బడి నుంచి మృత్యు ఒడికి...

Two students deceased in School auto overturned - Sakshi

స్కూల్‌ ఆటో బోల్తా... ఇద్దరు విద్యార్థినుల మృతి 

నంద్యాల జిల్లా నేరేడుచెర్లలో దుర్ఘటన

ప్యాపిలి(నంద్యాల): మరో ఐదు నిమిషాల్లో బడి నుంచి తమ ఇళ్లకు చేరుకోవాల్సిన ఇద్దరు పిల్లలు... డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగా ఆటో బోల్తా కొట్టడంతో మృత్యుఒడికి చేరుకున్నారు. అప్పటి వరకు తమతో సరదాగా గడిపిన స్నేహితులు ఒక్కసారిగా రక్తపు మడుగులో అచేతనంగా పడి ఉండటం సహచర విద్యార్థులను కలచివేసింది. ఈ హృదయవిదారక ఘటన నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం నేరేడుచెర్ల వద్ద శనివారం జరిగింది.

రాచర్ల ఉన్నత పాఠశాలలో నేరేడుచెర్ల గ్రామానికి చెందిన శివమ్మ, రంగన్న దంపతుల కుమార్తె రజని(15) పదో తరగతి, ఐరా, మదార్‌ దంపతుల కుమార్తె షాహిదాబి(13) ఎనిమిదో తరగతి చదువుతున్నారు. వీరితోపాటు అదే గ్రామానికి చెందిన మరో 18 మంది విద్యార్థులు కూడా రాచర్ల ఉన్నత పాఠశాలలోనే విద్యనభ్యసిస్తున్నారు. వీరంతా ప్రతి రోజు ఉదయం ఆర్టీసీ బస్సులో పాఠశాలకు వెళ్తారు.

సాయంత్రం ఆటోలో ఇంటికి చేరుకుంటారు. యథావిధిగా శనివారం సాయంత్రం నాలుగు గంటలకు పాఠశాల ముగిసిన తర్వాత ఆటోలో నేరేడుచెర్లకు బయలుదేరారు. అతి వేగంగా వెళుతున్న ఆటో గ్రామ శివారులో మలుపు వద్ద అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఆటో డోర్‌ వైపు కూర్చున్న రజని, షాహిదాబి ఎగిరి రోడ్డుపై పడగా, వారి మీద ఆటో పడటంతో ఇద్దరి తలలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మరణించారు.

మిగిలిన విద్యార్థులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే స్థానికులు పెద్ద ఎత్తున వచ్చి సహాయక చర్యలు చేపట్టారు. పిల్లల రోదనలతో ఘటనాస్థలం దద్దరిల్లింది. రాచర్ల పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. 

సొంత ఆటోలో వస్తూనే.. 
ప్రమాదంలో మృతిచెందిన షాహిదాబి తండ్రి మదార్‌కు టాటా మ్యాజిక్‌ ఆటో ఉంది. ప్రతి రోజు సాయంత్రం మదార్‌ రాచర్ల ఉన్నత పాఠశాలకు వెళ్లి తన కుమార్తెతోపాటు మిగిలిన విద్యార్థినులను ఆటోలో ఎక్కించుకుని నేరేడుచెర్లకు తీసుకువచ్చేవాడు.

అయితే, మదార్‌కు శనివారం వ్యక్తిగత పని ఉండటంతో వెళ్లలేదు. తమ గ్రామానికే చెందిన శివ అనే డ్రైవర్‌ను పంపాడు. అతను వేగంగా నడపడం వల్లే ఆటో బోల్తా పడి షాహిదాబి, రజని మృతిచెందారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తంచేశారు.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top