కాకరపల్లిలో ఘటన
తుని,కోటనందూరు: అత్తింటి వారి వేధింపులకు కొడుకుతో సహా ఓ తల్లి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కోటనందూరు మండలం కాకరాపల్లి గ్రామ శివారు తమ్మయ్య చెరువు వద్ద చోటుచేసుకుంది. సోమవారం మధ్యాహ్నం రెండు మృతదేహాలు ఆ చెరువులో తేలియాడుతూ ఉండడం కలకలం రేపింది. దీనిని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఏఎస్సై రమేష్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను బయటకు తీయించారు. ప్రాథమిక దర్యాప్తులో వారిది అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలం పెద్ద బొడ్డేపల్లికి చెందిన నెల్లి భాగ్యలక్ష్మి (35), ఆమె కుమారుడు సాయి ఇషాన్ (3)గా గుర్తించినట్టు తెలిపారు. పెద బొడ్డేపల్లికి చెందిన వడిశల దుర్గాప్రసాద్‌కు ధవళేశ్వరానికి చెందిన భాగ్యలక్ష్మికి కొన్నేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి మూడేళ్లు కుమారుడు సాయి ఇషాన్ ఉన్నాడు. కొంత కాలంగా భర్త, అత్త, ఆడపడుచులు వేధింపులకు గురి చేస్తున్నారని, దీంతో మానసిక వేదనకు గురైన భాగ్యలక్ష్మి కుమారుడితో సహా ఆత్మహత్య చేసుకుందని ఆమె సోదరుడు నెల్లి ఉదయ్‌సాగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నామని, మృతదేహాలను తుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని ఏఎస్సై వివరించారు.


