ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. ఇద్దరు పిల్లలు పుట్టాక.. | Young Woman Protest Infront Of husband House | Sakshi
Sakshi News home page

మొదటి భార్య దీక్ష, మరో అమ్మాయితో రహస్యంగా పెళ్లి !

Jul 17 2023 10:08 AM | Updated on Jul 17 2023 10:08 AM

Young Woman Protest Infront Of husband House - Sakshi

కర్నూలు: తనను ప్రేమించి.. పెళ్లి చేసుకొని.. ఇద్దరు పిల్లలు జన్మించాక వదిలేయడం అన్యాయమని, తనకు న్యాయం చేయాలంటూ రజియాబీ అనే మహిళ ఆదివారం భర్త వినోద్‌కుమార్‌ ఇంటి ఎదుట బైఠాయించింది. వివరాలు.. కడివెళ్ల గ్రామానికి చెందిన గొల్ల వినోద్‌కుమార్‌ తమ ఇంటి సమీపంలో నివాసముంటున్న రజియాబీనీ ప్రేమించాడు. 13 సంవత్సరాల క్రితం ముంబైకి తీసుకెళ్లి పెళ్లి చేసుకొని కాపురం పెట్టారు. ఎనిమిదేళ్ల క్రితం కాపురాన్ని ఎమ్మిగనూరుకు మార్చాడు. వీరికి గొల్ల తేజ(7), గొల్ల అంజలి(5) ఇద్దరు సంతానం ఉన్నారు. ఎమ్మిగనూరు నుంచి స్వగ్రామమైన కడివెళ్లకు వెళ్లి వస్తూ ఉండేవాడు. 

ఈ నేపథ్యంలో వర్గం యువతిని పెళ్లి చేసుకున్నావని, కులం వాళ్లు నుంచి మాట వస్తోందని వినోద్‌కుమారుకు కుటుంబసభ్యులు చెబుతూ వచ్చారు. దీంతో కొన్ని నెలల నుంచి రజియాబీకి దూరంగా ఉండటం ప్రారంభించాడు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు గుట్టుచప్పుడు కాకుండా నెల క్రితం కర్ణాటకలోని తమ బంధువుల అమ్మాయితో వినోద్‌కుమార్‌కు రహస్యంగా పెళ్లి జరిపించారు. 

విషయం తెలుసుకున్న రజియాబీ రూరల్‌  పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో ఈ నెల 5న వినోద్‌కుమార్‌తో పాటు మరో ఐదుగురు కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు. అయితే తనకు న్యాయం చేసేంత వరకు భర్త ఇంటి ముందు నుంచి కదలబోనని కడివెళ్లలో రజియాబీ ఆదివారం దీక్షకు దిగింది. విషయం తెలుసుకున్న రూరల్‌ పోలీసులు అక్కడికి చేరుకుని సర్దిచెప్పారు. అయినా ఆమె వినుకోలేదు.  తన భర్త ఇంట్లోకి పిలుచుకోవాలని లేదంటే బయటే కూర్చుంటానని తేల్చిచెప్పారు. వినోద్‌ కుటుంబ సభ్యులతో పోలీసులు చర్చిస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement