చిట్టీ డబ్బులు అడిగినందుకు .. ఒంటిపై పెట్రోల్‌ పోసి..

Warangal Chit Fund Members Poured Petrol On Man For Asking Money - Sakshi

డబ్బులు అడిగినందుకు చిట్‌ఫండ్‌ యాజమాన్యం ఘాతుకం

గ్రేటర్‌ వరంగల్‌లో ఘటన  

నయీంనగర్‌: ‘చిట్టీ డబ్బులు ఎందుకు ఇవ్వరు’.. అని నిలదీసినందుకు చిట్‌ఫండ్‌ యాజమాన్యం మనుషులు ఓ వ్యక్తిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. శుక్రవారం గ్రేటర్‌ వరంగల్‌లో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. హనుమకొండకు చెందిన పిట్టల రాజు(30) అచల చిట్‌ఫండ్‌ కంపెనీలో రూ.5 లక్షల చీటీ వేసి ఇటీవల పాడుకున్నాడు.

అయితే  యాజమాన్యం డబ్బులు ఇవ్వకుండా రాజును తిప్పించుకుంటోంది. ఈ క్రమంలో అతను గురువారం చిట్‌ఫండ్‌ కార్యాలయానికి వెళ్లి తన డబ్బులు ఎందుకు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో  యాజమాన్యం.. రాజుపై దాడిచేసేందుకు తమ కంపెనీలోని ఏజెంట్‌ గణేశ్, అతని భార్య కావ్యలను పురమాయించింది. శుక్రవారం సాయంత్రం రాజు, అతని భార్య సిరి తమ సెల్‌ఫోన్‌ దుకాణంలో ఉండగా కావ్య, గణేశ్‌ బైక్‌పై వచ్చారు.

బాటిల్‌లో వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను రాజుపై  కావ్య పోయగా గణేశ్‌ లైటర్‌తో నిప్పంటించాడు. మంటలు చుట్టుముట్టడంతో రాజు దుకాణంనుంచి బయటకు పరుగెత్తుకుని వచ్చాడు. మంటలను ఆర్పేందుకు సిరి ప్రయత్నిస్తుండగా గణేశ్, కావ్యలు మరోసారి రాజుపై పెట్రోల్‌ పోసి   పరారయ్యారు. ఈ క్రమంలో సెల్‌షాపు ఎదురుగా ఉన్న పాన్‌షాప్‌ రంగయ్యకు కూడా మంటలు అంటుకుని గాయాలయ్యాయి. స్థానికులు వారిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. రాజు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ దారుణానికి పాల్పడ్డ కావ్య, గణేశ్‌లపై రాజు భార్య సిరి హనుమకొండ పోలీసులకు ఫిర్యాదు చేసింది.  
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top