మహిళ అదృశ్యం మిస్టరీ వీడేనా?

Woman Missing Case Tension In Khajipet, YSR Kadapa - Sakshi

16 రోజులైనా లభించని ఆచూకీ

ఆందోళన చెందుతున్న కుటుంబ సభ్యులు

సాక్షి, ఖాజీపేట: మండలంలో ఇంటి నుంచి 16 రోజుల కిందట బయటకు వెళ్లిన ఓ మహిళ ఆచూకీ నేటికీ లభించలేదు. పోలీసులు, కుటుంబ సభ్యులు వెతుకుతున్నా.. చిన్న సమాచారం కూడా లభ్యం కాలేదు. ఆమె అదృశ్యం పోలీసులకు పెద్ద మిస్టరీగా మారింది. ఆ మహిళ తల్లిదండ్రులు పోలీసులకు చేసిన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. చాపాడు మండలం మడూరు గ్రామానికి చెందిన పి.హరితను ఖాజీపేట మండలం సుంకేశుల దళితవాడకు చెందిన కె.రెడ్డయ్యకు 2016లో ఇచ్చి వివాహం చేశారు. అప్పటి నుంచి అత్తతో తరచూ విభేదాలు వస్తుండేవి. ఇవి ఎక్కువై 2017లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. అక్కడే ఉన్న భర్త గుర్తించి కాపాడాడు. తరువాత ఇరువురి కుటుంబ సభ్యులు కలిసి వారికి సర్దిచెప్పారు. అనంతరం వారికి ఒక పిల్లవాడు కలిగాడు. అయితే అత్త, కోడలు మధ్య మాటల యుద్ధం జరుగుతూనే ఉండేది. డిసెంబర్‌లో తీవ్ర జ్వరంతో పుట్టింటికి వెళ్లింది. అదే నెల 21న అత్తగారి ఇంటికి వచ్చింది. వచ్చిన గంట సేపు మాత్రమే ఉంది. ఇంతలోనే పిల్లవాన్ని అక్కడే వదిలేసి బయటకు వెళ్లింది. అప్పటి నుంచి ఆమె ఆచూకీ లభించలేదు.

పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు 
మహిళ అదృశ్యంపై తండ్రి రామాంజనేయులు ఎస్‌ఐ అరుణ్‌రెడ్డికి డిసెంబర్‌ 21న ఫిర్యాదు చేశాడు. విచారణ చేస్తామని, మీ అమ్మాయిని గుర్తించి తీసుకు వస్తామని ఎస్‌ఐ హామీ ఇచ్చారు. అయితే 16 రోజులు గడిచినా గుర్తించలేదని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్వరగా ఆచూకీ లభించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

సెల్‌ఫోన్‌ ఒక్కటే ఆధారమా!
ఆమె వాడిన సెల్‌ఫోన్‌ ఆధారంగా పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. అయితే 21వ తేది నుంచి ఆమె ఒక్క మారు మాత్రమే ఆన్‌ చేసి ఆఫ్‌ చేసింది. ఫోన్‌ వాడకపోవడం వల్లనే గుర్తించడం ఆలస్యం అవుతోందని మైదుకూరు రూరల్‌ సీఐ కొండారెడ్డి తెలిపారు. అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. (చదవండి: నమ్మించి.. రూ.25 కోట్లకు ముంచారు)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top