‘సాక్షి’ స్పెల్ బీ విజేతగా అక్బర్
అమలాపురం టౌన్: ‘సాక్షి’ దినపత్రిక రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన స్పెల్ బీ –2026 పరీక్షల్లో అమలాపురం గొల్లగూడెం ఆదిత్య స్కూల్ పదో తరగతి విద్యార్థి షా అక్బర్ రాష్ట్ర స్థాయిలో 3వ స్థానాన్ని సాధించి రూ.3 వేల నగదు బహుమతిని గెలుచుకున్నాడు. ఈ విషయాన్ని ఆ స్కూల్ ప్రిన్సిపాల్ కుంపట్ల లక్ష్మీదేవి గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పరీక్షల్లో అక్బర్ ఫైనల్ రౌండ్‌లో విజేతగా నిలిచాడన్నారు. విద్యార్థి అక్బర్ ఈ నెల 23న హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని రవి నారాయణరెడ్డి ఆడిటోరియంలో ఈ నగదు బహుమతిని తీసుకున్నాడు. అతన్ని ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి, డైరెక్టర్ శృతిరెడ్డి తదితరులు అభినందించారు.
పంచాయతీ
కార్యదర్శి సస్పెన్షన్
దేవరపల్లి: పంచాయతీ సాధారణ నిధుల నిర్వహణ, పారిశుధ్య పనుల్లో అలసత్వంగా వ్యవహరించినందుకు దేవరపల్లి పంచాయతీ కార్యదర్శి ఎన్.రవికిషోర్‌ను సస్పెన్షన్ చేస్తూ జిల్లా పంచాయతీ అధికారి వి.శాంతామణి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు స్థానిక మండల పరిషత్ కార్యాలయానికి చేరాయని ఎంపీడీఓ నాగార్జునరావు తెలిపారు. పంచాయతీ సాధారణ నిధులు రూ. 68.79 లక్షలకు సంబంధించిన వివరాలు నగదు పుస్తకంలో నమోదు కాకపోవడం, విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సుమారు 20 రోజుల నుంచి కార్యదర్శి రవికిషోర్ సెలవులో ఉండడంతో ఇటీవల డిప్యూటీ ఎంపీడీఓ వై.రాజారావుకు కార్యదర్శి బాధ్యతలను అప్పగిస్తూ జిల్లా పంచాయతీ అధికారి ఉత్తర్వులు జారీ చేశారు.
కాలిన గాయాలతో వ్యక్తి మృతి
రాజానగరం: కాలిన గాయాలతో ఓ వ్యక్తి మృతి చెందాడు. రాజానగరంలోని ఎస్‌బీఐ వద్ద గురువారం తెల్లవారుజామున సిరిమల్ల బుల్లబ్బాయి (48) శరీరమంతా కాలిపోయి, కొన ఊపిరితో ఉండగా, అతనిని తమ్ముడి కొడుకు ఆదిమూర్తి గుర్తించారు. 108 అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుల్లబ్బాయి కొద్ది సమయంలోనే మృతి చెందాడు. కాగా బుధవారం రాత్రి చలి మంట వేసుకుని కాగుతూ ప్రమాదవశాత్తూ ఒంటిపై ఉన్న దుస్తులకు మంట అంటుకోవడంతో బుల్లబ్బాయి శరీరం కాలిపోవడానికి కారణంగా సంఘటన జరిగిన ప్రాంతంలో చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాల తెలుస్తుందని సీఐ వీరయ్యగౌడ్ తెలిపారు. వివాహమైన కొన్నేళ్లకే భార్య విడిపోవడంతో బుల్లబ్బాయి రాజానగరంలో ఒంటరిగా ఉంటున్నాడు. మృతుడి సోదరుడు ఏసు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
108 అంబులెన్స్‌లో ప్రసవం
చింతూరు, ఎటపాక: ప్రసవం సంక్లిష్టంగా మారిన ఓ మహిళను భద్రాచలం తరలిస్తున్న క్రమంలో 108 సిబ్బంది చొరవతో కాన్పు జరిగిన సంఘటన గురువారం నెల్లిపాక వద్ద చోటుచేసుకుంది. చౌలూరుకు చెందిన గర్భిణి పొడియం అనుకు పురిటి నొప్పులు రావడంతో భర్త కన్నారావు చింతూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు. పరీక్షించిన వైద్యులు ఆమెకు ఏడో నెల మాత్రమే కావడంతో పాటు అధిక రక్తస్రావంతో కాన్పు కష్టంగా ఉందని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. దీంతో అనును 108లో భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా, నెల్లిపాక వద్ద నొప్పులు అధికమయ్యాయి. దీంతో ఈఎంటీ ప్రతాప్ ఆశావర్కర్ సుబ్బమ్మ సాయంతో 108లోనే కాన్పు చేయడంతో అను ఆడబిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డ బరువు తక్కువగా ఉండడంతో ఆసుపత్రికి తరలించి చిన్నపిల్లల వార్డులో చికిత్స అందిస్తున్నారు.
‘సాక్షి’ స్పెల్ బీ విజేతగా అక్బర్
‘సాక్షి’ స్పెల్ బీ విజేతగా అక్బర్


