ఆటోమేటిక్‌గా హామీకి తూట్లు! | - | Sakshi
Sakshi News home page

ఆటోమేటిక్‌గా హామీకి తూట్లు!

Apr 22 2025 12:12 AM | Updated on Apr 22 2025 12:12 AM

ఆటోమే

ఆటోమేటిక్‌గా హామీకి తూట్లు!

జగన్‌ ప్రభుత్వంలో వాహన మిత్రలకు

లబ్ధి ఇలా..

గతంలోని జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో తమకు పలు రూపాల్లో లబ్ధి అందేదని ఆటో కార్మికులు చెబుతున్నారు. ఏటా రూ.10 వేలతో పాటు వాహన డ్రైవర్‌ ప్రమాదవశాత్తూ చనిపోతే ఆ కుటుంబానికి రూ.10 లక్షల బీమా వర్తించేది. అలాగే వాహనాల కొనుగోలుకు బ్యాంక్‌ల నుంచి రుణాలు తీసుకునే డ్రైవర్లకు రూ.3 లక్షల వరకూ వడ్డీ రాయితీ అందించేది.

అటకెక్కిన ఆటో కార్మికుల సంక్షేమం

ఏటా రూ.15 వేలు ఇస్తామని కూటమి హామీ

అమలు కాక ఆటో వాలాల డీలా

సంక్షేమ బోర్డు ఏర్పాటూ మిథ్యే

గత ప్రభుత్వంలో వాహన మిత్ర ద్వారా రూ.10 వేల చొప్పున అందజేత

అమలాపురం టౌన్‌: ఎన్నికల హామీల అమలుకు ఏమాత్రం విలువ ఇవ్వని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆటో కార్మికుల విషయంలోనూ తన నైజాన్ని ప్రదర్శించారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఏరు దాటి తెప్ప తగలేసిన చందంగా కూటమి ప్రభుత్వం ఒక్కో హామీని అటకెక్కిస్తోంది. ఆటో వాలాలకు గత ప్రభుత్వంలో వాహన మిత్ర పథకం ద్వారా ఏటా రూ.10 వేలు ఇస్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆటో వాలాల సంక్షేమాన్నే విస్మరించి వారికి ఎలాంటి ఆర్థిక సాయం అందించడం లేదు. గత ఎన్నికల్లో కూటమి పార్టీల అగ్రనేతలు ఆటో కార్మికులకు ఏటా రూ.15 వేలు ఇస్తామని తమ ప్రచారాల్లో ఊదరగొట్టారు. ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చేర్చి టీడీపీ అధినేత చంద్రబాబు తెగ ఉపన్యాసాలు ఇచ్చేశారు. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాల ద్వారా అన్ని వర్గాల ప్రజలను సమానంగా చూస్తూ వారికి వివిధ పథకాల ద్వారా ఆర్థిక లబ్ధిని అందించింది. ఆ పథకాల పేర్లను మార్చి అప్పటి వరకు ఇస్తున్న ఆర్థిక లబ్ధిని పెంచి ఇస్తామని కూటమి పార్టీల పెద్దలు ఎన్నికల్లో హామీలు గుప్పించారు. తీరా అధికారం చేపట్టాక ఆ హామీలను గాలిలో కలిపేస్తున్న తీరే ఇప్పుడు ఆటో కార్మికులకు శాపంగా మారింది. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఠంచనుగా ఏటా ఆటో కార్మికుల బ్యాంక్‌ ఖాతాల్లో రూ.10 వేలు చొప్పున వేసి వారిని ఆర్థికంగా ఆదుకునే వారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలు ముగుస్తున్నా ఆటో కార్మికుల సంక్షేమ ఊసే వినిపించడం లేదని వారు వాపోతున్నారు. తమను గుర్తించిందీ, ఆదుకున్నదీ గత ప్రభుత్వమేనని చెబుతున్నారు. వాహన మిత్ర పధకం ద్వారా అప్పుడు ఏటా ఇచ్చే రూ.10 వేలు ఆటో మరమ్మతులు తదితర ఖర్చులకు, టాక్స్‌ల చెల్లింపులకు ఉపయోగపడేవని వారు అంటున్నారు.

