రోజుకో పదం.. అందుకో ఆంగ్ల పథం

రాయవరం ఎంపీపీ పాఠశాలలో విద్యార్థులకు ఆంగ్ల పదాలు నేర్పిస్తున్న టీచరు సత్యనారాయణమ్మ    - Sakshi

ఇంగ్లిషు అభ్యసనే లక్ష్యంగా ముందుకు

ప్రతి 15రోజులకు ఒకసారి విద్యార్థులకు పరీక్ష

పక్కాగా అమలుకు విద్యాశాఖ ఆదేశాలు

రాయవరం: ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియంకు ప్రాధాన్యం పెరిగింది. గతంలో కేవలం ఉన్నత పాఠశాలల్లో సక్సెస్‌ స్కూళ్లలో మాత్రమే ఇంగ్లిషు మీడియం ఉండగా, ఇప్పుడు ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో కూడా పూర్తి స్థాయిలో ఇంగ్లిషు మీడియం ప్రవేశ పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లిషుపై విద్యార్థుల్లో ఉన్న భయాందోళనలను పోగొట్టేందుకు ‘లెర్న్‌ ఏ వర్డ్‌ ఏ డే’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు.

లాంగ్వేజ్‌ ఇంప్రూవ్‌మెంట్‌ ప్రోగ్రామ్‌లో భాగంగా గత విద్యా సంవత్సరంలో ప్రభుత్వం అమలు చేసింది. ఈ ఏడాది కూడా అమలుకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 19వ తేదీ నుంచి పాఠశాలల్లో ‘లెర్న్‌ ఏ వర్డ్‌ ఏ డే’ ప్రారంభించారు. ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ప్రతి రోజూ ఆంగ్ల పదాలను విద్యార్థులకు నేర్పిస్తున్నారు.

విద్యార్థులు ‘లెర్న్‌ ఏ వర్డ్‌ ఏ డే’లో ఆంగ్ల పదాలు ఎంతవరకు నేర్చుకున్నారు? ఏ మేరకు పదాలను అవగాహన చేసుకున్నారన్న విషయం తెలుసుకునేందుకు పాఠశాల విద్యాశాఖ ప్రతి 15 రోజులకు ఒకసారి పరీక్షను కూడా నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం వలన విద్యార్థులకు రీడింగ్‌, రైటింగ్‌ స్కిల్స్‌ అభివృద్ధి చెందుతున్నాయని ఉపాధ్యాయులు చెబుతున్నారు.

నాలుగు దశల్లో..

ప్రతి రోజు పాఠశాల అసెంబ్లీలోనే ‘లెర్న్‌ ఏ వర్డ్‌ ఏ డే’ ప్రోగ్రామ్‌లో ఆరోజు చెప్పాల్సిన పదాలను విద్యార్థులకు పరిచయం చేస్తున్నారు. అనంతరం ఫస్ట్‌ పీరియడ్‌లో విద్యార్థులకు కేటాయించిన నోట్సులో పదాలను రాయిస్తున్నారు. ఆ పదాలతో సొంత వాక్యాలను తయారు చేసి వారితో చదివిస్తున్నారు. ఒకటి, రెండు తరగతులను ఒకటవ స్థాయి, 3,4,5 తరగతులను రెండు, 6,7,8 తరగతులను మూడు, 9,10 తరగతులను నాల్గవ స్థాయిగా విభజించారు.

ప్రతి రోజూ కొన్ని పదాలను విద్యార్థులకు చెప్పి సాధన చేయించారు. తొలి దశలో పదాల ఉచ్ఛారణ, మౌఖిక అభ్యసనం, రెండవ దశలో స్పెల్లింగ్‌ గేమ్‌, మూడవ దశలో డిక్షనరీ సహకారంతో భాషాభాగాల గుర్తింపు, నాల్గవ దశలో సమాన అర్థాలను, వ్యతిరేక పదాలను కనుగొనడం నేర్పిస్తున్నారు. ప్రతిరోజూ ఒక పదాన్ని బోర్డుపై రాసి, విద్యార్థులతో రాయిస్తున్నారు. ఈ కార్యక్రమం నిమిత్తం 100 పేజీల పుస్తకాన్ని కేటాయించారు. ప్రతి 15రోజులకు ఒకసారి విద్యార్థులు సాధన చేసిన పదాలపై స్ఫెల్‌ బీ పేరుతో డిక్టేషన్‌ నిర్వహిస్తున్నారు. ఫలితాలను మదింపు చేసి విద్యార్థులకు అవసరమైన సూచనలు ఇస్తున్నారు.

1,588 పాఠశాలల్లో..

లెర్న్‌ ఏ వర్డ్‌ ఏ డే కార్యక్రమం ఈ నెల 19 నుంచి ప్రారంభం కాగా, విద్యా సంవత్సరం ముగిసే వరకు కొనసాగనుంది. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పరిధిలో వివిధ ప్రభుత్వ యాజమాన్యాల కింద 1,275 ప్రాథమిక, 78 ప్రాథమికోన్నత, 235 ఉన్నత పాఠశాలలున్నాయి. ఈ పాఠశాలల్లో 1,2 తరగతులు 32,658 మంది, 3,4,5 తరగతులు 65వేలు, 6,7 తరగతులు 44,561 మంది, 8,9,10 తరగతులు 61,795 మంది విద్యాభ్యాసం చేస్తున్నారు. వీరందరికీ ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు.

చాలా ప్రయోజనం

‘లెర్న్‌ ఏ వర్డ్‌ ఏ డే’ ప్రోగ్రామ్‌ విద్యార్థులకు చాలా ప్రయోజనకరం. ఆంగ్లంపై విద్యార్థులు పట్టు సాధించేందుకు ఈ విధానం చక్కని మార్గం. విద్యాకానుకలో భాగంగా విద్యార్థులకు డిక్షనరీలు కూడా అందజేశాం. ఆంగ్లభాషా పదాలపై పట్టు, మాట్లాడే నైపుణ్యం పెంపొందించుకునేందుకు డిక్షనరీల వినియోగం ఉపకరిస్తుంది.

– జి.నాగమణి, ప్రాంతీయ సంయుక్త తనిఖీ అధికారి, పాఠశాల విద్యాశాఖ, కాకినాడ

పర్యవేక్షణలో భాగం చేశాం

పాఠశాలల్లో విద్యార్థులు ప్రతి రోజూ ఒక ఆంగ్ల పదం నేర్చుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని తప్పనిసరిగా పాఠశాలల్లో అమలు చేస్తున్నాం. ప్రతి పర్యవేక్షణ అధికారి ‘లెర్న్‌ ఎ వర్డ్‌ ఎ డే’ కార్యక్రమం అమలును తనిఖీ చేసేలా పర్యవేక్షణలో భాగం చేశాం.

– ఎం.కమలకుమారి, డీఈవో, కోనసీమ జిల్లా
 

Read also in:
Back to Top