కటకటాల్లోకి కల్లాడ వీఆర్‌ఏ.. 

VRA Arrested In Revenue Records Tampering Case - Sakshi

సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుడ్ని పట్టుకున్న పోలీసులు

నందిగాం(శ్రీకాకుళం జిల్లా): రెవెన్యూ రికార్డుల తారుమారు కేసులో కల్లాడ పంచాయతీ వీఆర్‌ఏని అరెస్టు చేశామని  ఎస్సై ఎస్‌.బాలరాజు బుధవారం తెలిపారు.  తప్పుడు రికార్డులు సృష్టించి సుమారు 30 ఎకరాల లేని భూమి ఉన్నట్లుగా చేసి అమాయకులకు అమ్మజూపి వారి నుంచి లక్షలాది రూపాయలు దోచుకున్న తెలుగుదేశం పార్టీ నాయకుడు మదన్‌గౌడ్‌కు వీఆర్‌ఏ కొత్తపల్లి ఢిల్లేశ్వరరావు సహకరించినట్టు తేలింది. కంప్యూటర్‌ పరిజ్ఞానంతో రెవెన్యూ కార్యాలయంలో తిష్ట వేసిన ఢిల్లేశ్వరరావు రెవెన్యూ రికార్డులను తారుమారు చేసి మదన్‌గౌడ్‌కు సహాయం చేశాడని, అందుకు ప్రతిఫలంగా రూ.1.25 లక్షలు పుచ్చకున్నాడని పక్కా ఆ«ధారాలు సేకరించడంతో అరెస్టు చేసి జైలుకు పంపించామని ఎస్సై పేర్కొన్నారు. నందిగాం తహసీల్దారు కార్యాలయంలో అవుట్‌సోర్సింగ్‌లో పద్ధతిలో కంప్యూటర్‌ ఆపరేటర్‌ పని చేసేవారు. అయితే కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉన్న వీఆర్‌ఏ ఢిల్లేశ్వరరావును గతంలో అధికారులు నియామకం చేశారు.

ఇదే అదునుగా ప్రతి చిన్న పనికీ లంచం తీసుకోవడానికి అలవాటు పడిన ఆయన టీడీపీ నాయకులకు పూర్తి సహాయసహకారాలు అందిస్తుండేవాడని తెలిసింది. రెవెన్యూ రికార్డుల వ్యవహారంలో ప్రతి చిన్న పనికి తహసీల్దారు డిజిటల్‌ సంతకం అవసరం కావడంతో దానికి సంబంధించిన ‘కీ’ని అప్పుడప్పుడూ ఢిల్లేశ్వరరావు వినియోగించేవాడు. అయితే ఇదే అదునుగా భావించిన మదన్‌గౌడ్‌ ఢిల్లేశ్వరరావు ద్వారా మండలంలోని పలుచోట్ల రెవెన్యూ రికార్డులను తారుమారు చేసేందుకు రూ.1.25 లక్షలు ముట్టజెప్పాడు. అయితే భూముల కోనుగోలు చేసిన హైదారాబాద్‌కు చెందిన వ్యక్తికి అనుమానం రావడంతో కార్యాలయానికి వెళ్లి ఆరా తీయడంతో రికార్డుల తారుమారు వ్యవహారం జూలైలో బయటకు వచ్చింది. అంతేకాక బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన నందిగాం పోలీసులు గతంలో ప్రధాన నిందితుడు మదన్‌గౌడ్‌ను అరెస్టు చేశారు. రికార్డుల తారుమారులో తహసీల్దారు కార్యాలయ సిబ్బంది పాత్రపై అనుమానం ఉన్న పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టగా వీఆర్‌ఏ ఢిల్లేశ్వరరావుపై అనుమానం వచ్చి ఆరా తీయగా నిజాలు బయటకు వచ్చాయి. దీంతో మదన్‌గౌడ్‌ నుంచి పుచ్చుకున్న రూ.1.25 లక్షల్లో పోలీసులు రూ.లక్ష రికవరీ చేయడంతో పాటు ఢిల్లేశ్వరరావును అరెస్టు చేసి నరసన్నపేట సబ్‌జైల్‌కు పంపించారు. రెవెన్యూ రికార్డుల తారుమారు వ్యవహారంలో మరింత లోతుగా దర్యాప్తు చేస్తే మరిన్ని నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉందని పలువురు అంటున్నారు.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top