అంగరంగ వైభవం.. ఆదిత్యుని కల్యాణం
పెదపూడి: ఆదిత్యుని కల్యాణం.. అంగరంగ వైభవంగా జరిగింది.. జి.మామిడాడ ఆధ్యాత్మిక చింతనతో మురిసిపోయింది.. దేశంలోనే ఏకై క వైష్ణవ సూర్య దేవాలయంగా జి.మామిడాడ గ్రామంలోని సూర్యదేవాలయం ప్రసిద్ధి గాంచింది. భీష్మ ఏకాదశి సందర్భంగా రాత్రి ఉష, ఛాయ, పద్మిని, సౌంజ్ఞ సమేత సూర్యనారాయణమూర్తి స్వామివారి కల్యాణం ఘనంగా జరిగింది. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త, ట్రస్ట్ బోర్డు చైర్మన్ కొవ్వూరి శ్రీనివాసా బాలకృష్ణారెడ్డి దేవదాయ శాఖ తరఫున స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పించారు. ఆలయ ప్రధాన ఆర్చకుడు రేజేటి వెంకటనరసింహాచార్యులు ఆధ్వర్యంలో 15 మంది పండితులు వైష్ణవ సంప్రదాయం ప్రకారం స్వామివారి కల్యాణం నిర్వహించారు. రాత్రి 8.30 గంటలకు కల్యాణం రమణీయంగా జరిగింది. ఆలయ ఈఓ పాటి సత్యనారాయణ, ఉత్సవ కమిటీ ప్రతినిధుల పర్యవేక్షణలో ఏర్పాట్లు చేశారు. తెల్లవారు జామున 3.30 గంటల నుంచే స్వామివారిని మేల్కోలిపి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఉదయం 11.30 గంటలకు ఆలయంలోని ఉత్సవ మూర్తులను ఆలయం బయట ఉన్న రథం వద్దకు పల్లకిలో తీసుకొచ్చారు. అనంతరం ఉత్సవ మూర్తులను రథంలో ఆశీనులు గావించారు. తర్వాత రథోత్సవాన్ని ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త, ట్రస్ట్‌బోర్డు చైర్మన్ కొవ్వూరి శ్రీనివాసా బాలకృష్ణారెడ్డి, ఉత్సవ కమిటీ ప్రతినిధులు ప్రారంభించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా స్థానిక ఎస్సై ఎస్.తులసీరామ్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
అంగరంగ వైభవం.. ఆదిత్యుని కల్యాణం


