ఆస్పత్రి వద్ద మృతుడి బంధువుల ఆందోళన
అమలాపురం టౌన్: ఓ వ్యక్తి మృతికి అమలాపురం పట్టణం సమీపం వై.జంక్షన్‌లోని ఓ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ పలువురు గురువారం ఆందోళన చేపట్టారు. ఆ వివరాల్లోకి వెళ్తే.. అమలాపురం రూరల్ మండలం ఇందుపల్లికి చెందిన ముద్రగడ అప్పారావు (47) బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. అతనికి వై.జంక్షన్ వద్ద ఆస్పత్రిలో వైద్యులు వైద్యం చేసి అదేరోజు పంపించేశారు. అయితే ఉదయానికి అప్పారావు మృతి చెందాడు. ఆ మృతదేహాన్ని ఆస్పత్రి వద్దకు తీసుకుని వచ్చి మృతుని కుటుంబీకులు, బంధువులు బైఠాయించారు. వైద్యల నిర్లక్ష్యం వల్లే అప్పారావు మృతి చెందాడని ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా మృతుని బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆస్పత్రిలో ఫర్నీచర్‌ను స్వల్పంగా ధ్వంసం చేశారు. చివరకు పట్టణ ఎస్సై కిషోర్‌బాబు వచ్చి పరిస్థితిని చక్కదిద్దారు. అప్పారావు రోడ్డు ప్రమాదానికి గురై ఆస్పత్రికి వచ్చినప్పుడు వైద్యులు చికిత్స చేసి పంపించేశారని ఎస్సై చెప్పారు. మర్నాడు అప్పారావుకు హార్ట్ ఎటాక్ రావడంతో మృతి చెందాడని తెలిపారు. అటు ఆస్పత్రి వర్గాలు గాని, ఇటు ఆందోళనకారులు గాని తమకు ఎలాంటి ఫిర్యాదులు ఇవ్వలేదని ఎస్సై వివరించారు.