సంక్షేమ బోర్డు హామీ అమలేదీ?

తాము అధికారంలోకి వస్తే ఆటో కార్మికులకు ఏటా రూ.15 వేలు ఆర్థిక సాయంతో పాటు సంక్షేమ బోర్డును ఏర్పాటుచేసి ఆదుకుంటామని ఎన్నికల్లో కూటమి నేతలు హామీ ఇచ్చారు. ఇప్పుడు రూ.15 వేలు హామీ అటుంచి కనీసం సంక్షేమ బోర్డు హామీనైనా అమలు చేయకపోవడంపై వారు వాపోతున్నారు. జిల్లాలో 16 వేల మంది ఆటో కార్మికులు ఉన్నారు. నిత్యం ఆటోలను నడుపుతూ జీవనోపాధి పొందుతున్నారు. గత ప్రభుత్వంలో వాహన మిత్ర పథకం కింద ప్రత్యేక బడ్జెట్‌ కేటాయించి అర్హులైన ఆటో, టాక్సీ, మాక్సీ క్యాబ్‌ డ్రైవర్లకు ఆదుకుంది. గతంలో అందుకున్న ఫలాలను ఆ రంగాల డ్రైవర్లు జ్ఞాపకం చేసుకుని కూటమి ప్రభుత్వం తమను ఎంత దగా చేసిందో అర్థమై ఇప్పుడు బాధపడుతున్నారు.

పెరుగుతున్న డీజిల్‌ ధరలతో

ఆపదలో ఆటో రంగం

తరుచూ పెరుగుతున్న డీజిల్‌ ధరలతో ఆటో రంగం కుదేలు అవుతోందని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆటో మెయింట్‌నెన్స్‌, పెరిగిన ధరలకు అనుగుణంగా డీజిల్‌ ఆయిల్‌ కొనుగోలు చేయడం తమకు భారంగా ఉందని అంటున్నారు. ఆటోల ద్వారా తమకు వచ్చిన ఆదాయంతో కుటుంబ పోషణ ఇబ్బందిగా ఉంటోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తనిఖీల పేరుతో పోలీస్‌, రవాణా శాఖ అధికారుల నుంచి జరిమానాలు వంటి ఇబ్బందులు తప్పడం లేదని అంటున్నారు. అటు ఆటో కొనుగోలుకు తీసుకున్న రుణాల వాయిదాల చెల్లింపుపరంగా కూడా అవస్థలు పడుతున్నామని చెబుతున్నారు.

ఆటో డ్రైవర్లను జగన్‌ ప్రభుత్వంలా ఆదుకోవాలి

ఆటో డ్రైవర్లను గత జగన్‌ ప్రభుత్వం వాహన మిత్ర పథకం ద్వారా ఆదుకున్నట్లే కూటమి ప్రభుత్వం కూడా ఆదుకోవాలి. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ఏటా రూ.15 వేలు ఇవ్వాలి. డ్రైవర్లు తమ ఆటోలకు ఫైనాన్స్‌లు కట్టలేక ఇబ్బందులు పడతున్నారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం స్పందించి ఆటో వాలాలను ఆదుకోవాలి. సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి. వచ్చే మే డే కార్మిక దినోత్సవానికై నా హామీలు అమలు చేస్తే ఆటో రంగం కుదుట పడుతుంది. లేకపోతే ఆటో కార్మికుల ఇబ్బందులకు కూటమి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది.

– వాసంశెట్టి సత్తిరాజు, అధ్యక్షుడు, ఆంధ్ర ఆటో వాలా వర్కర్స్‌ యూనియన్‌,

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా శాఖ

ఆటోమేటిక్‌గా హామీకి తూట్లు! 1
1/1

ఆటోమేటిక్‌గా హామీకి తూట్లు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement