గోదారి పాయల్లో హైలెస్సా..
● కోనసీమలో కేరళ తరహా పోటీలు
● సర్ ఆర్థర్ కాటన్ గోదావరి
ట్రోఫీకి రంగం సిద్ధం
● వేదిక కానున్న ఆత్రేయపురం
కొత్తపేట: సెంట్రల్ డెల్టాకు సాగునీరు అందించే ప్రధాన పంట కాలువలు. ఆ పక్కా.. ఈ పక్కా ప్రధాన రహదారులు. వాటిని ఆనుకుని పచ్చని వరిచేలు.. ఉద్యాన పంటలు, కొబ్బరితోటలు, సుమ వనాలు.. ప్రకృతి అందాలతో కనువిందైన వేదిక కోనసీమ. గౌతమి – వశిష్ట నదుల మద్య కోనసీమ అందాలు ప్రకృతి రమణీయాలు. ప్రధానంగా బొబ్బర్లంక బ్యారేజ్ నుంచి లొల్ల లాకుల మధ్య ప్రయాణం మరింత ఆహ్లాదం. ఇటువంటి చోట పంట కాలువలో కేరళ తరహా పడవ పోటీల నిర్వహణకు పర్యాటక శాఖ సిద్ధమైంది. సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ పడవల పోటీలు ఆదివారం ప్రారంభం కానున్నాయి. 13వ తేదీ వరకు ఈ పోటీలు జరగనున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచే కాక కేరళ తదితర రాష్ట్రాల నుంచి జట్లు ఈ పోటీల్లో పాల్గొననున్నాయి. లొల్ల లాకుల నుంచి ఉచ్చిలికి మధ్య సాగనున్న ఈ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు ఇప్పటికే చేరుకుని సాధన చేస్తున్నారు. కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ పర్యవేక్షణలో స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
సంక్రాంతికి మూడు రోజుల ముందే ఆత్రేయపురం ఉత్సవం పేరిట సంక్రాంతి సంబరాలు ఆదివారం వైభవంగా ప్రారంభం కానున్నాయి. గత ఏడాది రాష్ట్రస్థాయి డ్రాగన్ పడవల పోటీల స్ఫూర్తిని కొనసాగిస్తూ జాతీయస్థాయిలో పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం టూరిజం శాఖ, దాతలు, జిల్లా యంత్రాంగం సహకారంతో ఈ కార్యక్రమాలు జరగనున్నాయి. ఫుడ్ ఫెస్టివల్, డ్వాక్రా ఎగ్జిబిషన్ కమ్ సేల్స్, పిల్లలకు, మహిళలకు వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఆత్రేయపురం కేంద్రంగా తాడిపూడి వారధి నుంచి డ్రాగన్ పడవల పోటీలు, ఈత పోటీలు, ముగ్గుల పోటీలు నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయని నిర్వహకులు తెలిపారు. 11న ఈత పోటీలు, ముగ్గుల పోటీలు, 12, 13వ తేదీల్లో డ్రాగన్ పడవల పోటీలు, 13వ తేదీ గాలిపటాల పోటీలు జరగనున్నట్లు తెలిపారు. డ్రాగన్ పడవల పోటీల్లో పాల్గొనేందుకు ఆంధ్ర, కేరళ ఇతర రాష్ట్రాల నుంచి 250 మందితో 25 జట్లు పాల్గొంటున్నట్టు తెలిపారు. ఈత పోటీలకు జాతీయస్థాయిలో 200 మంది నమోదు చేసుకున్నారని తెలిపారు. 300 మంది ముగ్గుల పోటీల్లో పాల్గొనేందుకు, 100మంది గాలిపటాల పోటీల్లో పాల్గొనేందుకు నమోదు చేసుకున్నారని తెలిపారు. ఆత్రేయపురం మహాత్మాగాంధీ జూనియర్ కళాశాల ప్రాంగణంలో సినీ ఆర్కెస్ట్రా, నారీ నారీ నడుమ మురారి లాంచింగ్‌కు ప్రసిద్ధ సినీనటుడు శర్వానంద్ రానున్నారని తెలిపారు. మూడు రోజుల పాటు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. విజేతలకు నగదు బహుమతులు అందజేయనున్నారు.


