.
– శెట్టిబత్తుల అజయ్‌కుమార్,
అప్పనపల్లి, మామిడికుదురు మండలం
ఆందోళనతో ఉన్నాం
నా భార్య లక్ష్మి ఇజ్రాయిల్‌లో ఉంది. రెండేళ్లుగా ఓ ఇంట్లో రోగిని చూసుకునే కేర్ టేకర్‌గా పనిచేస్తోంది. యుద్ధం వల్ల మేము ఆందోళనతో ఉన్నాం. ఆమె నాతో మాట్లాడింది. ఇరాన్ మిసైల్స్ వస్తున్నప్పుడు సైరన్ మోగిస్తున్నారని, వెంటనే అందరూ ఇళ్లలో ఉండే బంకర్లలోకి వెళ్లిపోతున్నామని చెప్పింది. అధికారులు చెప్పిన తరువాత కాని బంకర్ల నుంచి బయటకు రావడం లేదు. – బుంగ సువర్ణరాజు,
అంతర్వేది, సఖినేటిపల్లి మండలం


