ఫలించని పడికాపులు! | - | Sakshi
Sakshi News home page

ఫలించని పడికాపులు!

Apr 18 2025 12:05 AM | Updated on Apr 18 2025 12:05 AM

ఫలించ

ఫలించని పడికాపులు!

సాక్షి, అమలాపురం: ‘రాష్ట్రం అంతా ఓడిపోతే 2019లో రాజోలు గెలిపించాం... ఇటీవల జరిగిన ఎన్నికల్లో రాజోలుతోపాటు పి.గన్నవరం గెలుపులో కూడా కీలక పాత్ర పోషించాం. కాని పదవులు కేటాయించాల్సి వచ్చేటప్పటికి మాత్రం మాకు ప్రాతినిధ్యం లేకుండా పోయింది. కాపు కాసినా గుర్తింపు లేకుండా పోయిందని మదనపడుతున్నారు జనసేనలోని కాపు సామాజికవర్గానికి చెందినవారు. కోనసీమ జిల్లాలో జనసేన ప్రాతినిధ్యం వహిస్తున్న రెండు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో నామినేటెడ్‌ పదవుల కేటాయింపులో జరుగుతున్న అన్యాయంపై సొంత పార్టీ ఎమ్మెల్యేలపై రగిలిపోతున్నారు.

చెదిరిన ఆశలు

గత ఎన్నికల్లో రాజోలు, పి.గన్నవరం నుంచి జనసేన తరఫున పోటీ చేసిన దేవ వరప్రసాద్‌, గిడ్డి సత్యనారాయణ గెలిచిన విషయం తెలిసిందే. ఈ రెండు ఎస్సీ నియోజకవర్గాలు కావడం గమనార్హం. రాజోలు నుంచి జనసేన వరుసగా రెండవసారి గెలవగా, పి.గన్నవరం నియోజకవర్గం పార్టీ సభ్యత్వాల నమోదులో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచింది. తమ ప్రయత్నాల వల్లే జనసేన అభ్యర్థులు గెలిచారని నియోజకవర్గంలో కాపు సామాజికవర్గం నాయకులు జబ్బలు చరుచుకున్నారు. నామినేటెడ్‌ పదవులలో తమకు సింహభాగం దక్కుతాయని ఆశించారు. జిల్లా, రాష్ట్రస్థాయి కార్పొరేషన్‌లు, అగ్రికల్చర్‌ మార్కెట్‌ కమిటీలు, ప్రధాన దేవస్థానాల చైర్మన్‌ పదవులలో సింహభాగం దక్కుతాయని ఆశించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి రోజులు గడుస్తున్న కొద్దీ వారి ఆశలు చెదిరిపోతున్నాయి.

రాష్ట్రస్థాయి కార్పొరేషన్‌ పదవులకు సంబంధించి ఈ రెండు నియోజకవర్గాల పరిధిలో కాపులకు ఒక్కరికి మాత్రమే అధికారికంగా అవకాశం దక్కింది. రాజోలు నియోజకవర్గం నుంచి ఏపీ మార్క్‌ఫెడ్‌ డైరెక్టర్‌ గుండుబోగుల నరసింహరావుకు డైరెక్టర్‌ పదవి వచ్చింది. కాపుల నుంచి అవకాశం వచ్చింది. అయితే పి.గన్నవరం నియోజకవర్గంలో అంబాజీపేటకు చెందిన శిరిగినీడి వెంకటేశ్వరరావును రాష్ట్ర జలవనరుల కార్పొరేషన్‌ డైరెక్టర్‌గా ఎంపిక చేశారు. కాని నెలలు గడుస్తున్నా ఉత్తర్వులు మాత్రం విడుదల కాకపోవడం గమనార్హం.

