కదలివచ్చిన జనార్దన రథ చక్రాలు
ధవళేశ్వరం: భీష్మ ఏకాదశి పర్వదినం సందర్భంగా ధవళేశ్వరం గ్రామంలో రథోత్సవం చూసిన కనులదే భాగ్యం అన్నట్లు సాగింది. నవ జనార్దనుల్లో ప్రథముడైన ధవళగిరి శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ జనార్దనస్వామివారి రథోత్సవం, కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఉదయం రథ సంప్రోక్షణ, మధ్యాహ్నం 3.45 గంటలకు రథోత్సవం, అనంతరం ధ్వజారోహణ, అంకురార్పణ, వాస్తుపూజ, రాత్రి స్వామివారి కల్యాణం వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే వేలాది మంది భక్తులు స్థానిక రామపాద క్షేత్రంలో పుణ్యస్నానాలు ఆచరించి జనార్దన స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. స్వామివారి రథాన్ని లాగేందుకు భక్తులు పోటీ పడ్డారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డీఎస్పీ భవ్య కిషోర్ ఆధ్వర్యంలో సీఐ టి.గణేష్, ఎస్సై హరిబాబు భారీ బందోబస్తు నిర్వహించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ చైర్మన్ దాసరి చిన్నరమణ, పాలకమండలి సభ్యులు, కార్యనిర్వాహణాధికారి జోగి వెంకటేశ్వరరావు, పంచాయతీ కార్యదర్శి వెంకట్రావు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.