ఏఎంసీలలో మొండిచేయి

ఎమ్మెల్యే తరువాత నియోజకవర్గంలో కీలకమైనది అగ్రికల్చర్‌ మార్కెట్‌ కమిటీ (ఏఎంసీ) చైర్మన్‌ పదవి. రాజోలు నియోజకవర్గం పరిధిలో తాటిపాక, పి.గన్నవరం నియోజకవర్గం పరిధిలో అంబాజీపేట, నగరం మార్కెట్‌ కమిటీలున్నాయి. ఈ మూడు పదవులలో కాపు సామాజికవర్గానికి చెందినవారు నగరం, అంబాజీపేట ఆశించారు. ఈ మూడుచోట్ల వారికి అవకాశం లేకుండా పోయింది. నగరం ఏఎంసీ ఎస్‌సీ మహిళకు రిజర్వ్‌ కాగా జనసేనకు చెందిన పెనుమాల లక్ష్మికి అవకాశం కల్పించారు. అంబాజీపేట జనరల్‌ కాగా టీడీపీకి చెందిన చిట్టూరి శ్రీనివాస్‌ను ఎంపిక చేసి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. తాటిపాక ఏఎంసీని ఆనవాయితీ ప్రకారం బీసీలలో శెట్టిబలిజలకు ఇస్తున్నందున జనసేనకు చెందిన గుబ్బల ఫణికుమార్‌ను దాదాపుగా ఎంపిక చేశారు. ఇప్పుడు ఎస్సీలకు రిజర్వ్‌ అవుతోందని ప్రచారం జరుగుతోంది. ఇలా జరిగినా ఇక్కడ కాపులకు అవకాశం లేదు. జనరల్‌ అయినా కూడా బీసీలకే ఇవ్వాలని స్థానిక ఎమ్మెల్యే దేవ వర ప్రసాద్‌ నిర్ణయించినట్టు తెలిసిందే. దీంతో ఈ రెండు నియోజకవర్గాల పరిధిలోని మూడు ఏఎంసీలలో ఒక్కటి కూడా కాపులకు దక్కలేదు. నగరం, తాటిపాక కన్నా అంబాజీపేట ఏఎంసీ చైర్మన్‌ పదవి రాకపోవడం జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది జనసేన పార్టీలో కీలకంగా ఉన్న కొర్లపాటి గోపీకి దక్కుతుందని అందరూ భావించారు. జనసేనలోని ఒక వర్గం అడ్డుకుంది. ఇదే వర్గం ఈ పదవి టీడీపీలోని కాపులకు ఇవ్వాలని పట్టుబట్టడం... ఎమ్మెల్యే గిడ్డితో చివాట్లు తినడం విశేషం. ఈ విభేదాలను ఎమ్మెల్యే గిడ్డి తనకు అనుకూలంగా మలుచుకుని నగరంలో తనకు అత్యంత సన్నిహితులకు పదవి వచ్చేలా చూసుకున్నారు.

ధవళేశ్వరం మధ్య డెల్టా ప్రాజెక్టు కమిటీ చైర్మన్‌ గుబ్బల శ్రీనివాస్‌ (టీడీపీ)కి అవకాశం దక్కింది. ఈ పదవి తమకే వస్తుందని కాపులు ఆశించారు. ఇందుకు ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు. ఈ రెండు నియోజకవర్గాల పరిధిలో ఉన్న పెద్ద దేవాలయాలైన అంతర్వేది లక్ష్మీ నర్శింహస్వామి, అప్పనపల్లి శ్రీ బాలబాలాజీ స్వామి పాలకవర్గాల చైర్మన్‌ పదవులు సైతం ఈ సామాజికవర్గానికి దక్కే అవకాశం లేకుండా పోయింది. తమకు అవకాశం కల్పించాలని స్థానిక ఎమ్మెల్యేలు, పార్టీ అధిష్టానం పెద్దల వద్ద మొర పెట్టుకున్నారు.

ఇలా కీలక పదవులలో తమకు అవకాశం రాకపోవడంతో ఆ వర్గానికి చెందిన వారు సొంత పార్టీ ఎమ్మెల్యేలపై.. పార్టీ పెద్దల వద్ద పలు సందర్భాలలో మొర పెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది.

కోనసీమ జిల్లాలో

ఇద్దరు జనసేన ఎమ్మెల్యేలు

ఇద్దరి పరిధిలో

మూడు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌లు

నగరం ఏఎంసీ ఎస్‌సీ మహిళ...

రాజోలు ఎస్‌సీ, లేదా బీసీలకు అవకాశం

ఆశలు పెట్టుకున్న అంబాజీపేట లోకేశ్‌ కోటాలో కమ్మ వర్గానికి కేటాయింపు

గోదావరి ప్రాజెక్టు కమిటీలోనూ

చేదు ఫలితమే

సొంత పార్టీ ఎమ్మెల్యేలపై

మండిపడుతున్న ఆ వర్గీయులు

ఫలించని పడికాపులు!1
1/1

ఫలించని పడికాపులు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement